సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

యన్టీఆర్‌ను సూపర్ స్టార్ చేసిన సినిమా! పాతాళభైరవికి 75 ఏళ్లు

ABN, Publish Date - Mar 15 , 2026 | 12:10 PM

తరుగులేని ఘనత... తిరుగులేని చరిత... నందమూరి తారక రాముని సొంతం... తెలుగువారి ఆస్తిగా నిలచిన యన్టీఆర్ ను సూపర్ స్టార్ గా నిలిపిన చిత్రం విజయావారి 'పాతాళభైరవి'. మార్చి 15తో 'పాతాళభైరవి' 75 వసంతాలు పూర్తి చేసుకుంటోంది.

Pathala Bhairavi

యన్టీఆర్ (N. T. Rama Rao) నటించిన ఆరవ చిత్రం పాతాళభైరవి (Pathala Bhairavi). ఆయన కథానాయకునిగా కనిపించిన ఐదవ సినిమా ఇదే. అప్పటి దాకా తెలుగు చిత్రసీమలో రూపొందిన జానపద చిత్రాలన్నీ ఒక ఎత్తు. 'పాతాళభైరవి' మరో ఎత్తు. ఎందుకంటే అప్పటి జానపదాల్లో హీరోకంటే కథకే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. కథానుగుణంగా కథానాయకులు సగం కథ నడచిన తరువాత కూడా కనిపించేవారు. కానీ, అంతర్జాతీయంగా అప్పట్లో అలరిస్తున్న జానపద చిత్రాల తీరున ఆరంభం నుంచీ కథను హీరో చుట్టూ తిప్పుతూ, కథానాయకుడంటే సాహస వీరునిగా నిలిపిన జానపద చిత్రం 'పాతాళభైరవి' అనే చెప్పాలి.

ఈ సినిమా టైటిల్ 'పాతాళభైరవి', కానీ కథానాయకుడు తోట రాముడు తన ప్రేమకోసం ఎలాంటి సాహసాలు చేశాడు? చివరకు ప్రతినాయకుని ఎలా మట్టి కరిపించాడు? అన్న అంశాలతో ఆసక్తిగా సాగుతుంది ఈ చిత్రం. ఓ విధంగా చెప్పాలంటే సుఖాంత ప్రేమకథలలోనూ 'పాతాళభైరవి' ఓ ప్రత్యేక స్థానం సంపాదిస్తుంది. ఇక రామారావు స్ఫూరద్రూపం, ఆయన అభినయం 'పాతాళభైరవి' చిత్రంలో అందరికంటే ప్రత్యేక స్థానం సంపాదించాయి. ఆయన అందం గురించి చెప్పక్కర్లేదు. ఆయన అందాల రూపం, సాహసవంతునిగా అనితరసాధ్యమైన అభినయం రామారావును సూపర్ స్టార్ ని చేశాయి.

'పాతాళభైరవి'తో ఆరంభమైన యన్టీఆర్ జైత్రయాత్ర అప్రతిహతంగా సాగింది. ఆయన కెరీర్ గ్రాఫ్‌లో ఉన్నతంగా ఎగసిన కెరటాలే అధికంగా కనిపిస్తాయి. మొత్తం 35 ఏళ్ళ కెరీర్ లో రెండు మూడు సంవత్సరాలు మినహాయిస్తే, అన్నిసార్లూ అన్నగారి సక్సెస్ గ్రాఫ్ ఆకాశంవైపే సాగింది. ఇంతటి అరుదైన చరిత్ర భారతదేశంలో మరో నటునిలో కానరాదు. ఆ మాటకొస్తే ప్రపంచంలోనే పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాల్లో మెప్పించి, అనితరసాధ్యంగా అపూర్వ విజయాలను చవిచూసిన నటుడు కూడా కనిపించడు. అంతటి చరిత్ర యన్టీఆర్ సొంతం కావడానికి 1951 మార్చి 15న విడుదలైన 'పాతాళభైరవి' కారణమని చెప్పక తప్పదు.

అంతర్జాతీయ చిత్రోత్సవంలో 'పాతాళభైరవి'!

తెలుగు సినిమాల్లో సాంకేతిక విలువలు అంతగా ఉండవని, ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా ఆ విలువలు నేర్చుకుంటోందని ఆ మధ్య ఓ మేధావి సెలవిచ్చారు. అతగాడి ఉద్దేశంలో ఈ మధ్య వచ్చిన భారీ జానపదంలోనే అంతో ఇంతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయన్న మాట! అలాంటి వారు తప్పకుండా తెలుగు సినిమాను అధ్యయనం చేయవలసిందే. అలా తెలుగు చిత్రాలను అధ్యయనం చేసేటప్పుడు తప్పకుండా చూడవలసిన సినిమాల్లో ముందుంటుంది విజయా వారి 'పాతాళభైరవి'.

కేవీ రెడ్డి (K. V. Reddy) దర్శకత్వంలో బి.నాగిరెడ్డి (Nagi Reddi) - చక్రపాణి (Chakrapani) నిర్మించిన ఈ సినిమాను ఇప్పుడు చూసినా ఇందులోని ఆ నాటి సాంకేతిక విలువలు ఆకట్టుకుంటాయి. ఈ చిత్రంలోని కథ, కథనం పాతదే అయినా, చూపరులను కట్టిపడేస్తూనే ఉంది. 1952లో మన దేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న ఏకైక తెలుగు చిత్రం 'పాతాళభైరవి'. ఈ ఉత్సవానికి నాటి మేటి హాలీవుడ్ దిగ్గజాలు కూడా హాజరయ్యారు. 'పాతాళభైరవి'ని చూసి వారూ ఆనందించారు. ముఖ్యంగా ఇందులోని మార్కస్ బార్ ట్లే కెమెరా పనితనాన్నీ ప్రశంసించారు. ఇక నటీనటుల అభినయాన్నీ మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.

మన పురాణగాథ నేపథ్యం...

'పాతాళభైరవి' కథను చూస్తే మన కాశీ మజిలీ కథలు గుర్తుకు వస్తాయి. అలాగే అరేబియన్ నైట్స్ లోని 'అల్లావుద్దీన్ అద్భుతదీపం' కూడా స్ఫురిస్తుంది. కానీ, ఆ కథను మన వాతావరణానికి అనువుగా రచయిత పింగళి నాగేంద్రరావు మలచిన తీరు తెలుగువారిని విశేషంగా అలరించింది. అసలు ఇందులో 'రామాయణాన్ని' చొప్పించారు పింగళి. కథానాయకుని పేరు రాముడు. ఆయన ప్రేమించిన రాజకుమారి పేరు ఇందుమతి (శ్రీరాముని నాన్నమ్మ - దశరథుని తల్లి). రావణాసురుని లాంటి నేపాల మాంత్రికుడు వచ్చి ఇందుమతిని అపహరించుకొని పోగా, అతని మిత్రుడైన అంజి (ఆంజనేయుడు) సహకారంతో రాముడు విజయం సాధించడం ఇందులోని ప్రధానాంశం.

ఇక ఇందులోని పాటలు, మాటలు కూడా పింగళి వారి కలం నుండే జాలువారాయి. నిఘంటువుల్లో మూలన దాగిన పదాలను పట్టుకు వచ్చి, జనానికి పరిచయం చేయడంలో దిట్ట పింగళి. అలాగే ఇందులో "డింభకా", "డింగరీ", "బుల్ బుల్...", "దగిడీ..." వంటి మాటలను సందర్భానుసారంగా పలికించి ప్రేక్షకులకు పరమానందం పంచారు. ఇక ఇందులోని 11 పాటలనూ పింగళి నాగేంద్రరావు రాశారు. ప్రతి పాటా ఆణిముత్యమే. అన్నీ అందరినీ ఆకట్టుకున్నవే.

పరమానందం పంచే పాటల పర్వం...

"తీయని ఊహల హాయిని గొలిపే...వసంత గానమె హాయి..." అంటూ తొలి పాట మొదలవుతుంది. నిజంగానే మన మనసులకు హాయిని గొలుపుతుంది. ఈ పాటలో "కొత్తరాగమున.. మత్తిలి కోయిల.." వంటి ప్రాస చూస్తే భాషాభిమానుల మది పులకించక మానదు. తరువాత సత్రంలో వినోదం కోసం పాట పాడే వనిత నోట "ఇతిహాసం విన్నారా.. ఆ అతిసాహసులే ఉన్నారా.." అంటూ మధురం పలుకుతుంది. ఈ పాటలోనూ కథానుగుణంగా అది ఉజ్జయినీ రాజ్యం కాబట్టి అందులో వీరుల గాథలను పొందు పరిచారు. "శూలాగ్రానికి సూటి గురియైన విక్రమార్కుడు.. మట్టిబొమ్మలను మహారణానికి జట్టు నడిపిన శాలివాహనుడు.." '(క)వినిపిస్తారు. మూడో పాటగా వినిపించే "కలవరమాయె మదిలో..." పాట నిజంగా ప్రేమలో పడ్డ యువతీయువకుల మనసుల్లో కలవరం రేపుతుంది. అలతి అలతి పదాలతో అనల్పమైన భావాలను ఎలా పలికించవచ్చునో భావిగీతరచయితలు ఈ పాటను వింటే తెలుస్తుంది. పాత్రలకు తగ్గ రీతిలోనూ పదాలను పలికించడమూ ఈ పాటలో కనిపిస్తుంది.

నాలుగో పాట "ఎంత ఘాటు ప్రేమయో.." కూడా ప్రేమికుల మదిని దోచేస్తుంది. అందులో "కన్నుకాటు తిన్నదిగా.." వంటి ప్రయోగం సాహిత్యాభిమానులను పులకింప చేస్తుంది. ఐదో పాటగా వినిపించే "వినవే బాలా...నా ప్రేమగోల.." పాట హాస్యం పంచుతూనే ఆకట్టుకుంటుంది. "వగలోయ్ వగలు... తలుకు బెలుకు వగలు.." పాట రసపిపాసులను మత్తెక్కిస్తుంది. తరువాతి రోజుల్లో ఈ పాటను అనుకరణతో పలు పాటలు చిందులు వేయించాయి. ఇక్కడే రాజుగారి బామ్మర్దిని మాంత్రికుడు ఆడదానిగా మార్చేసినప్పుడు వినిపించే "తాళలేనే నే తాళలేనే..." బిట్ సాంగ్ సైతం కితకితలు పెడుతుంది. ఇక ఎనిమిదవ పాటగా వినిపించే నేపథ్య గీతం "ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు..." అప్పట్లోనే కాదు, ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. ఇందులోనూ పింగళివారు అలతి పదాలతోనే అలరించారు. ప్రాసనియమం చెడకుండా సందర్భశుద్ధిగా ఓ జానపద చిత్రంలో ఇంతటి నేపథ్య గీతం ఇప్పటి దాకా రాలేదని పండితుల అభిప్రాయం.

తరువాత నాయికానాయకులపై చిత్రీకరించిన యుగళగీతం - "ప్రణయజీవులకు దేవి వరాలే...కానుకలివియే ప్రియురాలా..." అంటూ మొదలై, "హాయిగా మనకింకా స్వేచ్ఛగా.." అనే పల్లవితో సాగుతుంది. నిజంగానే చూసే ప్రేక్షకులకు, వినే శ్రోతలకు ఈ పాట హాయిని ప్రసాదిస్తుంది. పదవ పాటగా రూపొందిన "రానంటే రానే రాను..."అనేది బిట్ సాంగ్. ఈ పాట వెనుకే "విజయతోరణము నీవే.." అంటూ నాలుగు పంక్తుల పాట వస్తుంది. అదీ అలరిస్తుంది. ఇక చివరగా కథానాయకుడు ప్రియురాలి కోసం గాలిస్తూ వ్యధతో గానం చేసే "కనుగొనగలనో లేనో..." పాట ఉంటుంది. ఈ పాటలో కూడా పింగళివారు ప్రాసవీడకుండానే పదబంధాలతో పరవశింప చేసిన తీరును సాహితీ ప్రియులు ఈ నాటికీ మననం చేసుకుంటూనే ఉన్నారు.

పసందైన పదాలు

ఇక ఈ సినిమాలో దర్శకుడు కేవీ రెడ్డి, తన అసోసియేట్ కె.కామేశ్వరరావుతో కలసి స్క్రీన్ ప్లే రాశారు. వారు కథను నడిపించిన తీరు ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంది. అదలా ఉంచితే ఇందులోని ప్రధాన పాత్రలకు ఏదో ఒక ఊతపదం పెట్టడం కూడా అలరించే అంశం. దీనిని తరువాతి తరం దర్శకులు, కథకులు భలేగా అనుసరించారు. కథానాయకుడైన తోటరాముడు "నిజం చెప్పమన్నారా...అబద్ధం చెప్పమన్నారా..." అంటూ ఉంటాడు. ఇక రాజుగారి బామ్మర్ది ప్రతి మాటకు "తప్పు తప్పు..." అనడంతో వినోదం పండిస్తాడు. నేపాల మాంత్రికుని నోట పాత పదాలను పలికించి మురిపించారు. అలాగే "మహా సాహసవంతుడు... సన్మార్గుడు..." కావాలని మాంత్రికుడు కోరుకోగా, అతని శిష్యుడు సదాజపుడు "మహాసాహసవంతుడే... వాడి జోలి మనకొద్దు గురో..." అనడం ప్రేక్షకుడికి కథానాయకుని బలంపై మరింత గురి కుదిరేలా చేస్తాయి.

ఇక తోటరాముడు అర్ధరాత్రి అంతఃపురంలో రాకుమారి మందిరంలో ప్రవేశించి, ఆ ప్రేమకై తాను తపించిన తీరును గురించి చెప్పిన మొత్తం సన్నివేశం యువతీయువకులను తరతరాలుగా అలరిస్తూనే ఉంది. ముఖ్యంగా రాకుమారితో "నీ ప్రేమలేని ప్రాణమెందుకు రాజకుమారి..." అన్న వాక్యం ఈ నాటికీ ఆ నాటి ప్రేమికుల మదిలో మారుమోగుతూనే ఉంది. ఇక అదే సన్నివేశంలో రాకుమారి మందిరంలో ప్రవేశించిన తోట రాముని పట్టుకోవాలని లోపలకువచ్చిన రాజు బామ్మర్ది పలికే, "అంతేలే... అంతేలే..." , తరువాత "అంతేగా...అంతేగా..." అనే మాటలు తరువాతి రోజుల్లో పలువరు రచయితలు అనుసరించి జనాన్ని ఆనందింప చేశారు. ఈ సన్నివేశంలో రాకుమారి విసుగ్గా, !"అంతకాకపోతే ఇంత... ఏమిటి మామయ్యా ఇదంతా..." అనడంలోనూ శబ్ద సౌందర్యం చూసి సామాన్య ప్రేక్షకుడు సైతం సంబరపడ్డాడు. ఇక తన విగ్రహాన్ని నొసటతాకి, తలచుకున్నవారికి దేవి ప్రత్యక్షమై, "నరుడా ఏమి నీ కోరిక"అనడం, మాంత్రికుడు, తోటరాముని "సాహసం సేయరా డింభకా" అనడం కూడా జనాల్లో భలేగా నానిపోయాయి. తరువాతి రోజులలో ఈ పదాలు కొన్ని సినిమాలకు మకుటాలుగానూ మారాయి.

మరచిపోలేని.. మార్కస్ సినిమాటోగ్రఫి!

'పాతాళభైరవి' చిత్రానికి కథ, మాటలు, పాటలు ఎలా ఓ ప్రధాన ఆకర్షణగా నిలిచాయో, చిత్రీకరణ కూడా అంతగానే ఆకట్టుకుంది. మార్కస్ బార్ ట్లే సినిమాటోగ్రఫి ఈ చిత్రాన్ని జనానికి కనువిందుగా అందించింది. ప్రతి పాటలోనూ, ప్రధాన సన్నివేశాల్లోనూ బార్ ట్లే సినిమాటోగ్రఫీ గ్రామర్ ను అనుసరించిన తీరు ఇప్పటి మేధావులను సైతం మురిపిస్తోంది. కోటలో రాకుమారి, తోటలో రాముడు మధ్య "కలవరమాయె మదిలో...", "ఎంత ఘాటు ప్రేమయో..." రెండు యుగళగీతాలను చిత్రీకరించిన వైనాన్ని ఎవరు మాత్రం మరువగలరు. తరువాతి రోజుల్లో ఇదే పంథాను పలువురు దర్శకులు, సినిమాటోగ్రాఫర్స్ తమ చిత్రాలలో ఉపయోగించుకున్నారు. ఇక ఔట్ డోర్ లో చిత్రీకరించిన "ప్రేమకోసమై వలలో పడెనే..." పాటలోనూ, "కనుగొనగలనో లేనో..." పాటలోనూ హీరో మనస్తత్వాన్ని తెరపై ఆవిష్కరిస్తూనే అందుకు తగ్గ సినిమాటోగ్రఫీ గ్రామర్ ను అనుసరించారు.

"ప్రేమ కోసమై వలలో పడెనే..." పాటలో హీరో ఏదో సాధించాలన్న ఉత్సాహంతో ఆనందంతో సాగుతూ ఉంటాడు. ఈ పాట ప్రారంభాన్ని గమనిస్తే - ఇది ఫ్రేమ్ లో ఎడమ వైపు నుండి తోటరాముడు, అతని ముందు నేపాల మాంత్రికుడు కనిపిస్తూ మొదలవుతుంది. మనుషుల్లో అత్యధికులు ఎడమవైపు నుండి కుడివైపుకు చూస్తారు. అలా చూడటంలో కంటికి అంతగా శ్రమ ఉండదు. అదే కుడి నుండి ఎడమకు చూసినప్పుడు కళ్ళు కాసింత శ్రమకు గురవుతాయి. దీనిని అనుసరించే సినిమాటోగ్రఫీ సూత్రకారులు సంతోషం కలిగించే సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో సబ్జెక్ట్ ను ఎడమ వైపు నుండి కుడివైపు సాగేలా చూడాలని, బాధ కలిగించే సీన్స్ తీసేటప్పుడు అందుకు భిన్నంగా కుడి నుండి ఎడమకు సబ్జెక్ట్ వచ్చేలా చూడాలనీ సెలవిచ్చారు.

ఆ సూత్రాన్ని తు.చ. తప్పకుండా మార్కస్ బార్ ట్లే ఇందులో అనుసించారు. పైగా ఈ రెండు పాటల చిత్రీకరణలో కెమెరా యాంగిల్స్ ను గమనిస్తూ పోతే నవతరం సినిమా అభిమానులు అధ్యయనం చేసే గ్రామర్ తప్పకుండా కనిపిస్తుంది. ఈ రెండు పాటల్లోనూ ఉపయోగించిన వైప్స్, ఇంటర్ కట్స్ ను తీసిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. ఆ రోజుల్లో ఆసియా దర్శకుల్లో జపాన్ దర్శకుడు అకిరా కురసోవా ఉపయోగించే వైప్స్ ను హాలీవుడ్ జనం సైతం చూసి ఆనందించి, అభినందించారు. ఇప్పటిలాగా మన సినిమాలకు అప్పట్లోనే విదేశీ మార్కెట్ లో ప్రవేశం ఉండి ఉంటే, 'పాతాళబైరవి' చిత్రంలోని దర్శకుని ప్రతిభ, సినిమాటోగ్రాఫర్ నైపుణ్యం అంతర్జాతీయ చలనచిత్ర అధ్యయన పుస్తకాల్లో చోటు సంపాదించేవని చెప్పక తప్పదు.

ఆకట్టుకొనే వేషధారణ!

'పాతాళభైరవి' చిత్రంలో తోటరాముని గెటప్ చూస్తే ఆంగ్ల నటుడు డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్ సీనియర్ కొన్ని జానపదాల్లో ధరించిన దుస్తులు గుర్తుకు రాకమానవు. ఇక నేపాల మాంత్రికుని తీరు చూస్తే 'ఇవాన్ ద టెర్రిబుల్'లోని నికొలాయ్ గెటప్ తలపుకు వచ్చి తీరుతుంది. తోటరాముని స్నేహితుడు అంజి పాత్రకు జపాన్ చిత్రాల్లోని హాస్య పాత్రలను అనుసరంచినట్టు తెలుస్తుంది. అలాగే మాయామహల్ వెలసిన తరువాత అందులో రాజుగారి కుటుంబానికి తోటరాముడు చూపించే వినోదాల విందులో "విజయ తోరణం నీవే..." బిట్ సాంగ్ కు ముందు నర్తకీమణులను ఆడిస్తూ ఓ భారీ ఆకారం (దీనిని మహంకాళి వెంకయ్య ధరించారు) కనిపిస్తుంది. ఆ గెటప్ కూడా జపాన్ జానపద నాటకాల్లో తరచూ కనిపించే పాత్రల్లాగే ఉంటుంది.

సదాజపుని గెటప్ ఫెయిర్ బ్యాంక్స్ నటించిన అరేబియన్ నైట్స్ కథల్లోని కమెడియన్ లాగే కనిపిస్తుంది. ఇప్పుడు అంతర్జాతీయంగా జనాన్ని ఆకట్టుకోవడానికి మన దర్శకనిర్మాతలు చేస్తున్న హంగామాను, పలు భాషల వారికి పరిచితమైన పాత్రలను పోలిన గెటప్స్ వేయించడం అన్నది 75 ఏళ్ళ క్రితమే మనవాళ్ళు అనుసరించారు. అయితే తోటలో ముసలిదాని కొడుక్కి అలాంటి దుస్తులు ఎక్కడ నుండి వచ్చాయి అన్న ప్రశ్న తలెత్తక మానదు. అందులో భాగంగానే తోటరాముడు, అతని మిత్రుడు రోజూ వినోదం కోసం సత్రం లోకి వెళతారని చూపించారు. అక్కడకు దేశవిదేశాల్లోని వారు కూడా వస్తారన్నట్టు ఓ పాత్ర చేత "పారశీకం..." నుండి వచ్చానని చెప్పిస్తారు.

అలా ఎప్పుడైనా వచ్చిన వారు తోటరామునికి కానుకలుగా అలాంటి దుస్తులు ఇచ్చి ఉండవచ్చునని భావించవచ్చు. అలాగే నేపాల మాంత్రికుడు ఉత్తరదేశం నుండి వస్తాడు కాబట్టి, అతనికి, అతని శిష్యునికి తగ్గ ఆహార్యాన్నే అమర్చారు. అలా హేతువును కూడా చూపిస్తూ స్క్రీన్ ప్లేను రక్తి కట్టించారు. మాధవపెద్ది గోఖలే కళాదర్శకత్వం కథానుగుణంగా సాగింది. ఈ చిత్రం ఎంతమందికి చిత్రసీమలో చోటు కల్పించిందో వివరించి చెప్పక్కర్లేదు. ఇందులో బిట్ సాంగ్ లో కనిపించిన సావిత్రి తరువాతి రోజుల్లో మహానటిగా జేజేలు అందుకున్నారు. బిట్ రోల్స్ లో కనిపించిన వారు సైతం తరువాత గుర్తుండిపోయే నటులుగా నిలిచారు.

తెలుగువారి.. తొలి స్వర్ణోత్సవం !

తెలుగు సినిమాలో దివ్యమైన వెలుగును ప్రసరింప చేసిన తొలి చిత్రంగా 'పాతాళభైరవి' నిలచింది. అంతకు ముందు సూపర్ డూపర్ హిట్స్ గా నిలచిన చిత్రాలు లేకపోలేదు. అయితే వాటన్నిటి విజయాన్నీ మరిపిస్తూ, 'పాతాళభైరవి' తొలి విడుదలలో 10 కేంద్రాలలో శతదినోత్సవం చేసుకుంది. అప్పటి దాకా డబుల్ డిజిట్ లో సెంచరీ చూసిన తెలుగు సినిమా లేదు. తరువాత విడుదలయిన మరికొన్ని కేంద్రాలలోనూ ఈ చిత్రం వందరోజులు ఆడింది. అలా దాదాపు 34 కేంద్రాలలో 'పాతాళభైరవి' శతదినోత్సవం జరుపుకుంది. నేరుగా ఒకే థియేటర్ లో 200 రోజులు ప్రదర్శితమైన తొలి తెలుగు చిత్రంగా 'పాతాళభైరవి' నిలచింది. అంతేకాదు ఈ చిత్రం బెంగళూరులో స్వర్ణోత్సవం చేసుకుంది. అలా తెలుగులో మొట్టమొదటి గోల్డెన్ జూబ్లీ మూవీగానూ నిలచిపోయింది 'పాతాళభైరవి'.

అసలైన ఆల్ టైమ్ హిట్...

1951 మార్చి 15న విడుదలైన నాటి నుండి ఈ సినిమా తెలుగునేలపై ఏదో ఒక మూల ఆడుతూనే ఉందని, ఆ విధంగా ఈ సినిమా ఒరిజినల్ నుండి పలు ప్రింట్స్ వేయించడం వల్ల ఒరిజినల్ పాడయిందనీ విజయాధినేతలే చెప్పారు. ఇక ఈ చిత్రం 1980ల వరకు థియేటర్లలోనూ విడుదలై విశేషంగా సందడి చేసింది. కొన్ని సార్లు ఒకే ఊరిలో సంవత్సరానికి రెండు సార్లు కూడా 'పాతాళభైరవి' రిపీట్ రన్స్ చూసిన సందర్భాలున్నాయి. దీనిని బట్టే 'పాతాళభైరవి' స్టామినా ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రాన్ని అప్పట్లో అత్యంత భారీ చిత్రంగా నిర్మించారు నిర్మాతలు. వారు పెట్టిన పెట్టుబడికి తొలి విడుదలలోనే రూపాయికి ఐదు రూపాయలు ఈ చిత్రం సంపాదించి పెట్టిందట! ఇక ఆ తరువాత రిపీట్ రన్స్ లో 'పాతాళభైరవి' సందడి చేసిన మొత్తాన్ని కూడా కలుపుకుంటే, ఈ సినిమా స్థాయిలో మరే తెలుగు చిత్రం వసూళ్ళు చూసి ఉండదని చెప్పవచ్చు.

ఇప్పటి లెక్కలకు ఆ నాటి మొత్తాలను సవరిస్తే, ఈ రోజున సూపర్ డూపర్ హిట్ అయి ప్రపంచవ్యాప్తంగా పలు కోట్లు సంపాదించిన చిత్రాలకంటే ఎక్కువగానే ఉంటుందని సినీ పండిట్స్ చెబుతున్నారు. ఈ సినిమా తమిళంలోనూ యన్టీఆర్, మాలతితోనే రూపొంది అక్కడా విజయం సాధించింది. 1952లో విజయావారి వద్ద ఈ చిత్రం రీమేక్ రైట్స్ తీసుకొని జెమినీ వాసన్ హిందీలో అదే పేరుతో పునర్నిర్మించారు. అందులోనూ యన్టీఆర్, ఎస్వీఆర్, మాలతి, టి.జి.కమల నటించారు. కొన్ని పాటలను అందులో కలర్ లో చిత్రీకరించడం విశేషం. అలా యన్టీఆర్ తొలి హిందీ చిత్రంగానూ 'పాతాళభైరవి' నిలచింది.

నటరత్న వైభవానికి పునాది!

'పాతాళభైరవి' చిత్రం శతదినోత్సవాలు, ద్విశతదినోత్సవాలు చేసుకుంది. ఆ యా కేంద్రాలకు ఈ చిత్రంలో నటించిన యన్టీఆర్, యస్వీఆర్, బాలకృష్ణ (అంజి), పద్మనాభం వంటివారు వెళ్ళి, ప్రత్యక్షంగా జనాన్ని కలుసుకొని మురిపించారు. అలా బళ్ళారిలో ఈ చిత్ర విజయోత్సవంలో పాలుపంచుకోవడానికి యన్టీఆర్ వెళ్తున్నారు. ఆయన ప్రయాణిస్తున్న రైలు గుంతకల్లు స్టేషన్ లో ఆగింది. ఆ సమయానికి కొంచెం ముందు మరో ఫ్లాట్ ఫామ్ పై ఆ నాటి కేంద్రమంత్రి చక్రవర్తి రాజగోపాలాచార్యులు (రాజాజీ) వచ్చి ఉన్నారట. ఆయనను కలుసుకోవడానికి ఎంతోమంది అప్పటి రాజకీయ నాయకులు వేంచేశారు. వారి చుట్టూ జనం కూడా ఉన్నారు. ఈ లోగా, మరో ఫ్లాట్ ఫామ్ పైకి 'పాతాళభైరవి' హీరో యన్టీఆర్ వచ్చాడని తెలియగానే, అక్కడ ఉన్న జనం పరుగులు తీస్తూ అటువైపుకు వెళ్ళారట. దాంతో రాజాజీ, ఆయనను కలవడానికి వచ్చిన రాజకీయ నాయకులే మిగిలారట! "సినిమావాళ్ళకు ఇంత ఆదరణా" అని రాజాజీ ఆశ్చర్యం వ్యక్తం చేశారట!.

నిజమే, ఆయన ఆశ్చర్యపోయినట్టుగానే తరువాతి రోజుల్లో సినిమా స్టార్స్ అయిన ఎమ్.జి.రామచంద్రన్, యన్.టి.రామారావు రాజకీయాల్లోనూ రాణించి, ముఖ్యమంత్రులు అయ్యారు. వీరిలో యన్టీఆర్ సొంతగా పార్టీ పెట్టి, కేవలం తొమ్మిది నెలల వ్వవధిలోనే అనూహ్యంగా 'తెలుగుదేశం' జయకేతనాన్ని ఎగురవేశారు. ఆ తరువాత జాతీయ స్థాయిలోనూ తన పార్టీ ప్రభావాన్ని చూపించి, నాటి ఢిల్లీ పెద్దలకు నిదురలేని రాత్రులు మిగిల్చారు. అంతటి శక్తి యన్టీఆర్ సొంతం కావడానికి ఆయన నటించిన అరుదైన చిత్రాలే కారణం. ఆ సినిమాలకు పునాది వేసిన చిత్రంగా 'పాతాళభైరవి' నిలవడం గమనార్హం! ఇంకా 'పాతాళభైరవి' సాధించిన పలు రికార్డులు అభిమానుల మదిలో నిక్షిప్తమై ఉన్నాయి. వాటన్నిటినీ ఇక్కడ ఉటంకించడానికి వీలుపడదు. ఏది ఏమైనా తెలుగు సినిమా గర్వించదగ్గ చిత్రంగానే కాదు, భావితరాలు తప్పకుండా అధ్యయనం చేయగల సినిమాగానూ నిలచిపోయింది 'పాతాళభైరవి'.

Updated Date - Mar 15 , 2026 | 01:47 PM