YouTuber Nandana: బిగ్‌బాస్ కోసం హైదరాబాద్‌కు.. అనూహ్యంగా అరెస్ట్?
ABN, Publish Date - Sep 08 , 2026 | 10:02 PM
వీసా చీటింగ్ కేసులో యూట్యూబర్ రమానందన ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
యూకే వీసా చీటింగ్ కేసులో యూట్యూబర్ రమానందన (YouTuber Nandana) ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. న్యాయవాదులతో కలిసి విచారణకు వచ్చారు. విదేశాల్లో వీసా ఉద్యోగం ఇప్పిస్తానని రమానందన దంపతులు 13 లక్షలు వసూలు చేసినట్టు క్రాంతి కుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదైంది. ఈ క్రమంలో సోమవారం యూకే నుంచి హైదరాబాద్ చేరుకున్న యూట్యూబర్‌కు విచారణ నిమిత్తం పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగా రామనందన పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. యూ ట్యూబర్ రమానందనను మూడు గంటల పాటు విచారించిన పోలీసులు ఈనెల 16న మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.
మరోవైపు వీసా స్కాం కేసులో రమానందనపై అద్దంకి స్టేషన్‌లో మరో కేసు నమోదు అయ్యింది. వీసా రెన్యూవల్ కోసం సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్షర్షిప్ చేస్తామని డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో డబ్బులు వసూలు చేశారంటూ నందనపై ఆరోపణలు ఉన్నాయి. ఆగస్టులోనే యూట్యూబర్‌పై అద్దంకి పోలీసులు కేసు నమోదు చేశారు. 2023లో నందన డబ్బులు తీసుకొని తమను మోసం చేసిందంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని.. వీసా ప్రాసెస్ చేస్తామని.. నిరుద్యోగులను నమ్మించినట్టు నందనపై ఆరోపణలు ఉన్నాయి. ఒక్కొక్కరి నుంచి లక్షల్లో డబ్బులు తీసుకున్నారని బాధితులు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. కొంతమంది నుంచి భారీ మొత్తాలు వసూలు చేసి.. తర్వాత ఉద్యోగాలు ఇవ్వకుండా.. డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఇలా పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు రావడంతో.. నందన, ఆమె భర్తపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
అయితే.. కేసులు నమోదయ్యాయి.. లుక్‌అవుట్ నోటీసులు ఉన్నాయి.. పోలీసులు గాలిస్తున్నారు.. అయినా నందన విదేశాల్లోనే ఉండిపోయారు. కానీ.. ఒక్కసారిగా సీన్ మారిపోయింది! అమెరికా నుంచి ఎమిరేట్స్ విమానంలో నందన శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఇక్కడే.. ఆమెకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు పాస్‌పోర్ట్ తనిఖీ చేశారు. సిస్టమ్‌లో లుక్‌అవుట్ నోటీసు కనిపించింది. అంతే! వెంటనే ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సమాచారం వెళ్లింది. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లకముందే.. పోలీసులు నందనను అదుపులోకి తీసుకున్నారు.
విదేశాల నుంచి వచ్చిన నందన.. ఇక నేరుగా పోలీసుల విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత లాయర్‌తో కలిసి విజయవాడలో విచారణకు హాజరైంది. ప్రస్తుతం నందనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ.. అసలు ప్రశ్న ఇక్కడే! ఇన్ని రోజులు విదేశాల్లో ఉన్న నందన.. ఇప్పుడు సడన్‌గా ఇండియాకు ఎందుకు వచ్చారు? పోలీసులకు చిక్కుతారని తెలిసినా.. భారత్‌కు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదే ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది.
వైల్డ్‌కార్డ్ ఎంట్రీ కోసమే..
అయితే.. నందన భారత్‌కు రావడానికి మరో కారణం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. అదే.. బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ! బిగ్‌బాస్ తెలుగు సీజన్‌లో ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు హౌస్‌లోకి వెళ్లారు. ఇక వైల్డ్‌కార్డ్ ద్వారా మరికొంతమంది ఎంట్రీ ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో.. నందన పేరు కూడా వినిపించినట్టు కథనాలు వెలువడ్డాయి. బిగ్‌బాస్ హౌస్‌లోకి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ కోసమే నందన అమెరికా నుంచి ఇండియాకు వచ్చారనే ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోంది. ఇలా బిగ్ బాస్ కార్యక్రమానికి వచ్చి ఈమె అడ్డంగా దొరికిపోయారు. మరి నందన వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో తెలియాల్సి ఉంది.