సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

స్లీవ్‌లెస్ దుస్తుల్లో పాట.. ప్రముఖ గాయనికి 74 కొరడా దెబ్బలు!

ABN, Publish Date - Nov 25 , 2026 | 04:20 PM

హిజాబ్ లేకుండా సంగీత ప్రదర్శనలో పాల్గొన్న ఇరాన్ గాయని పరస్తూ అహ్మదీకి 74 కొరడా దెబ్బల శిక్ష అమలైంది. ఆమెతో పాటు మరో నలుగురికి కూడా శిక్ష విధించారు.

Parastoo Ahmadi

సంగీతానికి సరిహద్దులు లేవంటారు. కానీ కొన్ని దేశాల్లో కళాకారుల స్వేచ్ఛకు ఆంక్షలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మహిళల వస్త్రధారణ, కళా ప్రదర్శనల విషయంలో కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. తాజాగా ఇరాన్‌లో చోటుచేసుకున్న ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. హిజాబ్ ధరించకుండా (Hijab Controversy) సంగీత ప్రదర్శనలో పాల్గొన్న ప్రముఖ గాయని పరస్తూ అహ్మదీ (Parastoo Ahmadi) కి 74 కొరడా దెబ్బల శిక్ష (74 Lashes) అమలు చేసినట్లు ఆమె తరఫు న్యాయవాది వెల్లడించారు. ఆమెతో పాటు మరో నలుగురికి కూడా ఇదే శిక్ష విధించారు. (Iranian Singer News)

వివ‌రాల్లోకి వెళితే.. 29 ఏళ్ల పరస్తూ అహ్మదీ ఇరాన్‌లో మంచి గుర్తింపు పొందిన గాయని. 2024 డిసెంబరులో ఆమె ఖోమ్ (Qom) ప్రాంతంలోని చారిత్రక డెయిర్ గచిన్ కారవాన్‌సరాయ్‌లో ఓ సంగీత ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనకు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఇందులో ఆమె హిజాబ్ ధరించకుండా నల్లటి స్లీవ్‌లెస్ దుస్తుల్లో పాటలు పాడారు. ఆమెతో పాటు పురుష కళాకారులు కూడా పాల్గొన్నారు.

అదే స‌మ‌యంలో ఈ వీడియో అప్పట్లో పెద్ద ఎత్తున వైరల్ అయి ఇరాన్ అధికారుల దృష్టికి వెళ్ల‌డంతో వారు కేసు నమోదు చేశారు. ఆన్‌లైన్‌లో అసభ్యకర కంటెంట్‌ను రూపొందించి విడుద‌ల చేశార‌నే అభియోగాలు చేశారు. దాదాపు రెండేండ్ల నుంచి విచార‌ణ జ‌రిగిన ఈ కేసులో తాజాగా పరస్తూ అహ్మదీతో పాటు ఆమె బృందంలోని పలువురికి న్యాయస్థానం శిక్ష విధించింది. ఒక్కొక్కరికి 74 కొరడా దెబ్బలతో పాటు రెండేళ్లు సంగీత, కళా కార్యకలాపాల్లో పాల్గొనకుండా, దేశం విడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

ఈక్ర‌మంలోనే.. ఈ నెల 23న గాయని పరస్తూ అహ్మదీ, ఆమె బృందంలోని నలుగురికి 74 కొరడా దెబ్బల శిక్ష అమలు చేసినట్లు ఆమె తరఫు న్యాయవాది మొస్తాఫా నీలీ వెల్లడించారు. ఖోమ్‌లోని సంబంధిత శాఖ ఆధ్వ‌ర్యంలో ఈ శిక్ష‌ పూర్తయినట్లు తెలిపారు. ఇప్పుడు ఈ వార్త వెలుగులోకి రావడంతో ఇరాన్‌లో మహిళల హక్కులు, స్వేచ్ఛ, హిజాబ్ నిబంధనలపై మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. మరోవైపు, కొరడా దెబ్బల శిక్షను మానవ హక్కుల సంఘాలు, పలు అంతర్జాతీయ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇలాంటి శిక్షలు అమానవీయమైనవని విమర్శిస్తున్నాయి. అయితే ఈ ఘటనపై ఇరాన్ అధికారుల నుంచి మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదని ప‌లు వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

Updated Date - Nov 25 , 2026 | 04:40 PM