'టైర్ 2' హీరోస్‌లో 'నంబర్ వన్'గా నాని!
ABN, Publish Date - Apr 03 , 2026 | 04:56 PM
టైర్ 2 హీరోస్‌లో ఎవరు నంబర్ వన్ అనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే కలెక్షన్స్ పరంగా ఆ స్థానాన్ని నాని అందుకున్నాడని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
'నంబర్స్ గేమ్'పై ఆసక్తి లేదంటూనే 'అగ్రగామి'గా నిలవాలని ఆశిస్తూంటారు స్టార్ హీరోస్. టాలీవుడ్ లో మూడు తరాల హీరోలు సాగుతున్నారు. వారిలో 'టైర్ టూ హీరోస్' లో 'నంబర్ వన్' ఎవరు అన్న చర్చ సాగుతోంది. ఇంతకూ ఎవరు నంబర్ వన్?
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎవరు అంటే ప్రభాస్, మహేశ్, జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ పేర్లే వినిపిస్తాయి. వీరినే తెలుగు సినిమా జనం 'టైర్ వన్ హీరోస్' అంటున్నారు. వీరిలో 'నంబర్ వన్' ఎవరు అంటే నిస్సందేహంగా భారీ వసూళ్ళు చూస్తూ, భారీ పారితోషికం తీసుకుంటున్న ప్రభాస్ అనే చెప్పాలి. ఇప్పటికే ప్రభాస్ ను 'ఇంటర్నేషనల్ స్టార్ ఆఫ్ ఇండియా'అని, 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్' అనీ అంటున్నారు కాబట్టి, ఈ ' టైర్ వన్ హీరోస్'లో నంబర్ వన్ ఎవరు అన్న దానిపై పెద్గగా చర్చ సాగదు. అయితే వీరి తరువాతి వరుసలో ఉన్నవారిలోనే 'నంబర్ వన్' హీరో ఎవరు అన్న డిస్కషన్ సాగుతోంది. అదే సినీఫ్యాన్స్ లో ఆసక్తి కలిగిస్తోన్న అంశం.
ఇంతకూ 'నంబర్ వన్' అని ఎలా డిసైడ్ చేస్తారు? మన స్టార్ హీరోస్ సక్సెస్ రేటును బట్టి, వారు పుచ్చుకుంటున్న రెమ్యూనరేషన్స్ లెక్కిస్తూ 'నంబర్ వన్' అన్న ట్యాగ్ ను తగిలిస్తూ ఉంటారు. ఆరు పదులు దాటినా అలరిస్తూనే సాగుతోన్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ సక్సెస్ రేటు ఎలా ఉన్నా వారి ఆర్డర్ మాత్రం ఇదే! కానీ చిరు, బాలయ్య ఫ్యాన్స్ మధ్య మాత్రం 'మా హీరో నంబర్ వన్' అంటే 'కాదు. మా హీరో టాప్ స్టార్' అనే పోటీ ఎప్పటి నుంచో సాగుతోంది. కొన్నిసార్లు చిరంజీవి వరుస విజయాలతో సాగారు- మరికొన్ని పర్యాయాలు బాలయ్య పైచేయి అనిపించుకున్నారు. అందువల్ల అభిమానుల మధ్య వాగ్వాదాలు సర్వసాధారణమే!. కాబట్టి వీరి విషయంలో సక్సెస్ రేటునే లెక్కించవలసి ఉంటుంది.
టాలీవుడ్ టాప్ ఫోర్ - తరువాతి తరంలో పవన్ కళ్యాణ్ కు తిరుగులేదని చెప్పొచ్చు. ఆ తరువాతి వారే 'టైర్ వన్' స్టార్స్. ఇక 'టైర్ టూ స్టార్స్' విషయానికి వస్తే వీరిలో నాని, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, రామ్, శర్వానంద్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నవీన్ పోలిశెట్టి, అడివి శేష్, సిద్ధూ జొన్నలగడ్డ, విష్వక్ సేన్ వంటివారు ఉన్నారు. వీరిలోనూ - నాని, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, రామ్ నలుగురి మధ్యే ప్రధాన పోటీ అని తెలుస్తోంది. నాగచైతన్య ఈ మధ్యే తన 'తండేల్' సినిమా ద్వారా గ్రాండ్ సక్సెస్ చూశారు. అదే సినిమాతో ఉత్తమ నటునిగా తెలంగాణ ప్రభుత్వ అవార్డును సొంతం చేసుకున్నారు. విజయ్ దేవరకొండకు పరాజయాలు పలకరిస్తున్నా, క్రేజ్ అలాగే ఉంది. రామ్ తనకంటూ ఓ క్రేజ్ తో సాగుతున్నారు. వీరిలో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్నది నిస్సందేహంగా నానికే అని సినీ ఫ్యాన్స్ అంటున్నారు. నాని విలక్షణ పాత్రలు, విజయాల శాతం ఆయనకు 'నంబర్ వన్' ప్లేస్ ఇచ్చాయని చెప్పొచ్చు. రాబోయే సినిమాలతో నాని ఏ తీరున మురిపిస్తారో చూడాలి.