సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఎన్టీఆర్ - దాసరి ఫస్ట్ కాంబినేషన్‌లో 'మనుషులంతా ఒక్కటే'

ABN, Publish Date - Apr 07 , 2026 | 04:07 PM

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్టీఆర్ నటించిన రెండు చిత్రాల విశేషాలను ఈ రోజు ఫ్యాన్స్ గుర్తు చేసుకున్నారు. అందులో మొదటిది 'పరమానందయ్య శిష్యుల కథ' 60 ఏళ్ళ ముచ్చట... రెండోది 'మనుషులంతా ఒక్కటే' 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడం.

NTR

నటరత్న యన్టీఆర్, దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబోలో వెలుగు చూసిన తొలి చిత్రం 'మనుషులంతా ఒక్కటే'. ఈ చిత్రాన్ని ప్రముఖ కళాదర్శకుడు రాజేంద్రకుమార్ నిర్మించారు. 1976 ఏప్రిల్ 7 వ తేదీన విడుదలైన 'మనుషులంతా ఒక్కటే' విశేషాదరణ చూరగొంది. వసూళ్ళలో రికార్డులు సృష్టించింది. పేదవారిని నీచంగా చూసే ఓ జమీందార్ కొడుకులో ఓ పేదింటి అమ్మాయి పరివర్తన తీసుకు వస్తుంది. ఆమె కోసం ఇల్లు వదలి వెళతాడు జమీందార్ తనయుడు. పంతం పట్టిన జమీందార్ దాడి చేయిస్తే, అతని కొడుకే మరణిస్తాడు. తరువాత మనవడు వచ్చి తాతను ఆటపట్టించి 'మనుషులంతా ఒక్కటే' అని చాటిచెబుతాడు. ఈ కథను దాసరి తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది. 'మనుషులంతా ఒక్కటే' చిత్రానికి కొసరాజు, సి.నారాయణ రెడ్డి పాటలు రాశారు. యన్టీఆర్ సినిమా టైటిల్స్‌తోనే 'నిన్నే పెళ్ళాడుతా....' అంటూ సాగే పాటను దాసరి నారాయణరావు రచించారు. యస్. రాజేశ్వరరావు స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ చూరగొన్నాయి. ఈ సినిమాలో దాసరి నారాయణరావు రాసిన సంభాషణలు సైతం ప్రేక్షకులను రంజింప చేశాయి. ఇందులో జమున, మంజుల, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, రమాప్రభ, నగేశ్ ముఖ్యపాత్రధారులు. యన్టీఆర్ 'ఆరాధన' సినిమా సూపర్ హిట్ టాక్ తో సాగుతున్న రోజుల్లో వచ్చి 'మనుషులంతా ఒక్కటే' సైతం శతదినోత్సవం జరుపుకోవడం విశేషం!


మరపురాని నవ్వుల సందడి!

నటరత్న యన్టీఆర్ హీరోగా సి.పుల్లయ్య దర్శకత్వంలో తోట సుబ్బారావు నిర్మించిన 'పరమానందయ్య శిష్యుల కథ' 1966 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలచింది. అంతకు ముందు ఏయన్నార్‌తో కమెడియన్ కస్తూరి శివరావు తీసిన 'పరమానందయ్య శిష్యులు' రంజింప చేయలేక పోయింది. అయినా అదే సబ్జెక్ట్ ను జనరంజకంగా మలిచారు సి. పుల్లయ్య. ఇందులో నందివర్ధన మహారాజుగా యన్టీఆర్, చిత్రలేఖగా కె.ఆర్. విజయ, రాజనర్తకి రంజనిగా ఎల్.విజయలక్ష్మి అభినయించారు. పరమానందయ్యగా చిత్తూరు నాగయ్య, ఆయన శిష్యుల పాత్రల్లో పద్మనాభం, అల్లు రామలింగయ్య, రాజబాబు, సారథి, మోదుకూరి సత్యం, రామచంద్రరావు, చంద్రమౌళి నటించారు. శివుని పాత్రలో శోభన్ బాబు కనిపించారు. ఇందులోని హాస్యసన్నివేశాలు ఇప్పటికీ నవ్వులు పూయిస్తూనే ఉన్నాయి. ఈ చిత్రానికి ఘంటసాల సంగీతం సమకూర్చారు. సదాశివబ్రహ్మం, సముద్రాల రాఘవాచార్య, కొసరాజు, శ్రీశ్రీ, సి.నారాయణరెడ్డి పాటలు పలికించారు. 1966 ఏప్రిల్ 7న విడుదలైన ఈ చిత్రం 16 కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. రజతోత్సవం జరుపుకుంది. రిపీట్ రన్స్ లో విశేషాదరణ చూరగొంది. ఈ నాటికీ 'పరమానందయ్య శిష్యుల కథ' చిత్రం అడపాదడపా బుల్లితెరపై సందడి చేస్తూనే ఉండడం విశేషం.

Updated Date - Apr 07 , 2026 | 04:07 PM