ప్రముఖ నేపథ్యగాయని జమునా రాణి కన్నుమూత
ABN , Publish Date - Jul 30 , 2026 | 10:24 PM
ప్రముఖ నేపథ్యగాయని కోకా జమునా రాణి (88) గురువారం తెల్లవారుజామున బెంగళూరులో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న ఆమె ఉదయం 5.30 గంటలకు మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రముఖ నేపథ్యగాయని కోకా జమునా రాణి (88) గురువారం తెల్లవారుజామున బెంగళూరులో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న ఆమె ఉదయం 5.30 గంటలకు మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతి పట్ల పలువురు తీవ్ర సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఆమె అంత్యక్రియలను బెంగళూరులోని సర్వజ్ఞనగర్, కాక్స్ టౌన్, కథలిపాళ్య సమీపంలోని జీవనహళ్లి, కల్లహళ్లి శ్మశానవాటిక నందు శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ప్రార్థిస్తున్నారు.
కె. జమునా రాణి (K Jamuna Rani) దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో 6 వేలకు పైగా పాటలు ఆలపించారు. 1938 మే 17న ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన జమునా రాణి తండ్రి కె. వరదరాజులు నాయుడు కాగా, తల్లి కె. ద్రౌపది. తల్లి సంగీత నేపథ్యం కారణంగా చిన్ననాటి నుంచే ఆమె పాటలపై పట్టు సాధించారు. కేవలం ఏడేళ్ల వయసులోనే (1946) చిత్తూరు వి. నాగయ్య ‘త్యాగయ్య’ చిత్రంలో బాలనటుల కోసం తొలిసారిగా పాట పాడారు. జమునా రాణి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు సింహళ (శ్రీలంక) భాషల్లో దాదాపు 6,000కు పైగా పాటలు పాడి అరుదైన రికార్డు సృష్టించారు.
‘సరదా సరదా సిగరెట్టు’, ‘ఎంత టక్కరి వాడు నారాజు’, ‘ముక్కుమీద కోపం.. నీ ముఖానికే అందం’, ‘కోటు బూటు వేసిన బావ వచ్చాడయ్యా’, ‘పదపదవె వయ్యారి గాలిపటమా’ వంటి పాటలు తెలుగులో ఆమెకు ఎంతో పేరును తెచ్చిపెట్టాయి. శ్రీలంక (సింహళ) సినిమాల్లో ఆమె పాడిన పాటలు అత్యంత ప్రజాదరణ పొందడంతో పాటు, ఆమెకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ‘సద సులాంగ్’ చిత్రంలో ఏ.ఎమ్. రాజాతో కలిసి పాడిన ‘జీవన మీ గమన రంసారే’ పాట అక్కడ ఇప్పటికీ ఆల్-టైమ్ క్లాసిక్‌గా నిలిచింది. తమిళ సినీ సంగీత రంగానికి చేసిన విశిష్ట సేవలకుగాను 1998లో తమిళనాడు ప్రభుత్వం ఆమెను కలైమామణి’ పురస్కారంతో సత్కరించింది. అలాగే 2002లో తమిళనాడు ప్రభుత్వంచే అన్నాదురై పురస్కారాన్ని అందుకున్నారు.
ఇవి కూడా చదవండి:
సైమా 14వ ఎడిషన్ నామినేషన్స్‌లో ఈ తెలుగు చిత్రాలదే హవా..
మహేష్ సినిమాలో విలన్‌గా చేయాలని ఉంది: సుమంత్
యంగ్ టైగర్ వదిలిన ‘ఐ యామ్ గేమ్’ ట్రైలర్ ఎలా ఉందంటే..