సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Manchu Manoj: ప్రజల నమ్మకాన్ని దెబ్బ తీయొద్దు!

ABN, Publish Date - May 11 , 2026 | 04:23 PM

బండి సంజయ్‌ కుమార్‌ కొడుకు వ్యవహారం ఇప్పుడు చినికి చినికి గాలివానగా మారుతోంది. సినిమావాళ్ళు సైతం ఈ విషయంలో స్పందిస్తున్నారు. తాజాగా మంచు మనోజ్ పోక్సో యాక్ట్ పట్ల విశ్వాసం కలిగేలా ఈ కేసు దర్యాప్తు సత్వరమే జరగాలని అన్నారు.

Manchu Manoj

గత కొంతకాలంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ (Bandi Sanjay Kumar) కుమారుడు భగీరథ్‌పై మీడియాలో విశేష ప్రచారం జరుగుతోంది. మైనర్ బాలికను మోసం చేసిన సందర్భంలో అతనిపై పోక్సో కేసు పెట్టినా... పోలీసులు అరెస్ట్ చేయడం లేదని అంటున్నారు. ఆదివారం ప్రధాని మోదీ (Modi) హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంలో ఈ అంశానికి ప్రతిపక్షాలు మరింత ప్రాధాన్యం ఇచ్చాయి. దాంతో బండి సంజయ్‌ ఆ సభావేదిక మీదనే ఇది తనపై చేస్తున్న రాజకీయ కుట్ర అని ప్రకటించారు. అయితే.... బండి భగీరథ్‌ విషయంలో సినిమా వారు సైతం నిదానంగా స్పందించడం మొదలు పెట్టారు. బీజేపీ అభిమానులం అని చెప్పుకునే వారు సైతం బాధితురాలకి న్యాయం జరగాలని కోరుతున్నారు. తాజాగా ప్రముఖ నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) సైతం ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియచేశారు.


మంచు మనోజ్ ఈ సందర్భంగా తెలియచేస్తూ, 'కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి కుమారుడు బండి భగీరథ్‌పై ఇటీవల నమోదైన పోక్సో కేసు నన్ను తీవ్రంగా కలచివేసింది. పరిస్థితులు ఎలా ఉన్నా.. ప్రతి మైనర్ బాలికకు కచ్చితంగా న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతోనే #POCSO చట్టాన్ని తీసుకువచ్చారని నేను బలంగా నమ్ముతున్నాను. అధికారం, పదవి, పలుకుబడి లేదా హోదా ఎప్పుడూ న్యాయానికి అడ్డు రాకూడదు. రాజ్యాంగం, చట్టం దృష్టిలో ప్రతి బాలికకు సమానమైన న్యాయం దక్కాల్సిందే. మైనర్లకు సంబంధించిన కేసుల్లో వేగంగా స్పందించాలి, అలాగే పారదర్శకత, జవాబుదారీతనం చాలా అవసరం. విచారణలో జాప్యం జరిగినా, మౌనం వహించినా లేదా పక్షపాత చర్యలు తీసుకున్నా.. అది న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ఇది రాజకీయాలకు లేదా వ్యక్తులకు సంబంధించిన విషయం కాదు. కేవలం నిజం బయటకు రావాలి, న్యాయం గెలవాలి. ఎలాంటి ఒత్తిళ్లు, ప్రభావాలకు తావులేకుండా ఈ కేసు దర్యాప్తు, చట్టపరమైన ప్రక్రియలన్నీ అత్యంత వేగంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. న్యాయం జరగడమే కాదు, అది జరిగినట్లు అందరికీ స్పష్టంగా కనిపించాలి. చట్టం ముందు అందరూ సమానులే అని ఈ కేసు ద్వారా మరోసారి నిరూపితం కావాలి' అని పేర్కొన్నారు. మొత్తం మీద కేంద్ర సహాయమంత్రిగా ఉన్న బండి సంజయ్‌ కొడుకు వ్యవహారం ఇప్పుడు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

Updated Date - May 11 , 2026 | 04:25 PM