స్వతంత్ర నిర్మాతలకు అండగా ప్రోగ్రెసివ్ ప్యానల్!
ABN, Publish Date - Sep 04 , 2026 | 05:06 PM
ఈ నెల 6న జరుగుబోతున్న నిర్మాతల మండలి ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ ను గెలిపించమని అభ్యర్థులు కోరారు. నిర్మాతల ఆరోగ్య భద్రతతో పాటు పలు అంశాలకు సంబంధించి వారు హామీలు ఇచ్చారు.
ఈ నెల 6వ తేదీ ఆదివారం తెలుగు నిర్మాతల మండలి కార్యవర్గ సభ్యుల ఎన్నికల జరుగబోతోంది. ఇందులో ఇప్పటికే అధ్యక్షులుగా 'మన ప్యానెల్'కు చెందిన సి. కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన పదవుల కోసం 'మన ప్యానెల్', 'ప్రోగ్రెసివ్ ప్యానెల్' పోటీ పడుతున్నాయి. తాజాగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో స్వతంత్ర నిర్మాతలకు అండగా నిలుస్తామని, అలానే నిర్మాతల ఆరోగ్య భద్రతకు హామీ ఇస్తామని వారు తెలిపారు. గత రెండు నెలలుగా మాత్రమే చిత్రసీమలో కొత్త ఉత్సాహం నెలకొని ఉందని, థియేటర్లు మళ్ళీ కళకళలాడుతున్నాయని వారు తెలిపారు. సినిమా అనేది కేవలం ఓటీటీ లేదా స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ కోసం కాదని, వెండితెరపై ప్రేక్షకుడికి వినోదాన్ని ఇవ్వడం కోసమని వారు చెప్పారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా, ఆర్థిక ఇబ్బందులు కలిగినా సినిమా మీద ప్రేమతో, నమ్మకంతో తామంతా ముందుకు సాగుతున్నామని అన్నారు.
ఈ సందర్భంగా కె. ఎల్. దామోదర ప్రసాద్ మాట్లాడుతూ, 'కొందరు ప్రతిసారి గిల్డ్ అని విమర్శిస్తారు. గిల్డ్ ద్వారా మేం కలెక్టివ్ బార్గెనింగ్ అనేది పెట్టి ప్రతి నిర్మాతకు పబ్లిసిటీ కోసం యాడ్స్ రేట్ అందుబాటులో ఉండేలా పెట్టాం. 2 పర్సెంట్ కమీషన్ రన్నింగ్ కోసం తీసుకుంటున్నాం. అలానే గిల్డ్ తరపున లీగల్ ఫైట్స్ చేస్తున్నాం. దాని వల్ల ఇండస్ట్రీ కీ ఉపయోగమే. నిజం చెప్పాలంటే నిర్మాతల మండలిలో ఫండ్స్ లేవు. దాని వల్ల అవన్నీ కావు కూడా. సి. కళ్యాణ్ 'మా ప్యానెల్' నుంచి ఇప్పటికే అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆయన అందరి బాధ్యతలను చూడాలి. ఎవరైనా... ఈసీ మెంబర్స్ మెజారిటీ డెసిషన్స్ బట్టే నిర్ణయాలు తీసుకోవాలి' అని అన్నారు.
ఇదే సమావేశంలో అశోక్ కుమార్ మాట్లాడుతూ, 'నిర్మాతల మండలి పెట్టినప్పటి నుంచి నేను ఉన్నాను. అప్పుడు ఎన్నికల్లో నిలబడమన్నా ఎవరు ఇంట్రెస్ట్ చూపేవారు కాదు. నేను సెక్రటరీ గా రెండు సార్లు చేశాను. ఇది జీతం తీసుకుని చేసే జాబ్ కాదు. ఆర్గనైజేషన్ కోసం బాధ్యతగా చేసేపని. నామినేషన్స్ విత్ డ్రా విషయంలో నన్ను మన ప్యానెల్ సభ్యులు ఇబ్బంది పెట్టారు. బండ్ల గణేష్ అధ్యక్షుడిగా నిలబడతానని విత్ డ్రా అయ్యాడు. అధ్యక్షుడే విత్ డ్రా అనగానే సాహు గారపాటి, ఎస్ కె ఎన్, ఠాగూర్ మధు వెనకడుగు వేశారు. నిజం చెప్పాలంటే ఓటర్ల లిస్ట్ లో కూడా తప్పులున్నాయి. మమల్ని 'గిల్డ్ వాళ్లు' అంటున్నారు. సరిగా చేయరు అంటున్నారు. డీవీవీ దానయ్య, ఏషియన్ సునీల్ కూడా గిల్డ్ లోనే ఉన్నారు. వాళ్ళు 'మన ప్యానెల్'లో ఉన్నారు. మరి దీని గురించి ఏం చెబుతారు. ఎప్పుడైనా పూర్తిగా ప్యానెల్ గెలిపించ గలిగితే ఏదైనా చేయగలం. ఇప్పుడున్న సెక్రటరీ మనిషికో రకంగా మెడిక్లెయిమ్ మనీ ఇప్పిస్తున్నారు. కానీ ప్రతి మెంబర్ నూ ఒకేలా చూడాలని మేం భావిస్తున్నాం. పర్సనల్ గా నన్ను విభేదించండి. కాదనను, కానీ కౌన్సిల్ కు మంచి చేయాలనుకుంటున్న మా నిర్ణయాలను సపోర్ట్ చేయండి' అని అన్నారు.
ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఇస్తున్న హామీలు:
* తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొత్త ఉత్సాహం తీసుకురావడం
* నిర్మాతలకు, కార్మికులకు మధ్య సమన్వయానికి కృషి
* ప్రస్తుతం నిర్మాతలు చెల్లిస్తున్న వర్చువల్ ప్రింట్ ఫీ, డిజిటల్ ప్రొజెక్షన్ ఖర్చులను తగ్గించే దిశగా చర్యలు
* చిన్న సినిమాలకు థియేటర్లలో అవకాశాలు పెంచేలా ప్రోత్సాహక చర్యలు
* కొత్త నిర్మాతలను ప్రోత్సహించే విధంగా కనీస నిబంధనలతో పాటు సరళమైన విధానాలు
* మహిళా సభ్యుల భద్రత కోసం ప్రత్యేక కౌన్సిల్/సహాయ కేంద్రం ఏర్పాటు
* మహిళా సభ్యుల సమస్యలపై వేగంగా స్పందించే వ్యవస్థ ఏర్పాటు
* కార్మిక సంఘాలతో సుహృద్భావ సంబంధాలు
* నిర్మాతలు, కార్మికులు, కళాకారుల మధ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కారం
* ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలను సభ్యులకు పారదర్శకంగా అందించేందుకు ప్రతి నెల ఈ-లెటర్ ద్వారా సమాచారం
* సినిమా షూటింగ్‌లకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి 24/7 సాంకేతిక–న్యాయ సహాయ వ్యవస్థ ఏర్పాటు
* షూటింగ్ సమయంలో ఎదురయ్యే సమస్యలకు తక్షణ పరిష్కారం చూపేలా చర్యలు
* టికెటింగ్, ఎఫ్ అండ్ బి ధరలపై చర్చలు
* ప్రేక్షకులపై భారం పడకుండా మల్టీప్లెక్స్ ధరలపై ప్రభుత్వంతో చర్చలు
* చిన్న సినిమాలకు కూడా థియేటర్లు, షోలు లభించేలా చర్యలు
ఇవి కూడా చదవండి:
అల్లు అరవింద్ వర్సెస్ యశ్ మదర్ కాంట్రవర్సీ.. వర్మ పోస్ట్ వైరల్
నేపాల్‌కు ‘చేయూతనివ్వండి’.. రంగంలోకి రియల్ హీరో
ట్విన్స్‌తో జన్మాష్టమి.. ఉపాసన షేర్ చేసిన పిక్ వైరల్