50 ఏళ్ళ రొమాంటిక్ మ్యూజికల్ వండర్ 'ఆరాధన'
ABN, Publish Date - Mar 12 , 2026 | 08:56 AM
నటరత్న యన్టీఆర్ హీరోగా రూపొందిన 'ఆరాధన' చిత్రం మార్చి 12తో యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమా పేరు వినగానే ఇందులోని మహ్మద్ రఫీ పాటలు గుర్తుకు వస్తాయి. ఆ నాటి 'ఆరాధన' విశేషాలను గుర్తు చేసుకుందాం.
ఇప్పుడంటే 70 ఏళ్ళు దాటినా హీరోలు చిందులేస్తూ అలరిస్తున్నారు. కానీ, అప్పట్లో 50 సంవత్సరాలు దాటిన వారిని ముసలి హీరోలుగానే భావించేవారు. అలా తన 53 ఏళ్ళ వయసులో నటరత్న యన్టీఆర్ (N. T. Rama Rao) ఆరాధన (Aradhana) అనే రొమాంటిక్ మ్యూజికల్ లో ప్రేమికునిగా నటించి అలరిండం విశేషం. అందునా అప్పటికే దేశమంతటా ఎంతో పాపులర్ అయిన గీత్ (Geet) హిందీ చిత్రం ఆధారంగా 'ఆరాధన' రూపొందడం గమనార్హం! 1976 మార్చి 12న విడుదలైన 'ఆరాధన' ఆ యేడాది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం మరింత విశేషం.
వాణిశ్రీ (Vanisri)నాయికగా నటించిన 'ఆరాధన' చిత్రాన్ని బి.వి.ప్రసాద్ (B. V. Prasad) దర్శకత్వంలో అట్లూరి పుండరీకాక్షయ్య (Pundarikakshaiah) నిర్మించారు. జగ్గయ్య (Jaggayya), విజయలలిత (Vijayalalitha ), గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి ఇతర ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రానికి సాలూరు హనుమంతరావు (Saluri Hanumantha Rao) సంగీతం సమకూర్చారు. సి.నారాయణ రెడ్డి, దాశరథి పాటలు పలికించారు. సూపర్ హిట్ కావడమే కాదు మ్యూజికల్ హిట్ గానూ 'ఆరాధన' నిలచింది.
మధుర గాయకుడు మహ్మద్ రఫీ (Mohammed Rafi) గాత్రం యావద్భారతాన్నీ మురిపించింది. అంతకు ముందు కొన్ని తెలుగు చిత్రాల్లో ఒకటి, రెండు పాటలు పాడిన రఫీ యన్టీఆర్ 'భలేతమ్ముడు' తోనే తెలుగునాట విశేషాదరణ చూరగొన్నారు. ఆ చిత్రాన్ని నిర్మించిన పుండరీకాక్షయ్యనే 'ఆరాధన' తీస్తూ మహ్మద్ రఫీతోనే గానం చేయించారు.
రఫీ, జానకి పాడిన 'ఆరాధన' పాటలు తెలుగువారిని విశేషంగా అలరించాయి. 1971లోనే ప్రేమకథలకు కాలం తీరిందని భావించారు తెలుగు సినీజనం. యన్టీఆర్ లాంటి మాస్ హీరోతో 'ఆరాధన' లాంటి ప్రేమకథాచిత్రం అంటే సాహసం అనీ అన్నారు కొందరు... యన్టీఆర్ తో లవ్ స్టోరీ తీసినా చూస్తారనే నమ్మకంతో పుండరీకాక్షయ్య 'ఆరాధన' నిర్మించారు. పోటీ చిత్రాలను పక్కకు నెట్టి 'ఆరాధన' ఘనవిజయం సాధించింది. వసూళ్ళ వర్షాలు కురిపించింది.
ఈ చిత్రం రిలీజైన 26 రోజులకే యన్టీఆర్ - దాసరి నారాయణ రావు కాంబోలో వచ్చిన 'మనుషులంతా ఒక్కటే' విడుదలయింది. ఆ సినిమా కూడా హిట్ టాక్ సంపాదించింది. అయినా, 'ఆరాధన' జయకేతనం ఎగురవేస్తూ ముందుకు సాగింది. ఇతర సీనియర్ స్టార్స్ సైతం ధైర్యంగా ప్రేమకథాచిత్రాల్లో నటించడానికి స్ఫూర్తినిచ్చింది 'ఆరాధన' అనే రీమేక్!. ఆ రోజుల్లో హిందీ చిత్రసీమలో యంగ్ హీరోస్ నటించి ఘనవిజయం సాధించిన అనేక చిత్రాలను తెలుగులో రీమేక్ చేసి అలరించారు యన్టీఆర్.
ఆ సమయంలోనే 'ఆరాధన' రూపొందింది. 'ఆరాధన' చిత్రం 14 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. 25 వారాలూ ప్రదర్శితమయింది. రిపీట్ రన్స్ లోనూ విశేషాదరణ చూరగొంది. 'ఆరాధన' సమయంలోనే తెలుగునేలపై అనేక కేంద్రాలలో హిందీ సూపర్ హిట్ మూవీ 'షోలే' లేట్ రిలీజ్ గా వచ్చింది. ఆ సినిమాకు దీటుగా హిందీ రీమేక్ అయిన 'ఆరాధన' ఘనవిజయం సాధించడం విశేషం!.
పైగా కొన్ని కేంద్రాలలో 'ఆరాధన'కు పోటీగా ఒరిజినల్ 'గీత్'ను కూడా రీ-రిలీజ్ చేశారు. అయినా యన్టీఆర్ ఇమేజ్‌తో 'ఆరాధన' జైత్రయాత్ర చేసింది. తెలుగులో అంతకు ముందు, ఆ తరువాత 'ఆరాధన' టైటిల్స్ తో కొన్ని చిత్రాలు వచ్చినా, యన్టీఆర్ 'ఆరాధన' స్థాయి ఘనవిజయం అందుకోలేక పోయాయి. ఈ నాటికీ ఇందులోని పాటలు సంగీతాభిమానులను అలరిస్తూనే ఉండడం విశేషం!