జానకి పాడితే నటించనన్న సావిత్రి.. ఎందుకో తెలుసా
ABN , Publish Date - Jul 11 , 2026 | 09:50 PM
గాన కోకిల ఎస్. జానకి (S.Janaki) కెరీర్ ప్రారంభ దినాలలో ఆమెకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టిన పాట 'మురిపించే మువ్వలు' చిత్రంలోని 'నీ లీల పాడెద దేవా'.
గాన కోకిల ఎస్. జానకి (S.Janaki) కెరీర్ ప్రారంభ దినాలలో ఆమెకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టిన పాట 'మురిపించే మువ్వలు' చిత్రంలోని 'నీ లీల పాడెద దేవా'. ఆ పాట వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది. ఓ ప్రముఖ నటీమణి ఆ పాట జానకి పాడితే తాను నటించనని చెప్పారట. ఆ పాట వెనుక ఉన్న అసలు విషయాన్ని ఎస్. జానకి ఒకానొక సందర్భంగా ఇలా వివరించారు.
'మురిపించే మువ్వలు' చిత్రంలో నేను 'నీ లీల పాడెద దేవా' అనే పాట పాడాను. ఆ పాటకు తమిళ మాతృక అయిన 'సింగార వేళనె దేవా' (కొంజుం సలంగై) దక్షిణదేశాన్ని ఒక ఊపు ఊపేసింది. పాట సంగీత రచనా విధానమంతా ఫక్తు కర్ణాటక ఫక్కీయే అయినా జనాల్లోకి బాగా వచ్చేసింది. ఈ పాట రికార్డు తమిళంలో అయిదువేలకు పైగా అమ్ముడుపోయాయని చెప్పుకున్నారు ఆ రోజుల్లో. రెండు భాషల్లోనూ ఆ పాట నేనే పాడాను. నిజానికి ఆ పాట నా వల్ల గొప్పదేమీ కాలేదు, నేను ఆ పాట వల్ల మరింత పేరు తెచ్చుకుని పరిశ్రమలో స్థిరపడిపోయాను. ఆ పాటలోని ప్రత్యేకతేమైనా చెప్పుకోవాల్సివస్తే సుబ్బయ్యనాయుడు గారి అపార ప్రతిభ గురించి చెప్పుకోవాలి. అంతవరకు నాదస్వరంతో మానవకంఠాన్ని మేళవించటానికి ఎవరూ ప్రయత్నించ సాహసించలేదు. అలాంటి పరిస్థితిలో సుబ్బయ్య నాయుడు గారు అలాంటి మహోత్కృష్ట సృష్టి చేశారంటే అది ఒక విశేష వినూత్న ప్రయోగమే అని చెప్పుకోవచ్చు.
అసలా పాట అంత నిర్దుష్టంగా ఉండడానికి ఆయన తీసుకున్న శ్రమ అంతా ఇంతా కాదు. మొదట నాదస్వరవిద్వాన్ కారైకురుచ్చి అరుణాచలంతో రికార్డులో వినబడే నాదస్వర భాగాలన్నీ జాగాలుంచి రికార్డు చేశారు. తర్వాత దాంతోపాటు కంఠాన్ని కలిపి రికార్డు చేయదలిచారట. ఆ శ్రుతిలో శ్రుతి కలిపి పాడగలిగిన కంఠం కోసం మద్రాసు అంతా గాలించారట. మనకు లేరనుకుని బొంబాయి వెళ్లారట! అక్కడా ఎవరూ దొరక్కపోతే తిరిగి మద్రాసు వచ్చి ఆరా తీస్తుంటే అరుణాచలంగారికి ప్రముఖ గాయని పి.లీల గారు నా పేరు సూచించారట. నాదస్వరం రేంజిలో, ఆ రేంజికి దీటుగా పాడాలి. ఆ విధమైన రేంజిలో గాత్రాన్ని విన్పించగల గాయని జానకి ఒక్కరే అని సలహా యిచ్చారట. అప్పుడు సుబ్బయ్యనాయుడు గారు నన్ను అప్రోచ్ అయ్యారు. ముందు ఒక చిన్న రికార్డింగ్ థియేటర్ లో ఆ పాట పాడించి, పరీక్షించి వారు ఆశించిన విధంగా రావడంతో, తరువాత మెయిన్ రికార్డింగ్ చేసుకున్నారు. అది రికార్డు చేసేటప్పుడు కూడా శ్రమ తీసుకున్నారు సుబ్బయ్య నాయుడు గారు. ఆ స్థాయి శ్రుతి వారు అవలీలగా అందుకున్నారు గానీ, పాడటంలో మరో చిక్కు వచ్చింది. హీరోయిన్ పాడగా అవే స్వరాలు నాదస్వరంలో పలికించినట్లుగా కదా రికార్డులో ఉంది? కాని నాదస్వరమే ముందుగా రికార్డు చేశారు. సంగతికీ సంగతికీ మధ్యన ఉంచిన జాగాలలో నేను వచ్చే (నాదస్వర) సంగతిలో ఉన్న స్వరాల్ని అనాలి. అసలు ఈ సమన్వయమే తికమక పెట్టి చాలా కాలాన్ని తీసుకుంది. అయితేనేం చరిత్రలో నాపేరును సుస్థిరం చేసిందాపాట. అభేరి రాగం, సినిమా పరంగా అయితే భీంప్లాస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాగాన్ని సుబ్బయ్య నాయుడు గారు విశిష్టమైన పద్ధతిలో నలుగురికీ తెలిసిన నగుమోముకి ఏ మాత్రం పోలిక సామాన్య శ్రోతలకు కనిపించకుండా చేశారు. రాగం స్వరాలు ఘటవాద్య దరువులు యివన్నీ అంత జాగ్రత్తగా టైం తీసుకుని చేశారు కాబట్టే నేటికీ గొప్ప క్లాసిక్ గా నిలిచిపోయింది. ఒక మంచి పాట రావాలన్నా తద్వారా పేరు తెచ్చుకోవాలన్నా ఎంత కృషి చేయాల్సి వస్తుందో ఆ పాట ట్రాకు బాగా ఆకళింపు చేసుకొంటూ ఒక టేకులో పాడేశాను. ఈ పాటను 1989లో మద్రాసులో జరిగిన భారతీయ సినిమా ప్లాటినం జూబ్లీ ఉత్సవంలో కూడా ప్రదర్శించారు. అంత మంచి పాటకు నన్ను రెకమెండ్ చేసిన పి. లీల గారిని నా జీవితంలో మరచిపోలేను. ఒకరు బాగా పాడితే తామెక్కడ వెనుకబడిపోతామో అని ఆలోచించే ఈ రోజల్లో ఎలాంటి వుద్దేశ్యాలు లేకుండా నిస్వార్థంగా మరో గాయనికి అవకాశాలు యిప్పించే సౌహార్ద్రత ఎంతమంది గాయనీమణులకుంటుంది? అందుకే నాకు పి. లీల గారంటే అంత అభిమానం' అని చెప్పారు.
అలానే ఆ పాటకు సంబంధించినదే మరో ముఖ్యవిషయం గురించి ఆమె ఇలా తెలిపారు. ' 'మురిపించే మువ్వలు' లో నాయిక సావిత్రి. ఆమె ఆ పాటను నేను పాడితే నటించనన్నారు. తనకు కావలసిన మరో గాయని పేరు సూచించారు. కానీ సుబ్బయ్య నాయుడు గారు 'లేదు లేదు... మంచి పాట, జానకి కూడా చాలా గొప్పగా పాడింది. మీరు నటించనంటే బాధ లేదు, అంతగా మీకు ఇష్టం లేకపోతే ఆ పాట కమలా లక్ష్మణ్ మీద పెడతాములే' అన్నారు. అప్పటికి సరేనంది సావిత్రి. ఇలా ఆ పాటతో నాకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి. 'మురిపించే మువ్వలు' తర్వాత, తెలుగులో యిక నేను వెనుదిరిగి చూడాల్సిన పనే లేకపోయింది' అని ఆమె అన్నారు.