Navaratri: తొమ్మిది పాత్రల్లో కనిపించిన ఏయన్నార్
ABN, Publish Date - Apr 22 , 2026 | 03:34 PM
నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా రూపొందిన 'నవరాత్రి' 60 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఆరు పదుల క్రితం 'నవరాత్రి' ఏ తీరున సాగిందో గుర్తు చేసుకుందాం.
'నవరాత్రి' (Navaratri) అనగానే మనకు దసరాకు వచ్చే శరన్నవరాత్రులు గుర్తుకు వస్తాయి. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని అమ్మాయిలు భక్తిశ్రద్ధలతో పూజిస్తే కోరుకున్నవాడితో కళ్యాణం జరుగుతుందనే నమ్మకం ఉంది. అదే తీరున 'నవరాత్రి' కథలో నాయిక నవరాత్రులు ఆనందంగా జరుపుకోవాలనుకుంటుంది. అయితే తండ్రి తెచ్చిన సంబంధం ఇష్టం లేక ఇంటి నుండి పారిపోతుంది. ఆ క్రమంలో ఒక్కోరాత్రి ఒక్కో వ్యక్తి తారసపడతాడు. అతను ఆమె ప్రియుడు వేణుగోపాల్ లాగే ఉండడం విశేషం. తొమ్మిది రోజులు నవరసాలకు సంబంధించిన పాత్రలను హీరోయిన్ కలుసుకోవడం ఇందులోని ప్రధానాంశం. చివరకు కోరుకున్నవాడితోనే హీరోయిన్ వివాహమవుతుంది. 1966 ఏప్రిల్ 22న విడుదలైన 'నవరాత్రి' చిత్రం ద్వారానే తాతినేని రామారావు (Thathineni Ramarao) దర్శకునిగా పరిచయం అయ్యారు. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఏవీ సుబ్బారావు ఈ చిత్రాన్ని నిర్మించారు.
తమిళంలో శివాజీ గణేశన్, సావిత్రి (Savitri) జంటగా రూపొందిన 'నవరాత్తిరి' ఆధారంగా తెలుగు 'నవరాత్రి' తెరకెక్కింది. తమిళనాట శివాజీగణేశన్ తొమ్మిది పాత్రలతో అలరించారు. అదే విధంగా తెలుగులోనూ ఏయన్నార్ (ANR) కూడా 'నవరాత్రి'లో తొమ్మిది పాత్రల్లో కనిపించారు. ఇందులో జగ్గయ్య, చిత్తూరు నాగయ్య, గుమ్మడి, రేలంగి, రమణారెడ్డి, చలం ఇతర ముఖ్యపాత్రధారులు. పిచ్చాసుపత్రిలో సూర్యకాంతం, ఛాయాదేవి, గిరిజ, జమున, జయలలిత, కాంచన, గీతాంజలి కాసేపు పిచ్చివాళ్ళుగా కనిపించారు.
తమిళ 'నవరాత్తిరి'లో శివాజీ గణేశన్ కు ఎంతో పేరు లభించింది. దాంతో తెలుగులో ఏయన్నార్ కూడా తొమ్మిది పాత్రల్లో మురిపిస్తారని ఆశించారు. అయితే తమిళ చిత్రం స్థాయిలో తెలుగు సినిమా ఆకట్టుకోలేక పోయింది. ఏయన్నార్‌తో తొమ్మిది పాత్రలు ధరింప చేయడం అన్నదే ఈ సినిమాకు ఎస్సెట్. రీమేక్ ద్వారా పరిచయమైన తాతినేని రామారావు తరువాతి రోజుల్లోనూ పలు రీమేక్స్‌తో సక్సెస్ సాధించడం విశేషం. ఏది ఏమైనా నవరాత్రి అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ఏయన్నార్ తొమ్మిది పాత్రలే.