'శంకరాభరణం' వెండితెర నవలకు అరుదైన గౌరవం

ABN , Publish Date - Mar 18 , 2026 | 07:39 PM

కె. విశ్వనాథ్‌ రూపొందించిన 'శంకరా భరణం' సినిమాకు దర్శకులు వంశీ అప్పట్లో వెండితెర నవల రాశారు. ఇటీవల అది పునర్ముద్రితమైంది. ఈ పుస్తకాన్ని సింగపూర్‌లో విశ్వనాథ్‌ తనయుడు నాగేంద్రనాథ్‌ ఆవిష్కరించారు.

Shankarabharanam book Release function

తెలుగులో వెండితెర నవలలు చాలానే వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో వాటిని పునర్ ముద్రించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. గత కొంతకాలంగా పాపులర్ వెండితెర నవలలను రీ-ప్రింట్ చేస్తున్నారు. అలా 'శంకరా భరణం' (Shankarabharanam) సినిమా విడుదల సమయంలో ఆ చిత్ర దర్శకత్వ శాఖలో పనిచేసిన వంశీ (Vamsy) వెండితెర నవల రాశారు. కళాతపస్వి కె. విశ్వనాథ్‌ (K. Viswanatha) జయంతి సందర్భంగా ఆ వెండితెర నవలను ఆయన కుమారుడు కె. నాగేంద్రనాథ్‌ పునర్ముద్రించారు. దీని ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల సింగపూర్‌లోని తెలుగువారి సమక్షంలో ఘనంగా జరిగింది.

శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న కె. నాగేంద్రనాథ్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కె. విశ్వనాథ్ అభిమానులు దాదాపు 70 మంది ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు మాట్లాడుతూ, కె. నాగేంద్రనాథ్ తో తనకు దాదాపు పదేళ్లకు పైగా అనుబంధం ఉందని తెలిపారు. సామవేదం షణ్ముఖ శర్మ 2017 లో సింగపూర్ విచ్చేసిన సందర్భంగా నిర్వహించిన శివపదం కార్యక్రమానికి ఆయన అందించిన సహకారాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే వీడియో సందేశాలు అందించిన పుస్తక రచయిత, ప్రముఖ దర్శకులు సీనియర్ డైరెక్టర్ వంశీ కి, ‘శంకరాభరణం’ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తనయులు ఏడిద రాజాకి ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్య అతిథి కె. నాగేంద్రనాథ్ మాట్లాడుతూ, ఈ పుస్తకాన్ని సింగపూర్‌లో ఆవిష్కరించాలని రత్నకుమార్‌తో చెప్పగానే అతి తక్కువ సమయంలో ఇంత చక్కగా ఏర్పాట్లు చేసినందుకు అభినందించారు. ‘శంకరాభరణం’ చిత్రం విడుదల సమయంలో వచ్చిన ఈ పుస్తకం అప్పట్లో తెలుగు ప్రజల అభిమానాన్ని విశేషంగా పొందిందని తెలిపారు. ప్రస్తుతం పుస్తకం అందుబాటులో లేకపోవడంతో పుస్తక రచయిత, సీనియర్ డైరెక్టర్ వంశీని సంప్రదించి దీనిని పునర్ముద్రణ చేయించామని చెప్పారు. కార్యక్రమం అంతటా ‘శంకరాభరణం’ చిత్రంలోని గీతాలు, విశేషాలు వినిపించడంతో ఇది ఒక అచ్చ తెలుగు పండుగలా అనిపించిందని తెలిపారు.

123 copy.jpg

'శంకరాభరణం' వెండితెర నవల తొలి పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విచ్చేసిన సంస్కార భారతి అధ్యక్షులు రమణమూర్తి కి, తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు బి.వి.ఆర్. చౌదరి దంపతులకు, తంగిరాల రాజశేఖర్, సౌభాగ్యలక్ష్మి దంపతులకు కె. నాగేంద్రనాథ్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ‘శంకరాభరణం’ చిత్రంలోని గీతాలను చంద్రహాస్ ఆనంద్, షర్మిల, కిరీటి దేశిరాజు, సౌభాగ్యలక్ష్మి, శేషు యడవల్లి ఆలపించగా, శేషశ్రీ వీణపై ఒక గీతాన్ని వాయించి ప్రేక్షకులను అలరించారు. అలాగే దర్శకుడు కె. విశ్వనాథ్ తో ఉన్న వ్యక్తిగత పరిచయాలను పూజా కండ్రప, రామచంద్రరావు ఆహుతులతో పంచుకోగా, చిత్ర, పుస్తక విశేషాలను వేణు రెడ్డి, రాధికా మంగిపూడి, రాంబాబు పాతూరి, శేషు యడవల్లి, సుబ్బు పాలకుర్తి, కోనాల కాళీకృష్ణ తదితరులు వివరించారు.


‘తెలుగు భోజనం’ ప్రవచనం! 'శంకరాభరణం' పుస్తక సంభాషణం!

'శంకరాభరణం' వెండితెర నవల రచన వెనుక దాగి ఉన్న విశేషాలను శంకరపల్లి సమీపంలో సంప్రదాయ తెలుగు పద్ధతిలో నిర్మించిన గడిలో రచయిత, దర్శకులు వంశీ ఇటీవల వివరించారు. ఉగాది ఎడిషన్ 2026 సందర్భంగా జరిగిన ఈ వేడుకలో ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి తెలుగు భోజనం అనే అంశంపై ప్రత్యేక ప్రవచనం చేశారు. అనంతరం వంశీ 'శంకరాభరణం' వెండితెర నవల రచన వెనుక ముచ్చట్లను ఆహుతులకు వివరించారు. కె. విశ్వనాథ్‌ దర్శకత్వ ప్రతిభను వివరిస్తూ, 'ఇప్పటికీ ఈ సినిమా, వెండితెర నవల రెండూ ప్రేక్షకుల, పాఠకుల ఆదరణ పొందుతూ ఉండటం ఆనందంగా ఉందని, ఆ ఖ్యాతి విశ్వనాథ్‌ గారికే దక్కుతుంద'ని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటి, నర్తకి మంజుభార్గవి, నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తనయుడు రాజా పాల్గొని 'శంకరా భరణం' నాటి అనుభవాలను పంచుకున్నారు.

Updated Date - Mar 18 , 2026 | 07:39 PM