సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

70 ఏళ్ళు పూర్తి చేసుకున్న యన్టీఆర్ 'చిరంజీవులు'

ABN, Publish Date - Aug 15 , 2026 | 06:22 PM

నటరత్న యన్టీఆర్ నటనావైభవంతో అనేక చిత్రాలు తెలుగువారిని పులకింప చేశాయి. డెబ్బై ఏళ్ళ నాటి 'చిరంజీవులు' ఆ కోవకు చెందినదే. ఆ నాటి 'చిరంజీవులు' సినిమా విశేషాలను మననం చేసుకుందాం.

NTR Chiranjeevulu Movie

నిర్మాత డి.యల్.నారాయణ, దర్శకుడు వేదాంతం రాఘవయ్య ఉత్తరాది కథలతో తెలుగు చిత్రాలను రూపొందించే ప్రయత్నం చేశారు. తమ వినోదా పతాకంపై వారు నిర్మించిన 'దేవదాసు' బెంగాలీ నవల ఆధారంగా తెరకెక్కి మంచి విజయం సాధించింది. తరువాత తెలుగునాట విశేషాదరణ చూరగొన్న గురజాడ అప్పారావు రచన 'కన్యాశుల్కం'ను సినిమాగా రూపొందించారు డి.యల్. ఈ చిత్రాన్ని పి. పుల్లయ్య దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇందులో గిరీశంగా నటించిన యన్టీఆర్ నటునిగా మంచి మార్కులు సంపాదించారు. దాంతో యన్టీఆర్ హీరోగా ఓ విషాదాంత ప్రేమకథను నిర్మించాలని భావించారు డి.యల్. హిందీలో ఘనవిజయం సాధించిన దిలీప్ కుమార్ 'మేలా' చిత్రానికి కొన్ని మార్పులూ చేర్పులూ చేసి 'చిరంజీవులు' కథ తయారు చేశారు. ఇందులో యన్టీఆర్ సరసన జమున నాయికగా నటించారు. 1956 ఆగస్టు 15వ తేదీన 'చిరంజీవులు' చిత్రం విడుదలయింది. ఈ సినిమాకు అప్పట్లో మిశ్రమ స్పందన లభించింది. అయితే అంధునిగా యన్టీఆర్ అభినయాన్ని విమర్శకులు ఎంతగానో ప్రశంసించారు.


తాము నిర్మించిన 'దేవదాసు' చిత్రంతో ఏయన్నార్ ను విషాదాంత ప్రేమికునిగా నిలిపారు వినోదావారు. అదే తీరున యన్టీఆర్ ను కూడా చూపించాలని నిర్మాత డి.యల్.నారాయణ తపన. 'దేవదాసు'లోలాగే చిన్నతనం నుంచీ ప్రేమించుకున్న అబ్బాయి- అమ్మాయి కారణాల వల్ల విడిపోవడం, వారి జీవితాల్లో విషాదం చోటు చేసుకోవడం జరుగుతుంది. హీరోకు ప్రమాదవశాత్తు కళ్ళు పోతాయి. ఆ కళ్ళకు ఆపరేషన్ చేసి బాగు చేసిన డాక్టర్ హీరో ప్రియురాలి భర్త కావడం విచిత్రం. చివరకు కళ్ళు వచ్చినా బ్రతుకు చాలించాలని హీరో తలుస్తాడు. నాయిక కూడా కన్నుమూస్తుంది. వారిద్దరి పార్థివదేహాలను డాక్టర్ ఒకచోట చేర్చడంతో కథ ముగుస్తుంది. ఈ చిత్రానికి మల్లాది రామకృష్ణ శాస్త్రి పాటలు, ఘంటసాల సంగీతం ప్రాణం పోశాయి. యన్టీఆర్- జమున జంట ప్రేక్షకులను రంజింప చేసింది.

అన్న అభినయం కోసమే...

'చిరంజీవులు' సినిమా వినోదా సంస్థ నుండి రావడంతో చాలామంది 'దేవదాసు'తో పోల్చిచూశారు. అలాగే హిందీ 'మేలా' స్థాయిలో లేదనీ విమర్శించారు. అలా డివైడ్ టాక్ తో సాగిన 'చిరంజీవులు' తరువాతి రోజుల్లో విశేషమైన ఆదరణ చూరగొంది. 'చిరంజీవులు' సినిమా రిపీట్ రన్స్ లో మంచి వసూళ్ళు చూసింది. ముఖ్యంగా ఇందులోని 'కనుపాప కరవైన. కనులెందుకు...' సాంగ్ రాగానే ప్రేక్షకుల ఈలలతో, చప్పట్లతో థియేటర్స్ దద్దరిల్లేవి. కొన్ని చోట్ల ఆ పాట రాగానే అభిమానులు చిల్లర నాణేలు వేసి ఆనందించేవారు. అలానే ఈ చిత్రంలో జమునపై చిత్రీకరించిన 'తెల్లవార వచ్చె తెలియక నా స్వామి' పాట సైతం విశేష ఆదరణ చూరగొంది. ఫస్ట్ రిలీజ్ లో అంతగా ఆడకపోయినా, రిపీట్ రన్స్ లో నిర్మాతలకు లాభాలు చేకూర్చిన సినిమాల్లో 'చిరంజీవులు' ప్రత్యేక స్థానం సంపాదించింది. యన్టీఆర్ నటన కోసమే ఈ సినిమాను పదే పదే చూసిన అభిమానులున్నారు.

Updated Date - Aug 15 , 2026 | 06:25 PM