చెక్కుచెదరని సమంత స్థానం!

ABN , Publish Date - Mar 21 , 2026 | 03:54 PM

ఓర్మాక్స్ మీడియా సంస్థ తాజాగా విడుదల చేసిన టాప్ టెన్ హీరోయిన్స్ జాబితాలో సమంత అగ్రస్థానంలో నిలిచింది. గత నెలలోని హీరోయిన్ల స్థానం ఇప్పుడు కాస్తంత ముందుకు వెనక్కు అయ్యింది.

Top Ten Heroines

ఆల్ ఇండియాలో టాప్ టెన్ హీరోయిన్స్ జాబితా రిలీజయింది. ఈ టాప్ టెన్‌లో కొందరు గత స్థానాన్ని పదిల పరచుకున్నారు. మరికొందరు ముందుకు సాగారు - ఇంకొందరు వెనక్కి జరిగారు. ఇంతకూ అందాల తారలు ఏ యే స్థానాల్లో నిలిచారో చూద్దాం.

ప్రతి నెల ఓర్మాక్స్ మీడియా సంస్థ ఇండియాలోని టాప్ హీరోస్, టాప్ హీరోయిన్స్ జాబితా రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ సారి రిలీజ్ చేసిన పది మంది సుందరీమణుల జాబితాలో పదో స్థానాన్ని శ్రీలీల (Sreeleela) చేరుకుంది. జనవరి నెలలో 9వ స్థానంలో ఉన్న శ్రీలీల చప్పున పడిపోవడం గమనార్హం. ఆమె తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' సైతం అంతగా అలరించడం లేదు. జనవరిలో 10వ స్థానంలో ఉన్న తమన్నా (Thamannah) 9వ ప్లేస్‌లో తళుక్కుమనడం విశేషం. సాయి పల్లవి (Saipallavi) జనవరిలోనూ, ఇప్పుడు కూడా 8వ స్థానంలోనే నిలవడం గమనార్హం! ప్రస్తుతం సాయిపల్లవి నటిస్తోన్న 'రామాయణ' రిలీజయితే ఆమె స్థానం ముందుకు జరిగే అవకాశం ఉంది. ఆశ్చర్యంగా దీపికా పడుకోణె జనవరిలోనూ ఇప్పుడు కూడా 7వ స్థానంలోనే నిలిచారు. ఆమె స్థానం ముందుకు సాగకపోవడంపై సినీ ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


సినిమాలతో అంతగా అలరించక పోయినా త్రిష (Trisha) మాత్రం ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. జనవరిలో నాలుగో స్థానంలో ఉన్న త్రిష ప్రస్తుతం ఆరో ప్లేస్‌లో నిలవడం గమనార్హం! తమిళ స్టార్ హీరో విజయ్‌తో త్రిష సంబంధం సంచలనంగా మారినా ఓర్మాక్స్ ఫ్యాన్స్ ఆమెను పెద్దగా పట్టించుచుకోలేదు. ఇక కాజల్ (Kajal) ఆరో స్థానం నుండి ఐదో ప్లేస్‌కు రావడం విశేషం. కాజల్ సినిమాలతో సందడి చేయలేక పోయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటూ ఉన్నారు. జనవరిలో ఐదో ప్లేస్‌లో ఉన్న రశ్మిక మందన్న (Rashmika Mandanna), విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ను వివాహం చేసుకోవడం కారణంగా వార్తల్లో విశేషంగా చోటు చేసుకుంటున్నారు. ప్రస్తుతం నాలుగో ప్లేస్‌లో రశ్మిక మందన్న నిలిచారు.


ముగ్గురు భామలు మాత్రం తమ స్థానాన్ని ఏ మాత్రం జారవిడచుకోలేదు. అలాగని పైకి సాగనూ లేదు. ఎవరి స్థానాల్లో వారు పదిలంగా నిలచే ఉన్నారు. వారెవరంటే మూడో స్థానంలో నిలచిన నయనతార (Nayantara) - రెండో స్థానాన్ని ఆక్రమించుకున్న అలియా భట్. ఇక జనవరిలోనూ, ఇప్పుడు కూడా నంబర్ వన్ పొజిషన్‌లో ఉన్న క్రెడిట్ సమంత రూత్ ప్రభుకే దక్కింది. ఈ ముగ్గురు భామలు ఏదో ఒక రీతిన ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటూనే ఉన్నారు. అందువల్లే వీరికి స్థానభ్రంశం కలగలేదని చెప్పొచ్చు. ఈ మధ్యే దర్శకుడు రాజ్ నిడుమోరును పెళ్ళాడిన సమంతకు సోషల్ మీడియాలో ఎనలేని ఫాలోయింగ్ ఉంది. ఆ కారణంగానే సమంత ఇప్పుడు కూడా అగ్రగామిగానే సాగుతున్నారని చెప్పవచ్చు. త్వరలో 'మా ఇంటి బంగారం' మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు సమంత. మరి రాబోయే మాసాల్లో ఏ హీరోయిన్ ఏ స్థానంలో ఉంటారో చూడాలి.

Updated Date - Mar 21 , 2026 | 04:03 PM