శతదినోత్సవాలు జరుపుకున్న 'భలే రాముడు'
ABN, Publish Date - Apr 06 , 2026 | 02:29 PM
నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, నటీశిరోమణి సావిత్రి జంటగా రూపొందిన 'భలే రాముడు' చిత్రం 70 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలను గుర్తు చేసుకుందాం.
ఏయన్నార్, సావిత్రి జంటగా అంతకు ముందు రూపొందిన 'బ్రతుకు తెరువు, దేవదాసు, అర్ధాంగి, దొంగరాముడు' వంటి చిత్రాలు విజయం సాధించాయి. వారిద్దరూ జంటగా తెరకెక్కిన 'భలే రాముడు' చిత్రం 1956 ఏప్రిల్ 6వ తేదీన విడుదలయింది. 1943లో ఘనవిజయం సాధించిన అశోక్ కుమార్ 'కిస్మత్' మూవీ ఆధారంగా నరసు స్టూడియోస్ తెలుగులో 'భలే రాముడు' చిత్రాన్ని నిర్మించింది. అదే సమయంలో తమిళంలో జెమినీ గణేశన్, సావిత్రి జంటగా ఇదే కథను 'ప్రేమ పాశమ్' పేరుతో రూపొందించారు. ముందు 1956 మార్చి చివరలో తమిళ వర్షన్, తరువాత ఏప్రిల్ మొదటివారంలో 'భలే రాముడు' జనం ముందు నిలిచాయి. రెండు చిత్రాలకు ఎస్. రాజేశ్వరరావు స్వరకల్పన చేశారు. రెండూ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. శతదినోత్సవం జరుపుకున్నాయి.
'భలే రాముడు' చిత్రంలో కథ డాన్సర్ అయిన హీరోయిన్, చిన్నప్పుడు ఆమెకు ప్రమాదం సంభవించేలా చేసిన రామకృష్ణ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హీరోయిన్ కాలికి గాయమై కుంటుతూ ఉంటుంది. పారిపోయిన రాముడు దొంగగా మారి ఉంటాడు. వారి తండ్రులు మిత్రులే అయినా, హీరో తండ్రి, హీరోయిన్ నాన్న ఆస్తి కాజేస్తాడు. చివరకు రామకృష్ణ చాకచక్యంతోనే అన్ని సమస్యలూ సమసిపోతాయి. చిన్నప్పుడు ఎవరినైతే గాయపరిచాడో ఆమెనే హీరో పెళ్ళాడడంతో కథ సుఖాంతమవుతుంది. రామునిగా ఏయన్నార్, రూపగా సావిత్రి నటించి అలరించారు. ఈ చిత్రంలోని 'ఓహో మేఘమాలా.' అంటూ సాగే సాంగ్ ఆ రోజుల్లో విశేషాదరణ చూరగొంది. ఫిమేల్ వర్షన్ ను పి.లీల పాడగా, మేల్ వర్షన్ ఘంటసాల గళంలో జాలువారింది.
'భలే రాముడు' చిత్రం రిపీట్ రన్స్ లోనూ మంచి విజయం సాధించింది. ఏయన్నార్, సావిత్రి జంటగా నటించిన పలు చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమాల జాబితాలో 'భలే రాముడు' కూడా చోటు దక్కించుకుంది. ఈ చిత్రానికి వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించారు. ఇందులో గిరిజ, చలం, రేలంగి, సీయస్సార్, గౌరీనాథ శాస్త్రి, పేకేటి శివరామ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి వెంపటి సదాశివబ్రహ్మం పాటలు రాశారు. తరువాతి రోజుల్లో ఇదే టైటిల్‌తో మోహన్ బాబు 'భలే రాముడు' అనే సినిమాను రూపొందించారు. ఆ సినిమాకు హిందీలో విజయం సాధించిన 'నమక్ హలాల్' ఆధారం. ఇలా తెలుగునాట వెలుగు చూసిన రెండు 'భలేరాముడు' చిత్రాలకు హిందీ సినిమాలు ఆధారం కావడం విశేషం!