'పెద్ది'కి తప్పని తిప్పలు... పర్సెంటేజ్ కావాలంటున్న ఎగ్జిబిటర్స్!
ABN, Publish Date - May 23 , 2026 | 04:43 PM
తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ పర్సెంటేజ్ విధానంపై పట్టుదలగా ఉన్నారు. 'పెద్ది'తో సహా అన్ని సినిమాలను పర్సెంటేజ్ విధానానికే ఆడతామని స్పష్టం చేస్తున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తమ సమస్యను మరింత జటిలం చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు.
మెగా సూపర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమా జూన్ 4న విడుదల కాబోతున్న నేపథ్యంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ పీటముడి బిగిస్తున్నారు. పర్సంటేజ్ విధానానికి ఒప్పుకుంటేనే 'పెద్ది'ని ప్రదర్శిస్తామని చెబుతున్నారు. శనివారం తెలుగు ఫిలిమ్ ఛాంబర్ లో తెలంగాణ ఎగ్జిబిటర్స్ కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్ స్థానంలో జువ్వాడి శేఖర్ రావును ఎంపిక చేసినట్టు తెలిపారు. శేఖర్ రావు తండ్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకరరావు గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో రెండు పర్యాయాలు మంత్రిగా ఉన్నారు.
ఈ మీడియా సమావేశంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్, సుదర్శన్ థియేటర్ అధినేత బాల గోవింద్ రాజ్, రవీంద్ర గోపాల్ తదితరులు హాజరయ్యారు. శ్రీధర్ మాట్లాడుతూ, 'తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వేసిన కమిటీతో రెండు, మూడు సార్లు చర్చలు జరిగాయి. నిజానికి 'హరిహర వీరమల్లు' సమయంలోనే రెండు నెలల్లో సమస్యను పరిషరిస్తామని హామీ ఇచ్చారు. కానీ యేడాది గడిచినా ఎలాంటి పరిష్కారం చూపలేదు. మేమైతే 'పెద్ది' సినిమాను పర్సెంటేజ్ విధానంలోనే ఆడించాలని అనుకుంటున్నాం. అయితే నిర్మాతలు మమ్మల్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. టైమ్ పాస్ చేయడం కోసం గ్రేడింగ్ అనే మాట మొదలు పెట్టారు. మొదట ఈ సమస్య పరిష్కారానికి మూడు వారాలు అని అన్నారు. ఇప్పుడు ఆరు వారాలు అంటున్నారు. పర్సంటేజ్ సిస్టమ్ అమలు అయితేనే మేం సినిమాలు ప్రదర్శిస్తాం. ఇవాళ ఉన్నది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కాదు గిల్ట్ ఫిల్మ్ ఛాంబర్. వారు అనుకున్నదే చేస్తున్నారు' అని స్పష్టం చేశారు.
బాల గోవింద్ రాజ్ మాట్లాడుతూ, '120 మంది థియేటర్ ఓనర్లు దయనీయ పరిస్థితిలో ఉన్నారు. కావాలనే నిర్మాతలు ఆలస్యం చేస్తున్నారు. మాకు పర్సంటేజ్ విధానమే కావాలి. ఎంత శాతం ఇస్తారో వెంటనే స్పష్టం చేయాలి. పది, పదిహేనేళ్ళ క్రితం థియేటర్లకు మంచి రెవెన్యూ వచ్చేది. ఇప్పుడు ఎగ్జిబిటర్లకు ఆదాయం రావడం లేదు. కానీ నిర్మాతలకు మాత్రం రకరకాలుగా ఆదాయం వస్తోంది' అని అన్నారు. విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ, 'దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో పర్సంటేజ్ విధానం అమల్లో ఉంది. ఇక్కడ మాత్రమే రెంటల్ విధానం కొనసాగుతోంది. మా సమస్యను పరిష్కరించకుండా కావాలనే ఆలస్యం చేస్తున్నారు. తెలంగాణలో సినిమాల టిక్కెట్ రేట్లు పెంచకూడదని రేవంత్ రెడ్డికి వినతిపత్రం కూడా మేం ఇచ్చాం' అని అన్నారు. అవసరం అయితే ఈ విషయంలో చిరంజీవిని కలిసి, తమ ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళతామని తెలంగాణా ఎగ్జిబిటర్స్ తెలిపారు.