సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హాలీవుడ్‌లో తెలుగు దర్శకుడి సాహసం.. ‘కింగ్ బుద్ధ’కు ఖర్గే ప్రశంసలు!

ABN, Publish Date - Nov 26 , 2026 | 12:34 PM

హాలీవుడ్ చిత్రం ‘కింగ్ బుద్ధ’ పోస్టర్‌ను మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు. సత్యారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది బుద్ధ జయంతికి 100కు పైగా భాషల్లో విడుదల కానుంది.

king buddha

గౌతమ బుద్ధుడి జీవిత చరిత్రను ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేసే లక్ష్యంతో తెరకెక్కుతున్న హాలీవుడ్ చిత్రం ‘కింగ్ బుద్ధ’ (King Buddha)కు ప్రముఖ రాజకీయ నాయకుడి నుంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమా ఇండియన్ లాంగ్వేజ్ పోస్టర్లను ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఆవిష్కరించారు. తన నివాసంలో ప్రముఖ బౌద్ధ భిక్షువుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అంతేకాదు, ఇప్పటివరకు పూర్తయిన సినిమా భాగాలను కూడా ఆయన వీక్షించి చిత్రబృందానికి పలు సూచనలు చేశారు.

తెలుగు దర్శకుడు సత్యారెడ్డి (Satya Reddy) తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రెండేళ్ల క్రితమే అమెరికాలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. గౌతమ బుద్ధుడి జీవిత విశేషాలను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించాలనే ఉద్దేశంతో అమెరికాతో పాటు థాయిలాండ్, శ్రీలంక, మలేషియా, వియత్నాం, లావోస్ తదితర దేశాల్లో చిత్రీకరణ జరిపారు. ఈ సినిమాలో దర్శకుడు సత్యారెడ్డే గౌతమ బుద్ధుడి పాత్రను పోషిస్తుండ‌డం విశేషం.

ఒక భారతీయుడు, ముఖ్యంగా ఒక తెలుగు వ్యక్తి ‘కింగ్ బుద్ధ’ పేరుతో గౌతమ బుద్ధుడి చరిత్రను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనుకోవడం సంతోషకరమని మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్, నటీనటులు, సాంకేతిక నిపుణులను అభినందించారు. సినిమా చూసిన అనంతరం అందులోని సన్నివేశాలు, పాత్రల చిత్రీకరణ, నిర్మాణానికి సంబంధించి కొన్ని విలువైన సూచనలు చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు, కథానాయకుడు సత్యారెడ్డి మాట్లాడుతూ.. మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా ‘కింగ్ బుద్ధ’ ఇండియన్ లాంగ్వేజ్ పోస్టర్లు ఆవిష్కరించడం, ఆయన సినిమా చూసి సూచనలు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. బౌద్ధ ధర్మంపై ఖర్గేకు మంచి అవగాహన ఉందని, కర్ణాటకతో పాటు గుల్బర్గా ప్రాంతంలో బౌద్ధ ధర్మ అభివృద్ధికి ఆయన చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన సూచనలను తప్పకుండా పాటిస్తామని తెలిపారు.

వచ్చే ఏడాది బుద్ధ జయంతి సందర్భంగా ‘కింగ్ బుద్ధ’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా భాషల్లో, పలు దేశాల్లో విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సత్యారెడ్డి వెల్లడించారు. త్వరలోనే ఆసియా ఖండంలోని ఓ దేశ ప్రధాని చేతుల మీదుగా, పలు దేశాలకు చెందిన బౌద్ధ భిక్షువుల సమక్షంలో సినిమా టీజర్‌ను ఘనంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

గౌతమ బుద్ధుడి పాత్రలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పిన సత్యారెడ్డి.. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా శారీరకంగా సిద్ధమయ్యానని, ఏకంగా 12 కిలోల బరువు తగ్గానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రమేష్, పవన్ రామ్‌తో పాటు పలువురు బౌద్ధ భిక్షువులు పాల్గొని చిత్రబృందాన్ని ఆశీర్వదించారు.

Updated Date - Nov 26 , 2026 | 12:36 PM