మేం తీసింది సాగర సంగమం కాదు... సిల్లీ కామెడీ ఫిల్మ్...

ABN , Publish Date - Feb 13 , 2026 | 05:11 PM

విశ్వక్ సేన్, కయాదు లోహర్ జంటగా నటించిన 'ఫంకీ' సినిమాకు ప్రేక్షకుల నుండి చక్కని ఆదరణ లభిస్తోందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమాను అనుదీప్ కె.వి. డైరెక్ట్ చేశారు.

Funky Movie

విశ్వక్ సేన్, కయాదు లోహర్ జంటగా నటించిన 'ఫంకీ' సినిమా శుక్రవారం విడుదలైంది. అనుదీప్ కె.వి. దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా తీశారు. శుక్రవారం మధ్యాహ్నం సంస్థ కార్యాలయంలో సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ (Vishwak Sen) మాట్లాడుతూ, 'సినిమా విడుదలకు ముందు ఒత్తిడి ఉండటం సహజం. కానీ నేను 'ఫంకీ' విడుదలకు ముందు చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఉదయం శ్రీరాములు థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశాను. అందరూ ఎంతగానో ఎంజాయ్ చేశారు. కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకునేలా అనుదీప్ ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ చిత్రం నాకెంతో ఊరటనిచ్చింది. అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. నా సినీ ప్రయాణంలో ఇలాంటి సినిమా చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది' అని చెప్పారు. కయాదు లోహర్‌ (Kayadu Lohar) మాట్లాడుతూ, 'ప్రేక్షకులతో కలిసి ఉదయం 'ఫంకీ' సినిమా చూశాం. ప్రేక్షకులు ప్రతి జోక్‌ని ఎంజాయ్ చేస్తూ నవ్వడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మా సినిమాపై ఇంతటి ప్రేమ కురిపిస్తున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు' అని అన్నారు. దర్శకుడు అనుదీప్ కె.వి. (Anudeep K.V.) మాట్లాడుతూ, 'కుటుంబంతో కలిసి చూసి ఎంజాయ్ చేసేలా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయాలనే ఉద్దేశంతో 'ఫంకీ' సినిమా చేశాం. సినిమాలో కామెడీతో పాటు ప్రేమకథ, భావోద్వేగాలు కూడా బాగా పండాయి. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల సంతోషంగా ఉంది' అని అన్నారు.


చివరగా సూర్యదేవర నాగవంశీ (Suryadevara Nagavamsy) మాట్లాడుతూ, 'ఈ సినిమా రెండు గంటల పాటు హాయిగా నవ్వుకునేలా ఉంటుందని ముందు నుంచీ చెబుతూ వచ్చాం. మా నమ్మకం నిజమై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇది కేవలం ప్రేక్షకులను నవ్వించాలనే ఉద్దేశంతో చేసిన సినిమా. ఆ విషయంలో మేము విజయం సాధించాం. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఫోన్ చేసి సినిమా బాగుంది అన్నారు. కామెడీ బాగుంది, అలాగే సెకండ్ హాఫ్ లో మదర్ ఎమోషన్ పండిందని చెబుతున్నారు. ప్రేక్షకులంతా థియేటర్లకు వెళ్ళి, సినిమా చూడండి. మీ టికెట్ డబ్బులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. నవ్వుకోడానికి థియేటర్ కి రండి.. అసలు నిరాశ చెందరు' అని హామీ ఇచ్చారు.


GANI3023.JPG.jpeg

అనంతరం విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు నాగవంశీ తనదైన రీతిలో సమాధానం చెప్పారు. ఈ సినిమా రివ్యూవర్స్‌కు నచ్చదని తనకు తెలుసని అన్నారు. తాము 'సాగర సంగమం' తీసామని చెప్పడం లేదని, ఓ చిన్న సిల్లీ కామెడీ ఫిల్మ్ తీశామని తెలిపారు. సినిమాకు కావాల్సిన గ్రామర్ ఇందులో లేదని తమకు తెలుసని, అనుదీప్‌తో సినిమా అంటే అలానే ఉంటుందని, సినిమా మీద సినిమా తీస్తే కొంత రిస్క్ అని తెలిసీ తీశామని అన్నారు. సినిమాలో ఫ్లో లేదని, అంతా బిట్స్ బిట్స్‌గా ఉందని కొందరు చేస్తున్న విమర్శల గురించి ఆయన మాట్లాడుతూ, ఇలాంటి సినిమాలు ఇలానే ఉంటాయని సమర్థించుకున్నారు. ఈ సినిమాలోని వినోదాన్ని ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు.

Updated Date - Feb 13 , 2026 | 06:45 PM