సినీ ఇండస్ట్రీకి సంగీత దర్శకుడు కోటి విన్నపం.. ఏంటంటే

ABN , Publish Date - Sep 22 , 2026 | 10:39 PM

80, 90వ దశకాల్లో ‘రాజ్–కోటి’ ద్వయంగా చార్ట్‌బస్టర్స్‌తో సరికొత్త ట్రెండ్ సృష్టించినా, ఆ తర్వాత స్వతంత్ర సంగీత దర్శకుడిగా బ్లాక్‌బస్టర్ ఆల్బమ్స్‌తో అలరించినా కోటి ప్రయాణం అద్వితీయం.

Koti Concert Poster Launch

టాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి సినీ ప్రస్థానం దిగ్విజయంగా 50 వసంతాలు పూర్తి చేసుకుంది. 80, 90వ దశకాల్లో ‘రాజ్–కోటి’ ద్వయంగా చార్ట్‌బస్టర్స్‌తో సరికొత్త ట్రెండ్ సృష్టించినా, ఆ తర్వాత స్వతంత్ర సంగీత దర్శకుడిగా బ్లాక్‌బస్టర్ ఆల్బమ్స్‌తో అలరించినా కోటి ప్రయాణం అద్వితీయం. ఈ ఐదు దశాబ్దాల సుదీర్ఘ సంగీత వైభవానికి గుర్తుగా ‘మనతో ఎంటర్‌టైన్‌మెంట్స్’ సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ 28న హైదరాబాద్‌లో ‘కోటి 50: ది బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్ ఇన్ హైదరాబాద్ - ది గ్రాండెస్ట్ రోర్ ఆఫ్ హిజ్ లెగసి’ పేరుతో భారీ లైవ్ కాన్సర్ట్‌ను నిర్వహించనున్నారు. పలు ప్రముఖ సంస్థల స్పాన్సర్‌షిప్‌తో జరగనున్న ఈ ఈవెంట్‌కు సంబంధించిన పోస్టర్‌ను తాజాగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ సినీ పరిశ్రమకు ప్రత్యేక విన్నపం చేశారు.. ‘‘ఈ స్థాయికి రావడానికి కారణమైన నా తల్లిదండ్రులకు, ముఖ్యంగా నా తండ్రి సాలూరి రాజేశ్వరరావు పేరు నిలబెట్టాలనే తపనతోనే ప్రతి పాటనూ మొదటి అవకాశంగా భావించి కష్టపడ్డాను. నాడు రాజ్-కోటిగా, ఆ తర్వాత వ్యక్తిగతంగా తరతరాలు గుర్తుండిపోయే పాటల్ని అందించాను. మా బీట్స్‌కు మెగాస్టార్ చిరంజీవి బ్రేక్ డ్యాన్స్ తోడై ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే నిలిచాయి. నా వద్ద పనిచేసిన ఏఆర్ రెహమాన్, దేవిశ్రీ ప్రసాద్, తమన్, హారిస్ జయరాజ్ వంటి సంగీత దర్శకులు నేడు అగ్రస్థానంలో ఉండటం నాకెంతో గర్వకారణం. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి అగ్ర కథానాయకులందరితోనూ పనిచేశాను. నవంబర్ 28న జరగబోయే ఈ లైవ్ కాన్సర్ట్‌లో నా పాటలతో ప్రేక్షకులను అలరించబోతున్నాం. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సినీ పరిశ్రమ అంతా కదిలివచ్చి, నా ఈ కాన్సర్ట్‌ను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని కోటి విజ్ఞప్తి చేశారు.


Koti Concert.jpg

అతిథులుగా హాజరైన ప్రముఖులు కోటి ప్రస్థానాన్ని ఘనంగా కొనియాడారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి గ్రామఫోన్ ద్వారా కోటి పాటలు వింటూ పెరిగానని, ఆయన అందించిన సంగీతం వల్లే ఎన్నో చిత్రాలు ఘనవిజయం సాధించాయని గుర్తుచేశారు. ఈ భూమ్మీద గాలి ఉన్నంత వరకు కోటి పాటలు నిలిచి ఉంటాయని, నేటి జెన్-జీ తరానికి ఆయన ఘనత ఈ కాన్సర్ట్ ద్వారా తెలుస్తుందని పేర్కొన్నారు. మంజుల రావు జూపల్లి మాట్లాడుతూ.. సంపద కంటే కలకాలం నిలిచే కళ గొప్పదని, నాభి నుంచి వచ్చే భావంతో ప్రతి హీరోకు అద్భుతమైన పాటలు అందించిన సంగీత దర్శకుడు కోటి ఈవెంట్‌లో భాగస్వామ్యం కావడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. మనతో ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత శోభన్ మాట్లాడుతూ.. ఆడియో క్యాసెట్ల కాలం నుంచి నేటి ఏఐ టెక్నాలజీ యుగం వరకు ఐదు దశాబ్దాలుగా నిలకడగా సంగీత రంగాన్ని ఏలిన ఏకైక లెజెండ్ కోటి అని, ఆయన బీట్స్ మన హార్ట్‌బీట్స్ లాంటివని ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి:

ఖైరతాబాద్‌ మహా గణపతి సన్నిధిలో ‘వేదవ్యాస్‌’ టీమ్ పూజలు

మోక్షజ్ఞ ఎంట్రీ.. బాలయ్య ప్లానింగ్ అదిరింది

‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్.. అసలు ఊహించలేదు కదా

Updated Date - Sep 22 , 2026 | 10:39 PM