‘ప్రిజనర్ నెంబర్ 626710’ స్క్రీనింగ్.. ఐఐఐటీ హైదరాబాద్‌కు సీబీఎఫ్‌సీ వార్నింగ్
ABN, Publish Date - Sep 18 , 2026 | 07:28 AM
ఉమర్ ఖాలిద్‌పై రూపొందిన ‘ప్రిజనర్ నెంబర్ 626710’ డాక్యుమెంటరీ ప్రదర్శనపై సీబీఎఫ్‌సీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నాడనే నేరారోపణతో అరెస్ట్ అయి, ప్రస్తుతం జైలులో ఉన్న జేఎన్‌యూ పరిశోధకుడు ఉమర్ ఖాలిద్ (Umar Khalid) పై లలిత్ వచానీ (Lalit Vachani) రూపొందించిన 'ప్రిజనర్ 'నెంబర్ 626710 (Prisoner Number 626710) డాక్యుమెంటరీ చిత్రాన్ని నేడు ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) హైదరాబాద్‌లోని కెఆర్బీ ఆడిటోరియంలో ప్రదర్శించబోతున్నామని కొన్ని విద్యార్థి సంఘాలు చేసిన ప్రకటనపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) CBFC అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ మేరకు తమ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేసిన సీబీఎఫ్‌సీ తాము ధృవీకరించని, ప్రత్యేకంగా మినహాయింపులు ఏవీ లేని డాక్యుమెంటరీ చిత్రాన్ని పబ్లిక్‌గా ప్రదర్శించడమంటే సినిమాటోగ్రఫీ చట్టాలను ఉల్లంఘించడమేనని హెచ్చరించింది. దీనితో పాటుగా ఐఐఐటీ హైదరాబాద్‌ను ట్యాగ్ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా కోరింది.
ఇదిలాఉంటే.. రాజకీయ ఖైదీల దినోత్సవం (సెప్టెంబరు 13) పురస్కరించుకుని శుక్రవారం రాత్రి 8 గంటలకు ఈ చిత్రాన్ని ప్రదర్శించడానికి కొన్ని విద్యార్థి సంఘాలు నిర్ణయించుకుని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశాయి. అయితే సీబీఎఫ్‌సీ హెచ్చరికల నేపథ్యంలో విద్యార్థులు ఈ చిత్ర ప్రదర్శనను రద్దు చేశారని కొంతమంది చెబుతున్నారు.