నెట్‌ఫ్లిక్స్‌లో పాక్ వెబ్ సిరీస్.. నిషేధించాలని మోదీకి లేఖ..
ABN , Publish Date - Nov 25 , 2026 | 06:57 PM
డిసెంబర్ 4న విడుదల కానున్న ‘జో బచాయ్ హై సంగ్ సమైట్ లో’ అనే పాకిస్థానీ వెబ్ సిరీస్‌ను నిషేధించాలని కోరుతూ ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది.
ఓటీటీ వేదికగా విడుదలకు సిద్ధమవుతున్న ఓ పాకిస్థానీ (Pakistan) వెబ్ సిరీస్ ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది. ప్రముఖ అంతర్జాతీయ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో డిసెంబర్ 4న ప్రీమియర్ కానున్న ‘జో బచాయ్ హై సంగ్ సమైట్ లో’ (Jo Bachay Hain Sang Samait Lo) సిరీస్‌ను భారత్‌లో నిషేధించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (Narendra Modi) లేఖ రాసింది. ఈ సిరీస్ భారతీయ ప్రేక్షకులకు అందుబాటులోకి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.
ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ శ్యామ్‌లాల్ గుప్తా (Suresh Shyamlal Gupta) ప్రధాని మోదీకి రాసిన లేఖలో పాకిస్థానీ కంటెంట్ ప్రసారంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశానికి చెందిన కంటెంట్‌ను భారతీయ స్క్రీన్లపై ప్రదర్శించేందుకు అనుమతించకూడదని పేర్కొన్నారు. దేశ భద్రత, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
భారత్‌లో వ్యాపారం నిర్వహిస్తున్న ఓటీటీ సంస్థలు కూడా ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని AICWA కోరింది. పాకిస్థానీ కంటెంట్‌ను భారతీయ ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురాకుండా అన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఒకే విధమైన విధానాన్ని అనుసరించాలని సూచించింది. దేశ ప్రయోజనాల కంటే వ్యాపార ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదని తన లేఖలో స్పష్టం చేసింది. పాకిస్థాన్ నుంచి ఫస్ట్ టైం నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన మొట్టమొదటి ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘జో బచాయ్ హై సంగ్ సమైట్ లో’. పూర్తిగా ఇటలీ వేదికగా ఇద్దరు పాకీస్తానీల మధ్య లవ్, రొమాన్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ డిసెంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కావాల్సి ఉంది. అయితే భారతదేశంలో ఈ సిరీస్‌ను ప్రసారం చేయడంపై ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విడుదలకు ముందే AICWA ప్రధానికి లేఖ రాయడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.
గత కొంతకాలంగా ఓటీటీ వేదికలపై ప్రసారమవుతున్న కంటెంట్ విషయంలో భారత్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కళలు, వినోదానికి దేశాల సరిహద్దులు ఉండకూడదని కొందరు అభిప్రాయపడుతుంటే.. దేశ భద్రత, జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడకూడదని మరికొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో AICWA తీసుకున్న తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని మోదీకి రాసిన లేఖపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఈ సిరీస్ ప్రసారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, ఈ సిరీస్‌ను భారత్‌లో నిషేధించాలన్నది ప్రస్తుతం AICWA చేసిన డిమాండ్ మాత్రమే. దీనిపై అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉంది.