Singeetham: బి.ఎన్. రెడ్డి పురస్కారం అందుకోకుండానే...
ABN , Publish Date - Oct 05 , 2026 | 01:36 PM
బి.ఎన్. రెడ్డి జాతీయ పురస్కారాన్ని 2012కి గానూ సింగీతం శ్రీనివాసరావుకు ఏపీ ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. కానీ అనివార్యంగా వాటి ప్రదానం ఆలస్యమైంది. ఈ యేడాది డిసెంబర్‌లో ఈ అవార్డులను ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. కానీ దానిని అందుకోకుండానే సింగీతం ఈ లోకం నుంచి నిష్క్రమించారు.
ప్రభుత్వాలు అవార్డులను ప్రకటించిన వెంటనే వాటిని విజేతలకు అందిస్తే ఎంతో బాగుంటుంది. మరీ ముఖ్యంగా కొందరు ప్రముఖుల పేరుతో ఇచ్చే అవార్డులను స్వయంగా అందుకునే వారికి అదో తీయని జ్ఞాపకంగా మారుతుంది. కానీ అవార్డుల ప్రకటనకు వాటి ప్రదానానికీ మధ్య సంవత్సరాల తరబడి జాప్యం ఉండటంతో వాటిని అందుకోవాల్సిన వారు తనువు చాలించే ఆస్కారం ఉంది. తాజాగా సింగీతం శ్రీనివాసరావు విషయంలోనూ అదే జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2008లో, అప్పటికే ఇస్తున్న రఘుపతి వెంకయ్య, ఎన్టీఆర్ నేషనల్ అవార్డులతో పాటు బి.ఎన్. రెడ్డి, నాగిరెడ్డి -చక్రపాణి అవార్డులను ప్రవేశ పెట్టింది. ఇందులో బి.ఎన్. రెడ్డి జాతీయ అవార్డును దర్శకులకు ఇవ్వాలన్నది కమిటీ తీసుకున్న నిర్ణయం. ఆ రకంగా 2008లో ప్రఖ్యాత దర్శకుడు కె. బి. తిలక్ తొలి అవార్డును స్వీకరించారు. ఆ తర్వాత వరుసగా కె. రాఘవేంద్రరావు, బి. నరసింగరావు, శ్యామ్ బెనగాల్... బి.ఎన్. రెడ్డి జాతీయఅవార్డును అందుకున్నారు. 2012కి గానూ అప్పటి కమిటీ సింగీతం శ్రీనివాసరావును బి.ఎన్. రెడ్డి జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో 2012 నుంచి నంది అవార్డుల ప్రదానం జరగలేదు.
తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న అవార్డులతో పాటు, 2017 నుంచి 2024 వరకూ నంది అవార్డులను, సినీ జాతీయ పురస్కారాలను సైతం ప్రకటించి, డిసెంబర్‌లో విజేతలకు అందిస్తామని తెలిపింది. కానీ తనకు ప్రకటించిన బి.ఎన్. రెడ్డి అవార్డును అందుకోకుండానే సింగీతం శ్రీనివాసరావు అక్టోబర్ 3వ తేదీ రాత్రి కన్నుమూశారు.
వీరు సైతం...
ఇలా నంది అవార్డులతో పాటు ప్రకటించిన ప్రత్యేక అవార్డులను అందుకోకుండా తనువు చాలించిన వారిలో మరి కొందరు కూడా ఉన్నారు. దక్షిణ చలన చిత్ర పితామహుడైన రఘుపతి వెంకయ్య నాయుడు పేరుతోనూ ఏపీ ప్రభుత్వం 1980 నుంచి పురస్కారాన్ని అందిస్తోంది. రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని 2012కి గానూ కోడి రామకృష్ణకు, 2014కు కృష్ణంరాజుకు, 2015కు పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ కు ప్రకటించారు. కానీ వాటిని అందుకోకుండానే ఈ ముగ్గురూ కన్నుమూశారు. అలానే ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని 2012కి గానూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ప్రకటించారు. కానీ ఆయన అందుకోకుండానే చనిపోయారు. నిజానికి ప్రభుత్వం ప్రకటించిన వెంటనే వీటిని అందచేసి ఉంటే... గ్రహీతలకు జీవితకాలపు తీపి జ్ఞాపకంగా అది ఉండేది.
ఇవి కూడా చదవండి:
బాక్సాఫీస్ వద్ద.. హిందీ ‘దృశ్యం 3’ సెన్సేషన్
Raaka Movie: అల్లు అర్జున్ వైల్డ్ ఎంట్రీ సీన్‌పై అదిరిపోయే అప్‌డేట్.. అట్లీ మాస్టర్ ప్లాన్
Ranabaali: స్టార్‌డమ్, ఫ్యాన్ బేస్ తగ్గలేదు.. అయినా విజయ్‌కు జీవన్మరణ సమస్య