NTR: ఎన్టీఆర్ వ్యక్తిత్వం, ఔన్నత్యం గొప్పవి: మంత్రి తుమ్మల

ABN , Publish Date - Jul 12 , 2026 | 10:33 AM

ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా టి.డి. జనార్దన్ ఛైర్మన్ గా ప్రారంభమైన ఎన్టీఆర్ లిటరేచర్‌ కమిటీ నాలుగవ వార్షికోత్సవం శనివారం ఎఫ్.ఎన్.సి.సి.లో జరిగింది. పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు ఈ కార్యక్రమానికి హాజరై అన్న ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

NTR Literature Committee

'అన్న ఎన్ .టి . రామారావు తెలుగు జాతికి స్ఫూర్తి ప్రదాత. తరతరాలు ఆయన భావజాలం కొనసాగుతుంది' అని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎన్ .టి .ఆర్. లిటరేచర్ కమిటీ నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ ఫిలింనగర్ లో శనివారం జరిగిన సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'తాను రామారావుగారి అభిమానంతో, ప్రోత్సాహంతో రాజకీయాల్లో ఎదిగానని, ఆయన వ్యక్తిత్వం, ఔన్నత్యం చాలా గొప్పదని, బడుగు, బలహీనవర్గాలతోపాటు వెనుకబడిన ప్రజలకు కూడా రాజకీయంగా చేయూతనిచ్చిన మహానాయకుడు రామారావుగార'ని చెప్పారు. ఎన్టీఆర్ భావజాలాన్ని ప్రపంచవ్యాప్తం చేయటానికి టి.డి. జనార్థన్ నాయకత్వంలో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఏర్పాటుకావటం ఎంతో సముచితంగా ఉందని, ఆ మహనీయుని చరిత్ర ఎప్పటికీ స్ఫూర్తినిస్తూంటుందని నాగేశ్వరరావు పేర్కొన్నారు.

తెలంగాణ మాజీ శాసనసభాదిపతి ఎమ్. మధుసూదనాచారి మాట్లాడుతూ, 'రాజ్యాధికారం లేని ఎన్నో కులాలను గుర్తించి వారికి సముచితమైన స్థానం ప్రసాదించిన ఆరాధ్యనాయకుడు ఎన్టీఆర్ అని, తాను ఏ పార్టీలో ఉన్నా ఎన్టీఆర్ ను తలవకుండా ఉండలేనని, ఎన్టీఆర్ తన అణువణువులో ఉన్నార'ని పేర్కొన్నారు. తమ కులానికి రాజ్యాధికారం కల్పించిన నాయకుడిగా ఎన్టీఆర్ ను తానెప్పుడూ గౌరవిస్తానని, పేద ప్రజల ఆకలిని గుర్తించిన మహనీయుడు ఎన్టీఆర్ అని ఆయన ప్రశంసింశారు. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్ టి.డి. జనార్థన్ మాట్లాడుతూ, రామారావు గారి శతజయంతి సందర్భంగా ఆయన చరిత్రను ముందు తరాలకు ఆనందజెయ్యాలని ఈ కమిటీ ఏర్పడింది. మా లిటరేచర్ కమిటీ ప్రారంభమై ఇప్పటికి నాలుగేళ్లవుతోంది. అసెంబ్లీ ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలు, శకపురుషుడు , తారకరామం, సజీవ చరిత్ర లాంటి పుస్తకాలను ప్రచురించి, ఎన్నో దేశాల్లో పర్యటించాం. ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టాం. ఏ దేశం వెళ్లినా అనూహ్యమైన స్పందన వచ్చేది. మేం నిర్వహించిన విదేశీ కార్యక్రమాల్లో సకుటుంబంగా మన భారతీయులు పాల్గొనేవారు' అని తెలిపారు .


తెలంగాణ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, 'ఎన్టీఆర్ చైతన్య యాత్రలు చేయడం, రాజకీయాల్లోకి రావడం, ముఖ్యమంత్రి కావడం దేశ రాజకీయాల్లో ఒక సంచలనం, ఒక చరిత్ర. రాజకీయంగా ఆయనను విమర్శించిన వారున్నారు. అయితే తన ప్రసంగాలతో విమర్శకులతో కూడా ప్రశంసలందుకున్న నాయకుడు. జర్నలిస్టులకు కూడా సహాయం చేసిన ముఖ్యమంత్రి ఎన్టీఆర్' అని కొనియాడారు . లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ, 'తెలుగు భాషకు, తెలుగు నేలకు ఆసేతు హిమాచలం గుర్తింపు తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీఆర్. ఆయన వల్ల తెలుగు వారికి ఇతర రాష్ట్రాల్లోనూ గౌరవం ఏర్పడింది. మన భాష, మన సంస్కృతి, మన నేల కోసం నిరంతరం తపన పడిన గొప్ప నాయకుడు' అని అన్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ, 'ఎన్టీఆర్ లేకుంటే నా జీవితమే లేదు. మా ఇంట్లో ఆయన ఫొటో తప్ప ఇంకెవరి ఫొటోలు పెట్టుకోలేదు. ఎన్టీఆర్ తో కలిసి మంత్రిగా పనిచేశాను. మధ్యవర్తులు లేని రాజకీయాలను నడిపారు ఎన్టీఆర్. పేదవారికి, బతుకే కష్టమైన వారికి ఎన్టీఆర్ తన పాలనలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు' అని చెప్పారు .

WhatsApp Image 2026-07-12 at 7.51.47 AM.jpeg

నిర్మాత టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, 'తెలుగు సినిమాను విశ్వవ్యాప్తం చేసిన మహానటుడు ఎన్టీఆర్. డీ గ్లామర్ పాత్రల్లోనూ ఆయన మెప్పించారు. ఇండస్ట్రీలో గొప్ప స్థాయిలో ఉండగానే నట జీవితాన్ని త్యాగం చేసి ప్రజా జీవితంలోకి వచ్చారు' అని అన్నారు. ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ, 'నటుడుగా , నాయకుడుగా ఎన్టీఆర్ ఏమిటో తెలుగు వారందరికీ తెలుసు. ఎన్టీఆర్ సృష్టించిన చరిత్ర గురించి చెప్పడానికే ఈ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ కృషి చేస్తోంది' అని చెప్పారు. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ, 'తమ కుటుంబం అందరికీ ఎన్టీఆర్ ఆరాధ్య నటుడు అని, ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి తెలుగువారి జీవితాల్లో గొప్ప మలుపుతీసుకొచ్చారని, ఆయన ఒక ప్రభంజనంలా ప్రజాజీవితంలో అడుగు పెట్టి ఎన్నో సంస్కరణలు చేసిన మహనీయుడని, ఆయన భౌతికంగా లేకపోయినా ఇప్పటికీ మన మధ్యనే ఉన్నట్లుగా భావిస్తున్నామ'ని అన్నారు.


WhatsApp Image 2026-07-12 at 7.51.47 AM (2).jpeg

ఈ కార్యక్రమంలో నిర్మాత కైకాల నాగేశ్వరరావు, తెలుగు అధికార భాష సంఘం అధ్యక్షులు విక్రమ్ పూల ప్రసంగించారు. ఎన్.టి.ఆర్. లిటరేచర్ కమిటీ ఛైర్మన్ టి.డి. జనార్థన్ ను, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావును , మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నిర్మాత డి.వి.కె. రాజు సత్కరించారు. 'శకపురుషుడు' పుస్తకాన్ని కన్నడంలో అనువదిస్తున్న డా. ఆర్. దేవన్నను చైర్మన్ డి. టి. జనార్థన్, మంత్రి తుమ్మల సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని నాటక రంగ సంస్థ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ భగీరథ నిర్వహించారు. ప్రార్ధనా గీతాన్ని గీతాన్ని శివ ప్రసాద్ దాకోజు ఆలపించారు . దొప్పలపూడి రామ మోహన్ రావు వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

ఇవి కూడా చదవండి:

జానకి పాడితే నటించనన్న సావిత్రి.. ఎందుకో తెలుసా

జానకి పాట విని స్టేజ్ పైనే దీవించిన పి. సుశీల తండ్రి..

జానకమ్మ జీవితంలో విషాదాలు..

Updated Date - Jul 12 , 2026 | 10:46 AM