తారలు - రాజకీయాలు - రెండు సీట్లు!
ABN, Publish Date - Apr 04 , 2026 | 02:44 PM
స్టార్ హీరో విజయ్ రాజకీయ పార్టీని పెట్టి ఎన్నికల బరిలో దిగడంతో ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. తెలుగు వారైన ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ తరహాలోనే విజయ్ కూడా రెండు స్థానాల నుండి పోటీచేస్తుండటం విశేషం.
పాలిటిక్స్‌లో మూవీ స్టార్స్ ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు. అయితే పార్టీలు పెట్టిన స్టార్స్‌లో చాలామంది ఒకే తీరున సాగారు. ఆ బాటలోనే ప్రస్తుతం తమిళనాట 'టీవీకే' పార్టీ అధినేత స్టార్ హీరో విజయ్ సాగుతూ ఉండడం విశేషంగా మారింది.
ప్రస్తుతం దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రంగా నిలచిన తమిళనాడు ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్నాయి. ఈ సారి అక్కడి ప్రధాన పార్టీలు డీయమ్కే (DMK), అన్నాడీయమ్కే (AIADMK) తో పాటు తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) నెలకొల్పిన 'తమిళగ వెట్రి కళగమ్' కూడా పోటీ చేయనుంది. తమిళనాట ఎమ్జీఆర్ (MGR), శివాజీ గణేశన్, కమల్ హాసన్, విజయ్ కాంత్ (Vijaykanth) వంటి స్టార్ హీరోస్ సొంతగా రాజకీయ పార్టీలు పెట్టారు. వీరిలో కొందరు విజయాన్ని సొంతం చేసుకుంటే మరికొందరు పరాజయంతో పయనించారు. ఇప్పుడు విజయ్ ఏ రూటులో సాగుతారో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ రాబోయే ఎన్నికల్లో తాను రెండు అసెంబ్లీ నియోజక వర్గాల నుండి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈస్ట్ ట్రిచీ, పెరంబూర్ అసెంబ్లీ సీట్ల నుండి విజయ్ బరిలో దూకనున్నారు. అదే ఇప్పుడు విశేషంగా మారింది. పార్టీ పెట్టిన స్టార్స్ రెండు చోట్ల నుండి నిలవడం కొత్తేమీ కాదని జనం గుర్తు చేసుకుంటున్నారు. 1983 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నటరత్న యన్టీఆర్ (NTR) కూడా ఆరంభంలోనే తిరుపతి, గుడివాడ నుండి పోటీ చేసి రెండు చోట్ల ఘనవిజయం సాధించారు.
అంతకు ముందు డీయమ్కేలో ఎమ్మెల్యేగా ఉండి, తరువాత అన్నా డీయమ్కే పార్టీ పెట్టి విజయం సాధించారు తమిళనాడు సూపర్ స్టార్ ఎమ్జీఆర్. అయితే యన్టీఆర్ అందుకు భిన్నంగా తానే సొంతగా 'తెలుగు దేశం పార్టీ' నెలకొల్పి 1983 ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. ఆ తరువాత 1985లో జరిగిన ఎన్నికల్లోనూ ఆయన హిందూపురం, గుడివాడ, నల్గొండ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి మూడు చోట్ల విజయకేతనం ఎగరేశారు. ఆ పై 1989 అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం, కల్వకుర్తి నుండి పోటీ చేయగా, హిందూపురంలో మాత్రమే విజయం సాధించారు. 1994లో హిందూపురం, టెక్కలి నియోజకవర్గాల నుంచి ఘనవిజయం సాధించారు. ఇలా రెండు చోట్ల స్టార్ హీరోస్ తమ సొంత పార్టీపై నిలచి గెలిచిన సంప్రదాయానికి యన్టీఆరే ఆద్యుడని చెప్పవచ్చు. తరువాత అదే పంథాలో మరో తెలుగు స్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi) 2008లో 'ప్రజారాజ్యం' పార్టీ నెలకొల్పి 2009 ఏపీ ఎన్నికల్లో తిరుపతి, పాలకొల్లు నుండి పోటీ చేశారు. తిరుపతిలో విజయం సాధించిన చిరంజీవి పాలకొల్లులో ఓటమి చవిచూశారు. తరువాత 18 సీట్లు గెలుచుకున్న తన పార్టీని చిరంజీవి 'కాంగ్రెస్'లో విలీనం చేశారు.
చిరంజీవి బాటలోనే పయనిస్తూ ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 2014లోనే 'జనసేన' పార్టీకి శ్రీకారం చుట్టారు. తరువాత 2019లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూడా రెండు చోట్ల నుండి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో భీమవరం, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్లా పరాజయాన్ని చవిచూశారు. తెలుగునాట 'పవర్ స్టార్'గా పవన్ కళ్యాణ్ జేజేలు అందుకుంటున్నారు. అదే తీరున తమిళనాట 'పవర్ స్టార్' అంటే విజయ్ - ఇప్పుడు ఆయన కూడా అసెంబ్లీ ఎన్నికల్లో తన 'తమిళగ వెట్రి కళగమ్' తరపున రెండు అసెంబ్లీ నియోజక వర్గాల నుండి బరిలోకి దూకుతున్నారు. యన్టీఆర్ లాగా విజయ్ రెండు చోట్లా విజయం సాధిస్తారా? లేక చిరంజీవిలా ఓ చోట గెలిచి ఓ సీటులో వెనకబడతారా? కాక పవన్ కళ్యాణ్ లా రెండు స్థానాల్లోనూ చాప చుట్టేస్తారా? ఇలాంటి ఊహాగానాలతో విజయ్ ఎన్నికల ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు తమిళ జనం. ఇదిలా ఉంటే తమిళనాడు మాజీ సీఎం జయలలిత 1991లో కంగేయం, బర్గూర్ నియోజవర్గాల నుండి పోటీ చేసి, రెండు చోట్లా విజయం సాధించారు. ఇందులో కంగేయం స్థానానికి రాజీనామా చేశారు. మరి తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న విజయ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.