NT Ramarao: విదేశీయులను ఆకట్టుకున్న 'అగ్గిబరాటా'
ABN, Publish Date - Jun 02 , 2026 | 02:25 PM
ఎన్టీఆర్, విఠలాచార్య కాంబినేషన్ లో వచ్చిన 'అగ్గిబరాటా' విడుదలై 60 సంవత్సరాలైంది. ఎన్టీఆర్ సరసన రాజశ్రీ నాయికగా నటించిన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది.
నటరత్న యన్టీఆర్ హీరోగా బి.విఠలాచార్య నిర్మించి దర్శకత్వం వహించిన 'అగ్గిబరాటా' 60 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ జానపద చిత్రంలో రాజకీయాల ఎత్తుకు పైఎత్తులు, మాయలు, మంత్రాలు జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి.
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్టీఆర్ (NTR) -జానపద బ్రహ్మ బి.విఠలాచార్య కాంబినేషన్ లో వచ్చిన నాల్గవ చిత్రం 'అగ్గిబరాటా' (Aggibarata). అంతకు ముందు వీరిద్దరి కాంబోలో రూపొందిన 'బందిపోటు, అగ్గి-పిడుగు, మంగమ్మశపథం' చిత్రాలు ఘనవిజయం సాధించాయి. వీటిలో 'అగ్గి-పిడుగు' విఠలాచార్య సొంత సినిమా. 'అగ్గిబరాటా' కూడా విఠలాచార్య నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రమే. 1966 జూన్ 2వ తేదీన విడుదలయిన 'అగ్గిబరాటా' కూడా హిట్ అయింది. ఇందులో యన్టీఆర్ జోడీగా రాజశ్రీ (Rajasri) నటించారు. ఈ మూవీలో రామదాస్ విలన్ గా కనిపించారు. రమణారెడ్డి భమ్ భమ్ బసవయ్యగా, ముక్కామల కొండ బూచయ్యగా అభినయించారు. మిక్కిలినేని, వాణిశ్రీ, బాలకృష్ణ ఇతర ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రానికి విజయా కృష్ణమూర్తి సంగీతం సమకూర్చగా, డాక్టర్ సి.నారాయణ రెడ్డి, కొసరాజు పాటలు రాశారు. జి.కె.మూర్తి ఈ చిత్రానికి రచన చేశారు.
అంతకు ముందు యన్టీఆర్ తో విఠలాచార్య రూపొందించిన మూడు చిత్రాల్లోనూ ఎక్కడా మాయలు, మంత్రాలు కానరావు. యన్టీఆర్- విఠలాచార్య కాంబోలో తెరకెక్కిన తొలి మాయల చిత్రం 'అగ్గిబరాటా' అనే చెప్పాలి. ఇందులో కథానాయకునికి భమ్ భమ్ బసవయ్య వరుసకు అన్న అవుతాడు. కొండ బూచయ్య అనే మాయలమారిని ప్రతినాయకుడు తనకు సాయం చేయమని కోరతాడు. అందుకు కొండ బూచోడు అంగీకరిస్తాడు. అలా భమ్ భమ్ బసవయ్య, కొండ బూచయ్య మధ్య సాగిన మాయలు, మంత్రాల దృశ్యాలు ప్రేక్షకులకు భలే వినోదం పంచాయి. తరువాతి రోజుల్లో 'అగ్గిబరాటా' మూవీ కొన్ని విదేశీ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమయింది. 'అగ్గిబరాటా'ను వీక్షించిన విదేశీయులు భవిష్యత్ లో ఈ తరహా చిత్రాలు అలరిస్తాయి అని కితాబు నిచ్చారు. అంతకు ముందు ఈ తరహా కథలతో ఆంగ్ల చిత్రాలు రూపొందినా, 'అగ్గిబరాటా'ను చూసిన విదేశీయులు విఠలాచార్య పంథాను అనుసరించడం విశేషం.
పలు ప్రయోగాలు!
ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలలో మారువేషాలు పోషించి మెప్పించిన ఏకైక నటునిగా యన్టీఆర్ కీర్తినొందారు. యన్టీఆర్ పర్సనాలిటీని దృష్టిలో పెట్టుకొనే విఠలాచార్య అనువైన చోట ఆయనతో మారువేషాలు వేయించేవారు. మొదటి మూడు చిత్రాల్లో కన్నా మిన్నగా 'అగ్గిబరాటా'లో యన్టీఆర్ ను వరైటీ గెటప్స్ లో చూపించారు.. అలాగే 'అగ్గిబరాటా'లో కథానాయకుడు రాజకోటలోకి ప్రవేశించడానికి ఉపాయం పన్ని, గాలిపటంపై ఎగురుతూ వెళ్ళడం అప్పట్లో విశేషంగా ముచ్చటించుకున్నారు. 'అగ్గిబరాటా' ఘనవిజయం సాధించి, శతదినోత్సవం చూసింది. రిపీట్ రన్స్ లోనూ విశేషంగా అలరించింది.
ఇవి కూడా చదవండి:
Nandu's World: ఇన్ ఫ్లుయెన్సర్ వీసాల దందా... ఖండించిన నందు!
I MAX: హైదరాబాద్‌కు.. ఐమాక్స్ వచ్చేస్తోంది
మైథలాజికల్ ఫాంటసీ 'జటాయు' వర్కౌట్ అవుతుందా!?