సమంత: త్యాగాలు చేసేది మహిళే!
ABN, Publish Date - Mar 27 , 2026 | 12:21 PM
ది హాలీవుడ్ రిపోర్టర్ నిర్వహించిన కార్యక్రమంలో స్టార్ హీరోయిన్ సమంత పాల్గొన్నారు. వినోద రంగంలో మహిళల పాత్ర మీద ఆమె తన అభిప్రాయాలను తెలియచేశారు.
ఇటీవల ముంబైలో జరిగిన ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా (The Hollywood Reporter India) కార్యక్రమంలో స్టార్ హీరోయిన్ సమంత (Samantha) పాల్గొని, 'ఉమెన్ ఇన్ ఎంటర్ టైన్ మెంట్' అనే అంశంపై తన మనసులోని భావాలను వ్యక్తం చేశారు. చిత్రసీమతో పాటు సామాజిక రంగానికి చెందిన పలువురు మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ వేదికపై సమంత సినిమా రంగంలోని మహిళల అగచాట్లను పూసగుచ్చినట్టు వివరించారు. అలానే సాధారణ మహిళ మనస్తత్త్వాన్ని తెలిపారు.
'మహిళలు తమ వృత్తి జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో సందర్భాలలో రాజీ పడుతుంటారు. అయితే వారు చేసే త్యాగాలను సైతం గుర్తించలేరు. తమ వారికోసం నిస్వార్థంగా అలా చేస్తుంటారు' అని కితాబిచ్చారు. ఎవరైనా తమను మెచ్చుకుంటే కూడా వెంటనే దాన్ని పాజిటివ్‌గా తీసుకోవడానికి ఆలోచిస్తుంటారని, కానీ అలా అనుకోవాల్సిన అవసరం లేదని, ఎవరు అభినందించినా మనస్ఫూర్తిగా స్వీకరించమని ఆమె కోరారు. ఇవాళ సినిమా రంగంలో మహిళలకు తగిన గుర్తింపు లేదని ఆమె విచారం వ్యక్తం చేశారు. హీరో భార్యగా తెర మీద కనిపించే కథానాయిక పాత్రలకు కాలంచెల్లే రోజు రావాలని తాను కలలు కంటున్నానని అన్నారు.
ఉమెన్ సెంట్రిక్ మూవీ అనే పదాన్ని కూడా ప్రత్యేకంగా కోట్ చేయడాన్ని ఆమె తప్పు పట్టారు. అలాంటి చిత్రాలకు సహజమైన గుర్తింపు లభించాలి తప్పితే మహిళా ప్రధానమైన అని పేర్కొనడం సబబు కాదని అన్నారు. సినిమా రంగంలో మహిళలకు భద్రత ఉన్నప్పుడే ఎవరైనా ఈ రంగంలోకి రాగలరని, కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మహిళలకు ఈ రంగం అనువైనదిగా మారుతుందని, అలాంటి రోజు కోసం తాను ఎదురు చూస్తున్నానని సమంత చెప్పారు. అలానే ఈ సమాజంలో ఎక్కువ సార్లు పురుషులకంటే మహిళలే సారీ చెబుతుంటారని, ఆ అలవాటును మానుకోవాలని ఆమె హితవు పలికారు.