Prakash Raj: నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్!
ABN, Publish Date - Apr 18 , 2026 | 12:21 PM
జాతీయ ఉత్తమనటుడు ప్రకాశ్ రాజ్ రామాయణంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. పలు చోట్ల ఆయనపై రామభక్తులు కేసులు పెడుతున్నారు. సహ నటుడు, జనసేన నేత నాగబాబు సైతం ప్రకాశ్ రాజ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఇటీవల కేరళ సాహిత్యోత్సవంలో ప్రకాశ్ రాజ్ (Prakash Raj) రామాయణం (Ramayanam) గురించి చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానగా మారుతున్నాయి. పలు ప్రాంతాలలో ఆయనపై రామభక్తులు కేసులు వేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి సైతం ప్రకాశ్ రాజ్‌పై పరువునష్టం దావా వేసి, లీగల్ నోటీసులు పంపారు. ఆయన సహ నటీనటులు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. మరికొందరైతే ఇంకాస్త ముందుకు వెళ్ళి ప్రకాశ్‌రాజ్ నటిస్తున్న సినిమాలను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. ప్రకాశ్ రాజ్‌ను సినిమాల నుండి తొలగించాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, నిర్మాత, జనసేన (Janasena) శాసనమండలి సభ్యులు నాగబాబు (Nagababu) సైతం ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన తన మనసులోని భావాలను వ్యక్తం చేశారు. 'శ్రీరాముడు కేవలం హిందువుల దేవుడు మాత్రమే కాదు. ఆయన ధర్మానికి ప్రతీక. ఆయనను అవమానించడం లేదా తగ్గించాలని చూడటం ధైర్యం కాదు... అహంకారం! మానసిక అంధత్వం వల్ల జరిగే పొరపాటు అది' అని అన్నారు.
రాముడిని ఎగతాళి చేసేవారు తమని తాము నష్టపర్చు కుంటున్నారని, అజేయమైన ధర్మాన్ని కాపాడే శక్తులు నిరంతరం పని చేస్తుంటాయని నాగబాబు అభిప్రాయ పడ్డారు. చరిత్రలో న్యాయానికి వ్యతిరేకంగా నిలిచినవారు పతనమయ్యారని, అదే విధంగా రాముడిపై విషం చిమ్మే వారి భవిషత్తు కూడా అదే అవుతుందని నాగబాబు అన్నారు. 'రాముడి పేరే ఓ కవచమని, ఆయన కథ ఖడ్గమని, ఆయన ఉనికి నాగరికతకు అచంచలమైన కోట' అని నాగబాబు ఆ పోస్ట్‌లో పేర్కొంటూ, ఇన్ డైరెక్ట్‌గా ప్రకాశ్ రాజుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ప్రకాశ్ రాజ్‌పై నాగబాబు డైరెక్ట్ అటాక్!
తాజాగా ప్రకాశ్ రాజ్‌ను ఉద్దేశించి నాగబాబు మరో ట్వీట్‌ను పోస్ట్ చేశారు. 'ప్రకాశ్ రాయ్‌గారూ మీరు... నాస్తికుడినని చెప్పారు. అయితే మీ తల్లి అంత్యక్రియలను ఆవిడ విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకుని క్రైస్తవ పద్థతిలో మీరు నిర్వహించారు. అది కొడుకుగా మీ బాధ్యత అని మేం గౌరవించాం. అదే భావనతో మీరు కోట్లాదిమంది నమ్మకాన్ని గౌరవించాలి. నాస్తికత్వం అంటే దేవుళ్ళను లేదా విశ్వాసాలను ఎగతాళి చేయడం కాదు. అది ఒక తార్కిక ఆలోచనా విధానం. హిందూమతం మాత్రమే నాస్తికత్వాన్ని కూడా ఓ తాత్విక ఆలోచనగా అంగీకరిస్తుంది. అలాంటి సంప్రదాయాన్ని నిర్లక్ష్యం చేయడం తార్కికత కాదు... అగౌరవపర్చడం. ఇతర దేశాల్లో అయితే ఇలాంటి మాటలు చెప్పినందుకు మీరు తీవ్రమైన ఇబ్బందులకు లోనయ్యేవారు. నేను మీ గురించి చేస్తున్న చివరి వ్యాఖ్య ఇదే. ఇక మీదట మీదో వాదించను' అని నాగబాబు తెలిపారు. మరి దీనిపై ప్రకాశ్ రాజ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.