సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి.. ఉత్త‌ర్వులు జారీ

ABN, Publish Date - Aug 17 , 2026 | 02:44 PM

ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు ఏపీ ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది.

nagababu

జనసేన (Jana Sena Party) కీలక నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు (Nagababu)కు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ పరిధిలోని గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ (Green Executive Committee Chairman) గా నాగబాబును నియమిస్తూ ఏపీ ప్రభుత్వం (AP Government) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవికి కేబినెట్ హోదా ఉండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

నాగబాబు పేరు కొంతకాలంగా ఏపీ మంత్రివర్గ విస్తరణతో ముడిపడి వినిపిస్తోంది. ముఖ్యంగా ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మంత్రి పదవి దక్కడం ఖాయమనే ప్రచారం సాగింది. 2024 డిసెంబర్ 9న అప్పటి టీడీపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు నాయుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ప్రకటించడంతో ఈ అంచనాలు మరింత బలపడ్డాయి.

ప్రస్తుతం ఏపీ కేబినెట్‌లో ఒక బెర్త్ ఖాళీగా ఉంది. మంత్రివర్గ విస్తరణపై చర్చలు మొదలైన ప్రతిసారీ జనసేన కోటాలో నాగబాబుకు అవకాశం దక్కుతుందనే ప్రచారం తెరపైకి వస్తోంది. అయితే కూటమిలో సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాల్సి రావడంతో ఆయన కేబినెట్ ఎంట్రీపై స్పష్టత రాలేదు.

ప్రస్తుతం జనసేన నుంచి పవన్ కల్యాణ్, కందుల దుర్గేశ్, నాదెండ్ల మనోహర్ మంత్రులుగా ఉన్నారు. పవన్ కల్యాణ్, కందుల దుర్గేశ్ ఒకే సామాజిక వర్గానికి చెందిన నేపథ్యంలో నాగబాబును కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటే సమీకరణాల పరంగా చర్చకు దారితీసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపించాయి.

ఈ నేపథ్యంలో నాగబాబుకు తాజాగా గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ పదవి దక్కడంపై ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా ఈ కమిటీ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పర్యవేక్షిస్తున్న అటవీ, పర్యావరణ శాఖ పరిధిలోనే ఉండటం గమనార్హం. కేబినెట్ హోదాతో కూడిన ఈ పదవిని నాగబాబుకు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఆయనకు కీలక బాధ్యత అప్పగించినట్టయింది.

అయితే నాగబాబుకు మంత్రి పదవి విషయంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుందా? లేక భవిష్యత్‌లో కేబినెట్ విస్తరణలో మరో అవకాశం ఉంటుందా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రస్తుత పరిణామాలను చూస్తే నాగబాబు మంత్రి పదవికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్టేననే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

Updated Date - Aug 17 , 2026 | 02:44 PM