యోగిబాబు విశ్వరూపం.. ఒకే సినిమాలో ఏకంగా 16 పాత్రలు!
ABN, Publish Date - Nov 18 , 2026 | 11:29 AM
యోగిబాబు నటిస్తున్న ‘మూన్ వాక్’ సినిమాలో ఏకంగా 16 విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. డిసెంబర్ 24న విడుదల కానున్న ఈ సినిమా విశేషాలివే.
సినిమాల్లో హీరోలు, హీరోయిన్లు విభిన్న పాత్రల్లో కనిపించడం కొత్తేమీ కాదు. అయితే ఒకే సినిమాలో ఏకంగా 16 విభిన్న పాత్రల్లో కనిపిస్తే మాత్రం అది ప్రేక్షకులకు కచ్చితంగా ఆసక్తికరమైన విషయమే. ప్రముఖ హాస్యనటుడు యోగిబాబు (Yogi Babu) ఇప్పుడు ఇలాంటి అరుదైన ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటీవల తమిళంలో ప్రభుదేవా (Prabhu Deva) హీరోగా రూపొందిన ‘మూన్ వాక్’ (Moon Walk) సినిమాలో ఆయన ఏకంగా 16 విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీంతో ఈ సినిమా ప్రస్తుతం సినీ వర్గాల్లో తెగ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తమిళంలో స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న యోగిబాబు తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తుంటారు. కేవలం హాస్య పాత్రలకే పరిమితం కాకుండా విభిన్నమైన క్యారెక్టర్లతోనూ మెప్పిస్తున్నారు. ఇటీవల తెలుగులోను బిజీగా మారాడు. ఈ క్రమంలో ‘మూన్ వాక్’ సినిమాలో ఆయన భర్తగా, భార్యగా, వారి పూర్వికుల లాగా, మనుమలు, మనుమరాండ్రు ఇలా 16 విభిన్న పాత్రల్లో కనిపించనుండటం విశేషం. ఒకే నటుడు ఇన్ని పాత్రల్లో కనిపించనుండటంతో ఆయా క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి నెలకొంది. ఈ పాత్రలన్నింటినీ యోగిబాబు ఎలా పోషించారో అని అభిమానులు ఇప్పటినుంచే ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు.
ఇదిలాఉంటే.. ఒకే సినిమాలో ఎక్కువ పాత్రలు పోషించిన నటులు గతంలోనూ చాలామందే కనిపిస్తారు. అందులో ప్రధమంగా చెప్పుకొవాల్సింది మలయాళ నటుడు జాన్సన్ జార్జ్ గురించే. ఆయన ‘ఆరాను నాన్’ (Aaranu Njan) సినిమాలో ఏకంగా 45 పాత్రల్లో నటించి ఓ సరికొత్త చరిత్రనే సృష్టించారు. భారతీయ సినిమాలో ఒకే నటుడు పోషించిన అత్యధిక పాత్రల రికార్డుగా ఇది ఇప్పటికీ రికార్డుగానే ఉంది. ఇక తెలుగులో బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే ఎన్టీఆర్ పౌరాణిక సినిమాల్లో నాలుగైదు పాత్రల్లో నటించారు. అంతేకాదు అక్కినేని నాగేశ్వర రావు సైతం నవరాత్రి అనే సినిమాలో తొమ్మిది రకాల పాత్రలు వేసి మెప్పించారు కూడా.
అలాగే బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ‘వాట్స్ యువర్ రాశీ?’ సినిమాలో 12 విభిన్న పాత్రల్లో కనిపించారు. ఇక యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan) ‘దశావతారం’ (Dasavatharam)సినిమాలో పది పాత్రల్లో నటించి తన నటనా వైవిధ్యాన్ని చాటుకున్నారు. రెండేండ్ల క్రితం తెలుగులో వచ్చిన స్వాగ్ (Swag) సినిమాలో శ్రీ విష్ణు (Sree Vishnu) ఐదు విభిన్న పాత్రల్లో ఔరా అనిపించాడు. తాజాగా ఇప్పుడు యోగిబాబు 16 పాత్రల్లో నటిస్తుండటంతో ఇప్పుడు ఈ సినిమాకు హైప్ మరింతగా పెరిగింది. ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్న ‘మూన్ వాక్’ చిత్రం డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆయన కామెడీ టైమింగ్‌కు ఈ విభిన్నమైన పాత్రలు తోడైతే ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని అందిస్తాయో చూడాలి.