'నిలవే' నిర్మాత రాజ్ అల్లాడకు అరుదైన గౌరవం
ABN, Publish Date - Jun 03 , 2026 | 05:31 PM
నిలవే నిర్మాత రాజ్ అల్లాడకు అరుదైన గౌరవం దక్కింది. ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (NATS) 2026-2028 కి గాను ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
నిలవే నిర్మాత రాజ్ అల్లాడకు అరుదైన గౌరవం దక్కింది. ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (NATS) 2026-2028 కి గాను ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. న్యూజెర్సీకి చెందిన టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ రాజ్ అల్లాడ 2009 నుంచి NATSలో వాలంటీర్‌గా సేవలందిస్తున్నారు. సంస్థలో పలు బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు పలుమార్లు నాట్స్ (NATS) బోర్డ్ మెంబర్ గా వ్యవహరించారు. ముఖ్యంగా సేవా కార్యక్రమాల పట్ల ఆయన చూపిన నిబద్ధత, కమ్యూనిటీకి ఉపయోగపడే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలనే తపన ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. 2023లో డిప్యూటీ కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రాజ్ అల్లాడ, న్యూజెర్సీలో జరిగిన నాట్స్ సంబరాల్లో కీలక పాత్ర పోషించారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలు అందుకున్నారు. నిధుల సేకరణలో ఆయన చూపిన చొరవ, వాలంటీర్లను ఒకే లక్ష్యంతో ముందుకు నడిపించిన తీరు, సేవా కార్యక్రమాలపై ఉన్న అంకితభావం సభ్యుల్లో విశేష గుర్తింపు తీసుకొచ్చాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా నాట్స్ కు అందిస్తున్న సేవలను, ఆయన నాయకత్వ సామర్థ్యాన్ని గుర్తించిన సంస్థ ఇప్పుడు ఆయనను అధ్యక్ష పదవికి ఎంపిక చేసింది.
ఎంపిక కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా, పలు అంశాలను పరిశీలించిన అనంతరం నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎంపిక చేసింది. ఈ సందర్భంగా నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీ కిషోర్ కంచర్ల, నూతన అధ్యక్షుడు రాజ్ అల్లాడతో పాటు మొత్తం కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. సేవా దృక్పథం, అంకితభావం, స్పష్టమైన లక్ష్యాలతో ఈ బృందం సంస్థను మరింత ముందుకు తీసుకెళ్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. 2026-2028 లో రాజ్ అల్లాడ నాయకత్వంలోని నూతన కార్యవర్గం విజయవంతంగా పని చేసి సంస్థకు మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని నాట్స్ బోర్డ్ ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేసింది.