సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తెలుగు రంగస్థల తొలి పద్మభూషణ్ గ్రహీత.. ఏఆర్ కృష్ణ శత జయంతి ప్రత్యేక కథనం

ABN, Publish Date - Nov 13 , 2026 | 06:47 AM

తెలుగు రంగస్థలానికి ఆధునిక ప్రయోగాలను పరిచయం చేసిన ఏఆర్ కృష్ణ శత జయంతి నేడు. 'మాలపల్లి' జీవనాటక ప్రదర్శన నుంచి పద్మభూషణ్ పురస్కారం వరకు ఆయన నాటక ప్రస్థానంలోని విశేషాలు తెలుసుకోండి.

AR Krishna

'భాగ్యనగరం' మీద తెలుగు నాటకాన్ని కొత్త పుంతలు తొక్కించిన స్రష్ట.. తెలుగు రంగస్థలం నుంచి ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి వ్యక్తి... ఆధునిక నాటకానికి సామాజిక ప్రయోజనాన్ని అంటుకట్టి అద్భుత ప్రయోగాలకు నాంది పలికిన రంగస్థల పథ నిర్దేశకుడు అడుసుమిల్లి రాధాకృష్ణ శాస్త్రి (Adusumilli Radha Krishna Sastry). ఆయన తెలుగు సాంస్కృతిక, సాహిత్య, నాటక రంగాలకు ఏఆర్ కృష్ణగా సుపరిచితుడు. నేడు ఆయన శతజయంతి (AR Krishna 100th Birth Anniversary). ఈ సందర్భంగా హైదరాబాద్ రంగస్థలిపై (Hyderabad Theatre History) ఆయన ముద్రల గురుతులు ఇవి.

ఏఆర్ కృష్ణ (AR Krishna) నాటక రంగ ప్రయోగాలకు వేదిక భాగ్యనగరం. మాసబ్ ట్యాంక్, ఉస్మానియా టెక్నికల్ కళాశాల‌లో లైసెన్సియేట్ మెకానికల్ ఇంజ‌నీరింగ్ చదవడం కోసం 1950లో నగరానికి వచ్చిన ఆయన తుదిశ్వాస (1992,నవంబరు10) వరకు ఇదే నేలపై వందలాది నాటకాలను ప్రదర్శించారు. ఎంతోమందికి అభినయంలో శిక్షణలో ఇచ్చి వారిని నటీనటులుగా తీర్చిదిద్దారు. నాట్య సంఘం నెలకొల్పి తెలుగు నాటకానికి ఊపిరి లూదారు.

నారాయణగూడ న్యూసైన్స్ కళాశాల ప్రాంగణంలో తొలిసారిగా డిప్లొమా థియేటర్ ఆర్ట్స్ కోర్సును 1960లో ప్రారంభించారు. తరువాత అది రవీంద్రభారతిలో 1972వరకు కొనసాగింది. ఆనాటి నగర మైదానాలు, పార్కులు, వీధులు, గృహ సముదాయాలు, ఖాళీ స్థలాలు.. ఇలా ప్రతి ప్రదేశాన్ని రంగస్థలంగా మలిచారు. "ఏఆర్ కృష్ణ నాటకం అనగానే టికెట్టు కౌంటరు దగ్గర జనం బారులుతీరిన సందర్భాలెన్నో" అంటూ అప్పటి విషయాలను ఆయన శిష్యుడు గుమ్మడి గోపాలకృష్ణ గుర్తు చేసుకున్నారు.

'మాలపల్లి' జీవనాటకం..

పాశ్చాత్య ప్రయోగాత్మక రంగస్థలి ఎన్విరాన్మెంటల్ థియేటర్ స్ఫూర్తితో తెలుగులో మొదటిసారి జీవ నాటకానికి తెరతీసింది ఏఆర్ కృష్ణే. ఉన్న‌వ‌ లక్ష్మీనారాయణ రాసిన మాలపల్లి (Malapalli Play) నవలను దిగంబర కవితా ఉద్యమకర్త నగ్నముని నాటకీకరించగా.. ఏఆర్ కృష్ణ దర్శకత్వంలో 1974లో చిక్కడపల్లిలోని ఆంధ్ర విద్యాలయం (ఇప్పుడు లేదు) ప్రాంగణంలో సెట్టు, లైటింగ్, రంగాలంకరణ లాంటివేవీ లేకుండా ఆరు బయట యాభైమంది నటీనటులతో మూడు గంటల నిడివిలో ప్రదర్శితమైన ఆ నాటకం ఆనాడు ఒక సంచలనం. తద్వారా మెలోడ్రామాతో నడిచే తెలుగు నాటకాన్ని సహజ సిద్ధధోరణి వైపు మళ్లించారు.

పీవీ తొలి ప్రేక్షకుడు..

పీవీ నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, ప్రజాకవి కాళోజీ, దాశరథి రంగాచార్య, ఆత్రేయ, అక్కినేని నాగేశ్వ రరావు, దాసరి నారాయణరావు తదితరులు ఏఆర్ కృష్ణకు ఆత్మీయులు, అంతకు మించి అభిమానులు. ఆయన రాసి దర్శకత్వం వహించిన చాలా నాటకాలకు తొలి ప్రేక్షకుడు, విమర్శకుడు పీవీ నరసింహారావు అని ఓ సందర్భంలో ఏఆర్ చెప్పారు. ఏఆర్ కృష్ణ ప్రతిభను కళ్లారా చూసిన పీవీ ప్రధాని అయిన తరువాత, ఆయన పేరును పద్మభూషణ్ పురస్కారానికి ప్రతిపాదించారు.

సినిమా అవకాశాలను తిరస్కరించారు

బాలచందర్ లాంటి దర్శకులు వాళ్ల సినిమాలలో నటించాలి అని పట్టుబట్టినా మా నాన్న సున్నితంగా తిరస్కరించారు. చిక్కడపల్లిలోని మా ఇల్లు సినిమా, సాహిత్య దిగ్గజాల రాకపోకలతో సందడిగా ఉండేది. నాన్నగారి నాటకాలను చూడడానికి అక్కినేని, సినారె గుమ్మడి లాంటి ప్రముఖులు వచ్చేవారు. నిజాం కాలేజీ గ్రౌండ్, జీరా క్లబ్ ఒక్కటేమిటి.. నగరాన్నే ఒక రంగ స్థలంగా మార్చి వందల సార్లు నాటకాలను ప్రదర్శించారు. - అడుసుమిల్లి ప్రకాశ్ నీలం , ఏఆర్ కృష్ణ కుమారుడు

థియేటర్ ఆర్ట్స్ పదాన్ని ప్రవేశపెట్టింది ఏఆర్ కృష్ణ

నాలోని ప్రతిభను గుర్తించి నన్ను నటుడిగా తీర్చిదిద్దిన మహాశిల్పి ఏఆర్ కృష్ణ. థియేటర్ ఆర్ట్స్ పదాన్ని తెలుగు నాట ప్రవేశపెట్టిందీ ఆయనే! ప్రయోగాత్మక నాటకాలకు సామాజిక ప్రయోజనం అవసరమని బలంగా నమ్మారు. ఆయన 75వేలరూపాయలతో నెలకొల్పిన ట్రస్టు బాధ్యతలు నాతో పాటు దుగ్గిరాల సోమేశ్వరరావు గారికి మాత్రమే అప్పగించారు. ఆయన స్మారకంగా ప్రతి ఏటా ఒకరికి రంగస్థల పురస్కారం అందిస్తున్నాం. - గుమ్మడి గోపాలకృష్ణ (Gummadi Gopalakrishna), ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్

Updated Date - Nov 13 , 2026 | 06:47 AM