తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు మోహినీ అవతారం
ABN, Publish Date - Sep 20 , 2026 | 09:29 AM
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన శనివారం ఉదయం తిరుమలలో మోహినీ అవతార వాహన సేవ వైభవంగా జరిగింది.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన శనివారం ఉదయం తిరుమలలో మోహినీ అవతార వాహన సేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీవీఎస్ఓ) కె.వి. మురళీకృష్ణ, ఎస్వీబీసీ చైర్మన్ బి.శ్రీధర్ వర్మతో పాటు పలువురు అధికారులు భక్తుల గ్యాలరీలను పరిశీలించారు. భక్తులను స్వయంగా కలిసి వారికి అందుతున్న సౌకర్యాలు, ఆహారం, తాగునీటి ఏర్పాట్లపై అధికారులు ఆరా తీశారు. భక్తులకు అందజేస్తున్న ప్రసాదాలను అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వయంగా రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. భక్తులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి నేరుగా తీసుకురావాలని ఆయన సూచించారు. తమకు ఎలాంటి అసౌకర్యం లేదని, అన్ని ఏర్పాట్లతో సౌకర్యవంతంగా ఉన్నామని భక్తులు అధికారులకు తెలిపారు. దీంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
శ్రీధర్ వర్మకు అభినందనలు
మోహినీ అవతార వాహన సేవ సందర్భంగా శ్రీ కనుమూరి బాపిరాజు, ఎస్వీబీసీ చైర్మన్ బి.శ్రీధర్ వర్మను కలిశారు. ఎస్వీబీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శ్రీధర్ వర్మకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అందుకు శ్రీధర్ వర్మ కృతజ్ఞతలు తెలిపారు. బాపిరాజు ఆరోగ్యంగా ఉండాలని, శ్రీవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులోనూ ఆయన నుంచి విలువైన సలహాలు, సూచనలు అందుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.