త్యాగరాయ గానసభలో.. ఫ్రీగా గ్రంథావిష్కరణలు, శాస్త్రీయ సంగీత ప్రదర్శనలు
ABN, Publish Date - Nov 05 , 2026 | 10:54 AM
హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పుస్తకావిష్కరణలు, సాహితీ సమావేశాలు, శాస్త్రీయ సంగీత కార్యక్రమాలను ఉచితంగా నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి వెల్లడించారు.
గ్రంథ ఆవిష్కరణలు, సాహితీ సమావేశాలు శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు త్యాగరాయ గానసభ (Sri Thyagaraya Gana Sabha) లో ఇకపై ఉచితంగా (Free Literary Programmes) నిర్వహించే విధంగా తీర్మానం చేసినట్లు గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి (Kala Janardhanamurthy) తెలిపారు. గానసభలో బుధవారం గానసభ పాలక మండలితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో వివిధ సంస్థల వారికి సాహితీ, శాస్త్రీయ సంగీత కార్యక్రమాలకు ఉచితంగా హాలును ఇచ్చామని తెలిపారు.
ఇక మీదట గానసభలో పుస్తక ఆవిష్కరణ, శాస్త్రీయ సంగీత కార్యక్రమాలను తామే నిర్వహిస్తామని, వీటికి అయ్యే వ్యయం బ్యానర్స్ ప్రచారం వంటివి కూడా గానసభన భరిస్తుందని వివరించారు. రచయితలు తాము అతిథులను ఎంచుకునే అవకాశం కూడా కల్పిస్తామని, ఆ సమయానికి అందుబాటులో ఉన్న హాల్‌ను కేటాయిస్తామని చెప్పారు.
గానసభ పూర్వ అధ్యక్షులు కళా సుబ్బారావు (Kala Subbarao) స్మృతికి నివాళిగా ఖర్చులు భరిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని, గతంలోనూ ఆయన పేరిట ఉచిత కల్యాణ వేదికలు పేదవారికి అందించిన విషయం గుర్తు చేశారు. సమావేశంలో గాన సభ ప్రధానకార్యదర్శి కళా శారదదీక్షితులు, కళా రామచంద్రమూర్తి, కళా మహాలక్ష్మి, ఎస్పీ శ్రీనివాస్, కళా పద్మజనీ లిమ, తాళ్లపల్లి చక్రపాణి, భమిడి ఉష, కళా లలిత, గుండవరపు గీతా దేవి, బండి శ్రీనివాస్, బండి నాగజ్యోతి, సీహెచ్‌వీ ప్రసాద్ పాల్గొన్నారు.