ఎస్వీబీసీ చైర్మన్‌గా శ్రీధర్ వర్మ.. ఈ నెల 22న బాధ్యతల స్వీకరణ
ABN, Publish Date - Aug 15 , 2026 | 08:18 AM
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) చైర్మన్‌గా ఇటీవల నియమితులైన శ్రీధర్ వర్మ టీటీడీ ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) చైర్మన్‌గా ఇటీవల నియమితులైన శ్రీధర్ వర్మ టీటీడీ ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు శ్రీధర్ వర్మకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్రను, తిరుపతి జేఈఓ శరత్‌ను కలిసి శ్రీధర్ వర్మ నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవి నాయుడు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ తోట వాసు తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీటీడీ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యుడు సంతారావును కూడా శ్రీధర్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఎస్వీబీసీ బోర్డు సమావేశంలో ఆమోదించిన తీర్మానం మేరకే శ్రీధర్ వర్మను చైర్మన్‌గా నియమించినట్లు టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర తెలిపారు. ఎస్వీబీసీని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లడంలో శ్రీధర్ వర్మ కీలకంగా వ్యవహరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంలో ఛానల్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. శ్రీధర్ వర్మ ఈ నెల 22న ఎస్వీబీసీ చైర్మన్‌గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.