Anasuyamma gari Alludu: అల్లుడిగా అల్లరి చేసిన బాలకృష్ణ!
ABN , Publish Date - Jul 02 , 2026 | 04:02 PM
బాలకృష్ణ, భానుప్రియ జంటగా నటించిన 'అనసూయమ్మ గారి అల్లుడు' సినిమా 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శారద అత్తగా నటించి, మెప్పించింది.
నటసింహ బాలకృష్ణ కెరీర్ లో మరపురాని సంవత్సరం 1986. ఆ యేడాది వరుసగా ఆరు హిట్స్ చూశారు బాలయ్య. ఈ రికార్డ్ ఈ నాటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఆ హిట్స్ లో మూడోది 'అనసూయమ్మగారి అల్లుడు'. ఈ మూవీ నలభై ఏళ్ళు పూర్తి చేసుకుంది. అప్పట్లో 'అనసూయమ్మగారి అల్లుడు' చేసిన అల్లరిని గుర్తు చేసుకుందాం.
నటసింహ బాలకృష్ణ- డైరెక్టర్ ఎ.కోదండరామిరెడ్డి కాంబోలో తెరకెక్కిన తొలి చిత్రం 'అనసూయమ్మగారి అల్లుడు'. రామకృష్ణా సినీస్టూడియోస్ పతాకంపై నందమూరి హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. 1986 జూలై 2వ తేదీన విడుదలయిన 'అనసూయమ్మగారి అల్లుడు' చిత్రం ఘనవిజయం సాధించింది. పరుచూరి బ్రదర్స్ రచనతో రూపొందిన ఈ చిత్రంలోని కథ అత్త, అల్లుడు మధ్య సరదాగా సాగుతుంది. టెక్కు చూపిన భామకు ఓ కిక్కు ఇచ్చిన హీరో ఆమె తన అత్త కూతురు అని తెలుసుకుంటాడు. ఆ పై అత్తకు తమ కుటుంబానికి దూరం ఎలా పెరిగిందో ఆరా తీస్తాడు. అత్తను ఆటపటిస్తూ అల్లుడు చేసే అల్లరి వినోదం పంచుతుంది. తమ కుటుంబాలు విడిపోవడానికి కారకులైన వారి భరతం పడతాడు అల్లుడు. కథ సుఖాంతమవుతుంది. ఇందులో బాలయ్య అత్తగా శారద, ఆయన జోడీగా భానుప్రియ నటించారు.
రజతోత్సవం చూసిన చిత్రం!
'అనసూయమ్మగారి అల్లుడు' చిత్రకథలో ఎక్కడా కొత్తదనం కనిపించక పోయినా, అల్లుడుగా బాలయ్య, అత్తగా శారద నటన జనాన్ని కట్టిపడేసింది. ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం సమకూర్చారు. వేటూరి పాటలు రాశారు. ఈ సినిమాకు బాలయ్య నాలుగో అన్నయ్య మోహన్ కృష్ణ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఇందులో జగ్గయ్య, రావు గోపాలరావు, నూతన్ ప్రసాద్, రమాప్రభ, అన్నపూర్ణ, చలపతిరావు, రామ్ జీ తదితరులు నటించారు. ఈ చిత్రం అనేక కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో రజతోత్సవం జరుపుకుంది.
'అనసూయమ్మగారి అల్లుడు'కు ముందు వచ్చిన 'ముద్దుల క్రిష్ణయ్య'లోనూ అత్తను ఆటపట్టించే అల్లుడిగానే కనిపిస్తారు బాలయ్య. అయితే ఆ సినిమాకు, ఈ మూవీకి మధ్య ఎంతో వైవిధ్యం ప్రదర్శిస్తూ బాలయ్య నటన సాగింది. ఇప్పటికీ శారద, బాలయ్య అత్తాఅల్లుళ్ళుగా మెప్పించిన వైనాన్ని జనం గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఆ తరువాత ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలోనే బాలయ్య, శారద మరోమారు అల్లుడు- అత్తగా నటించిన 'నారీ నారీ నడుమ మురారి' కూడా ఘనవిజయం సాధించడం విశేషం. ఈ సినిమాల తరువాత మరికొందరు టాప్ స్టార్స్ సైతం అత్తలను ఆటపట్టించే కథల్లో నటించి మురిపించడం గమనార్హం ! అందుకు 'అనసూయమ్మగారి అల్లుడు' సాధించిన ఘనవిజయం ప్రేరణ అని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి:
ఎట్టకేలకు.. విజయ్ 'జన నాయగన్' సెన్సార్ పూర్తి?
Kayadu Lohar: టెన్త్ క్లాస్‌లోనే అంత పని చేసిందా?
వైజయంతీ మూవీస్ బ్యానర్ రూటే వేరు.. బ్రాండ్ అంటే ఇది!