ప్రతీ 15 రోజులకూ.. నా పాస్‌వర్డ్స్ అన్నీ మారుస్తా: కింగ్ నాగార్జున
ABN, Publish Date - Aug 14 , 2026 | 02:28 PM
ప్రతీ 15 రోజులకూ.. నా పాస్‌వర్డ్స్ అన్నీ మారుస్తానని అన్నారు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున. అందుకు కారణం ఏమిటో కూడా తాజాగా ఆయన హాజరైన వేడుకలో తెలిపారు.
ప్రతీ 15 రోజులకూ.. నా పాస్‌వర్డ్స్ అన్నీ మారుస్తానని అన్నారు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna). నాలుగేళ్ల క్రితం సైబర్ మోసానికి గురయ్యానని, అందుకే ఎప్పటికప్పుడు అలెర్ట్‌గా ఉంటానని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సురక్ష కా తిరంగా (Suraksha Ka Tiranga) సైబర్ అవేర్‌నెస్ కార్యక్రమంలో నాగార్జున చెప్పుకొచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో నిర్వహించిన సైబర్ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌కు కింగ్ నాగార్జున (King Nagarjuna) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాగార్జున కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
తనకు ఓ బ్యాంక్ అధికారి పేరుతో గతంలో కాల్ వచ్చిందని తెలిపారు. ‘నాగార్జున గారు.. మీరు బిజినెస్‌లో చాలా స్మార్ట్ అని విన్నాను.. మరి ఎందుకు ఇన్వెస్ట్ చేయడం లేదు. చాలా గొప్ప లాభాలు ఇచ్చే స్కీమ్ ఇదని ఆ వ్యక్తి నన్ను మాయ చేశాడు’ అని తెలిపారు. సాధారణంగా తన ఆర్థిక వ్యవహారాలన్నీ తన మేనేజర్ చూసుకుంటారని చెప్పారు. కానీ.. నేరుగా తనకు కాల్ చేసే సరికి నిజమని నమ్మానని నాగార్జున అన్నారు. అలాగే, ఇరాన్‌లో జరిగిన మరో విషయం గురించి నాగార్జున ప్రస్తావించారు. ‘‘మా బంధువుతో కలిసి షూటింగ్ కోసం ఇరాన్ వెళ్లినప్పుడు.. ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన కొన్ని నిమిషాలకే మాకు ఓ వీడియో కాల్ వచ్చింది. మేము పోలీసులమని.. మీ లగేజ్‌లో నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయి. మీ రూమ్ నుంచి కదలవద్దని అంటూ.. ఆ వీడియో కాల్‌లో చెప్పారు. కానీ నాకు ఈ సైబర్ ఫ్రాడ్‌పై అవగాహన ఉండటంతో.. వెంటనే పోలీసులకు కాల్ చేశా’’ అని నాగార్జున పేర్కొన్నారు.
ఇలాంటివన్నీ గమనించే.. ప్రతీ 15 రోజులకు ఒకసారి తనకు సంబంధించిన ముఖ్యమైన పాస్‌వర్డ్స్ అన్నీ మారుస్తానని నాగార్జున ప్రస్తావించారు. తన ఫోన్‌లో తాను ఒక్క ఫొటో కూడా తీసుకోనని చెప్పుకొచ్చారు. చాలా అప్రమత్తంగా ఉంటానని తెలిపారు. సైబర్ క్రైమ్‌ను అరికట్టడంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా ఉండటం చాలా గొప్ప విషయమని తెలిపారు. ఇది తెలంగాణ పోలీసుల గొప్పతనమని కొనియాడారు. పైరసీని అరికట్టడంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ సజ్జనార్ చాలా కృషి చేశారని పేర్కొన్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకే కాకుండా, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి కూడా డీజీపీ ఆనంద్, సీపీ సజ్జనార్ చాలా మేలు చేశారని నాగార్జున పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
Rare Pic: ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు చిరుని ఏం చేద్దామనుకుంటున్నారో
వారంలోనే.. ఓటీటీలో హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ ‘లెనిన్’
అగ్నిపరీక్షకు పిలిచి అవమానిస్తారా? నీకిదే నా శాపం: ఉప్పల్ బాలు