FNCC: కలిసిన ఇద్దరూ విడిపోయారు!

ABN , Publish Date - Sep 22 , 2026 | 10:32 AM

సీనియర్‌ నిర్మాతలు కె.ఎస్. రామారావు, కె.ఎల్. నారాయణ మరోసారి ఎఫ్.ఎన్.సి.సి. ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. వీరిద్దరి ప్యానెల్స్ ఈసారి ఢీ అంటే ఢీ అనబోతున్నాయి.

KS Ramarao - KL Narayana

మూడు దశాబ్దాల క్రితం ప్రముఖ నిర్మాత, దక్షిణ సినీ భీష్మాచార్యులు డీవీఎస్‌ రాజు (DVS Raju) ఫౌండర్‌ ప్రెసిడెంట్‌గా ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (FNCC) ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ హైదరాబాద్‌ ఫిల్మ్ నగర్ లో కేవలం సినిమా రంగానికి చెందిన వ్యక్తులకే కాకుండా భాగ్యనగరంలోని పలు రంగాలకు చెందిన వారికీ సభ్యత్వాన్ని ఇచ్చి, వివిధ సేవా కార్యక్రమాలను ఈ సంస్థ నిర్వహిస్తోంది. చక్కని ఆతిధ్యానికి మారుపేరుగా నిలవడంతో ఎఫ్.ఎన్.సి.సి.కి మంచి పేరు ప్రఖ్యాతులు లభించాయి. అలానే వినోదాత్మక కార్యక్రమాలతో పాటు జాతీయ స్థాయిలో క్రీడల పోటీలను నిర్వహిస్తూ ఎంతోమంది క్రీడాకారులను ఎఫ్‌.ఎన్.సి.సి. ప్రోత్సహిస్తూ వచ్చింది.


గత కొన్నేళ్ళుగా ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు (K.S. Ramarao), మరో నిర్మాత కె.ఎల్. నారాయణ (K.L. Narayana) రెండు ప్యానెల్స్ గా ఎఫ్.ఎన్.సి.సి. ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చారు. అయితే గత ఎన్నికల్లో ఎలాంటి పోటీ లేకుండా కె.ఎల్. నారాయణ... ప్యానెల్ నుంచే కె.ఎస్. రామారావుకు అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. దాంతో ఏకగ్రీవంగా కమిటీ ఎంపిక జరిగింది. కానీ ఇప్పుడు మరోసారి వీరిద్దరూ తమ తమ ప్యానెల్స్ తో బరిలోకి దిగుతున్నారు.

సెప్టెంబర్‌ 27న జరుగబోతున్న ఎఫ్‌.ఎన్.సి.సి. ఎన్నికల్లో కె.ఎస్‌. రామారావు ప్యానెల్ నుంచి ప్రెసిడెంట్‌ గా కె.ఎస్‌. రామారావు, వైస్ ప్రెసిడెంట్‌ గా కె. అశోక్ కుమార్‌, సెక్రటరీగా బి. రాజశేఖర్ రెడ్డి, జాయింట్‌ సెక్రటరీగా వి.వి.ఎస్.ఎస్. పెద్ది రాజు, ట్రెజరర్ గా కోగంటి భవాని, మేనేజ్ మెంట్ కమిటీ సభ్యలుగా మోహన్‌ వడ్లపట్ల, పి. జనార్దన్‌ రావు, చావా రమేశ్‌, ఎన్.వి. మనోహర్‌ రావు, ప్రమోటీస్‌గా సి. మానిక్‌ రావ్, ఎ. విజయప్రకాశ్‌ రెడ్డి, చలసాని రామారావు, అల్లం అనిల్‌, వెల్లంకి ఉదయ్‌ వర్థన్ పోటీ చేస్తున్నారు.

WhatsApp Image 2026-09-22 at 8.29.40 AM.jpeg


కె.ఎల్. నారాయణ, అల్లు అరవింద్‌ (Allu Aravind), డి. సురేశ్‌ బాబు (D. Suresh Babu) ప్యానెల్ నుంచి ప్రెసిడెంట్‌గా జి. ఆదిశేషగిరిరావు, వైస్ ప్రెసిడెంట్‌గా కె. సదాశివరెడ్డి, సెక్రటరీగా ముళ్ళపూడి మోహన్‌, జాయింట్‌ సెక్రటరీగా ఎస్.ఎన్. రెడ్డి, ట్రెజరర్ గా శైలజ జూజాల, కమిటీ సభ్యులుగా ఏడిద సతీశ్‌ (రాజా), వి.వి.జి. కృష్ణంరాజు, సారిపల్లి శ్రీనివాసరాజు, కిశోర్ మారుపూడి బరిలో నిలిచారు.

WhatsApp Image 2026-09-22 at 8.29.40 AM (1).jpeg


సీనియర్‌ జర్నలిస్ట్, నిర్మాత సురేశ్‌ కొండేటి జాయింట్‌ సెక్రటరీగా, పోలిశెట్టి రాధాకృష్ణ కమిటీ మెంబర్ గా వ్యక్తిగత స్థాయిలో పోటీచేస్తున్నారు. విశేషం ఏమంటే... డి. రామానాయుడు తనయుడు సురేశ్‌ బాబు ప్యానెల్ లో కాకుండా రామానాయుడు మేనల్లుడు, నట, నిర్మాత కె. అశోక్‌ కుమార్‌... కె.ఎస్. రామారావు ప్యానెల్ నుంచి పోటీ చేస్తున్నారు. దాంతో ఈ రెండు ప్యానెల్స్ ఫ్రెండ్లీగానే బరిలోకి దిగుతున్నాయని అనుకోవచ్చు.

ఎఫ్.ఎన్.సి.సి.లో మొత్తం 5,500 మంది సభ్యులు ఉండగా, అందులో 2,500 మందికి ఓటు హక్కు ఉంది. గత కమిటీ కొత్తగా 650 మంది యువ సభ్యులకు ఓటు హక్కు కల్పించింది. సో... ఆదివారం ఉదయం 9.00 గంటల నుంచి 3.30 గంటల వరకూ జరిగే ఈ ఎన్నికల్లో కొత్తగా ఓటు హక్కు పొందిన యువతరం ఈ ప్యానెల్స్ గెలుపుఓటములను నిర్ణయించేలా ప్రధాన పాత్ర పోషించబోతోంది.

ఇవి కూడా చదవండి:

‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్.. అసలు ఊహించలేదు కదా

దర్శకుడు శ్రీను వైట్ల కూతురిని చూశారా.. హాలీవుడ్ మోడల్‌కు ఏమాత్రం తీసిపోదు

మెగాస్టార్‌తో బుచ్చిబాబు.. నిర్మాణ సంస్థ కూడా రెడీ!

Updated Date - Sep 22 , 2026 | 10:35 AM