సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బాక్సింగ్‌ పోటీలు ఎఫ్.ఎన్.సి.సి. నిర్వహించాలి!

ABN, Publish Date - Apr 15 , 2026 | 04:09 PM

ఎఫ్‌.ఎన్.సి.సి. పుల్లెల గోపీచంద్ అకాడమి సంయుక్తంగా నిర్వహించిన జాతీయ బ్యాడ్మింటన్‌ లీగ్‌ పోటీల బహుమతి ప్రదానోత్సవం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి నిఖత్‌ జరీన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Pullela Gopichand

హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (FNCC), దిగ్గజ కోచ్ పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీతో కలిసి నిర్వహించిన ‘ఎఫ్.ఎన్.సి.సి.-పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ లీగ్’ (FNCC-PGBL) క్రీడాకారుల్లో మంచి జోష్ నింపింది. ఏప్రిల్ 4న ప్రారంభమైన ఈ ప్రతిష్ఠాత్మక లీగ్ ప్రతి శని, ఆదివారాల్లో ఫిలింనగర్ క్లబ్ వేదికగా జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న టాప్-10 పురుష, మహిళా క్రీడాకారులు ఈ లీగ్‌లో పాల్గొని తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. టాలీవుడ్ ప్రముఖులు, క్రీడా దిగ్గజాల సమక్షంలో జరిగిన ఈ టోర్నీ బ్యాడ్మింటన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు తలపడగా, ప్రతి జట్టు 10 లక్షల రూపాయల ఎంట్రీ ఫీజుతో బరిలోకి దిగాయి. ఈ లీగ్‌లో గెలిచిన వాళ్లకు మంగళవారం ఎఫ్ఎన్‌సీసీలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ రామారావు, కార్యదర్శి తుమ్మల రంగారావు , ఉపాధ్యక్షులు ఎస్ ఎన్ రెడ్డి, ఉప కార్యదర్శి కె. సదాశివ రెడ్డి, కోశాధికారి శైలజ జుజాల... కమిటీ సభ్యులు ఏడిద రాజా , కృష్ణంరాజు (వేణు) , వరప్రసాదం రావు, స్పోర్ట్స్ కన్వీనర్ కోగంటి భవాని, ఎఫ్‌.ఎన్.సి.సి. మాజీ ఉపాధ్యక్షులు. బాడ్మింటన్ చైర్మన్ పురుషోత్తమ రావు, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వి. చాముండేశ్వరీనాథ్ కీలక పాత్ర పోషించారు. పుల్లెల గోపీచంద్, నిఖత్ జరీన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.


ఈ సందర్భంగా కేఎస్ రామారావు మాట్లాడుతూ, 'గోపీచంద్, చాముండేశ్వరీనాథ్ ఇద్దరు చేసిన కృషి చాలా గొప్పది. ఎఫ్ఎన్‌సీసీ గత ఉపాధ్యక్షుడు, బ్యాడ్మింటన్ చైర్మన్ పురుషోత్తం ఈ లీగ్ సాధ్యమయ్యేలా చేశారు. భవిష్యత్తులో ఆరు నుంచి పది టీముల దాకా ఉండే స్కోప్ ఉంది. ఈ మేరకు గోపీచంద్ గారికి రిక్వెస్ట్ చేశాం. నెక్ట్స్ టోర్నమెంట్‌ను లైవ్ టెలీకాస్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నాం’ అని అన్నారు. పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ, 'మా అసోసియేషన్‌కు ఎప్పుడూ ఎఫ్ఎన్‌సీసీ సపోర్ట్ చేస్తుంది. ఇంతకు ముందు జాయింట్‌గా టోర్నమెంట్స్ చేసేవాళ్లం. ఇప్పుడు చాముండేశ్వరీనాథ్ కాల్ చేసి నేషనల్ లెవెల్ లీగ్‌గా చేద్దామన్నారు. అయితే ఇక్కడ కోర్ట్స్ తక్కువగా ఉండడం వల్ల టోర్నమెంట్స్ కండక్ట్ చేయలేకపోయాం. చాముండేశ్వరీనాథ్ గారు అడిగిన వెంటనే రెండు రోజుల్లో టీమ్స్ రెడీ చేశాం. తక్కువ టైమ్‌లో చాలా మంచిగా ఈవెంట్ జరిగింది. ఈ క్రెడిట్ ఎఫ్ఎన్‌సీసీదే. ఐపీఎల్, ఈపీఎల్ కాకుండా ఇలాంటివి ఎంకరేజ్ చేయాలి. ఎక్కడో మెస్సీ ఆడితే చూసి సంబరం పడడం కాదు. మన దగ్గర మన పిల్లలను చూసుకుని ఆనందించాలి. మనవాళ్లు ఆడేది మనం చూసి మురిసిపోవాలి. ఇలాంటి ఈవెంట్స్ మరిన్ని జరగాలి. నిఖత్ జరీన్ ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. నేను ఉయ్యూరులో 13 ఏళ్ల అప్పుడు మ్యాచ్ ఆడుతుంటే చాలామంది ఎంకరేజ్ చేసేవాళ్లు. అలాంటి ఎంకరేజ్ ప్లేయర్స్ అందరికీ ఉండాలి. ఇలాంటి ఈవెంట్స్ మరెన్నో నిర్వహించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.


ముఖ్యఅతిథి నిఖత్ జరీన్ మాట్లాడుతూ, 'ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఎఫ్ఎన్‌సీసీకి థ్యాంక్స్. విన్నర్స్ అందరికీ కంగ్రాట్స్. నేను బ్యాడ్మింటన్‌ను లైవ్‌లో చూడడం ఇదే మొదటి సారి. చిన్న చిన్న పిల్లలు కూడా ఎంతో బాగా ఆడుతున్నారు. ఇక్కడ బాక్సింగ్ కూడా కండక్ట్ చేస్తే బాగుంటుంది. తెలంగాణలో బాక్సర్స్ కూడా ఉన్నారు. నెక్ట్స్ ఇయర్ బాక్సింగ్ కూడా కండక్ట్ చేస్తారని ఆశిస్తున్నాను' అని అన్నారు. ఈ బ్యాడ్మింటన్ లీగ్‌లో వాయుపుత్ర టైగర్స్ టీమ్ ఛాంపియన్‌గా నిలవగా ఎలిగెన్స్ ఈగల్ టీమ్ రన్నరప్‌గా నిలిచింది. పోరూస్ పాంథర్స్ మూడో స్థానంలో నిలవగా.. ఎఫ్ఎన్‌సీసీ లయన్స్ నాలుగో స్థానంలో నిలిచింది. విన్నర్స్‌కు ఇండియన్ బాక్సర్ నిఖత్ జరీన్, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

Updated Date - Apr 15 , 2026 | 04:10 PM