సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

చిన్న సినిమాలకు.. ప్రత్యేక థియేటర్ విధానం తీసుకురావాలి

ABN, Publish Date - Nov 28 , 2026 | 08:44 PM

తెలంగాణలో చిన్న సినిమాలకు థియేటర్ల కేటాయింపుపై ప్రత్యేక విధానం తీసుకురావాలని షిరాజ్ మెహదీ కోరారు.

Sheraz Mehdi

తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమాలు ఎదుర్కొంటున్న థియేటర్ల సమస్యకు పరిష్కారం చూపాలని నటుడు, దర్శకుడు షిరాజ్ మెహదీ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. పశ్చిమ బెంగాల్ తరహాలో స్థానిక చిత్రాలకు థియేటర్లలో ప్రాధాన్యత కల్పించే విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చిన్న నిర్మాతలకు థియేటర్ల కేటాయింపుపై ప్రభుత్వం ప్రత్యేక విధానం తీసుకురావాలని సూచించారు. తెలుగు ఫిలిం ఛాంబర్ చిన్న నిర్మాతలకు తగిన సహకారం అందించడం లేదని విమర్శించారు.

2012లో 'పార్సెల్' సినిమాతో హీరోగా పరిచయమైన తాను నటనతో పాటు దర్శకత్వం, సంగీతం, పంపిణీ రంగాల్లోనూ పనిచేసినట్లు షిరాజ్ తెలిపారు. సినిమా నిర్మాణంతో పాటు విడుదల, మార్కెటింగ్, థియేటర్ వ్యాపారంపై కూడా నిర్మాతలకు అవగాహన ఉండాలని పేర్కొన్నారు. ఫిలిం ఛాంబర్ సభ్యత్వ రుసుములు వసూలు చేస్తున్నప్పటికీ, చిన్న నిర్మాతల సమస్యల పరిష్కారంలో చొరవ చూపడం లేదని ఆరోపించారు. గత ఏడాదిన్నరగా ఈ అంశంపై పోరాడుతున్నానని, పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్ ఫిలిమ్స్ తదితర సంస్థలకు న్యాయపరమైన నోటీసులు కూడా పంపినట్లు వెల్లడించారు. తన ప్రయత్నాలకు పలువురు నిర్మాతలు, దర్శకులు, పంపిణీదారుల మద్దతు ఉందన్నారు.

ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ వ్యవహారాలపై స్పందిస్తూ.. పరిశ్రమ ప్రయోజనాల కోసం సి. కళ్యాణ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సినిమా నిర్మాణంలో నష్టాలు ఎదురైనంత మాత్రాన ఆత్మహత్యలకు పాల్పడవద్దని నిర్మాతలకు షిరాజ్ విజ్ఞప్తి చేశారు. సమస్యలపై శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని చిన్న సినిమాల విడుదల, థియేటర్ల కేటాయింపు సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్థానిక బెంగాలీ చిత్రాలకు థియేటర్లలో ప్రదర్శన అవకాశాలు పెంచేలా కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లలో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల మధ్య రోజుకు కనీసం ఒక బెంగాలీ సినిమాను ప్రదర్శించాలనే నిబంధన విధించింది. నిబంధనలు పాటించని థియేటర్లపై లైసెన్స్ రద్దు వరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇదే తరహా విధానాన్ని తెలంగాణలోనూ తీసుకొస్తే చిన్న తెలుగు సినిమాలకు విడుదల అవకాశాలు మెరుగుపడతాయని షిరాజ్ మెహదీ అభిప్రాయపడ్డారు.

Updated Date - Nov 28 , 2026 | 09:07 PM