కమల్ హాసన్ పార్టీలో ముసలం...
ABN , Publish Date - Apr 07 , 2026 | 03:35 PM
తమిళనాట ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న కమల్ హాసన్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయడం లేదని తెలిపారు. ఈ నిర్ణయంతో కమల్ హాసన్ పార్టీలో ముసలం మొదలైందని అంటున్నారు.
అనుకున్నంతా అయ్యింది! అధికార డీఎంకేకు మద్దతు పలికే క్రమంలో కమల్ హాసన్ ఇప్పుడు తన పార్టీ నాయకుల చేతుల్ని కట్టేశారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్‌కు చెందిన మక్కళ్ నీది మయ్యం పార్టీ తరఫున ఎవరూ ఎన్నికల బరిలో దిగడం లేదు. ప్రస్తుతం కమల్ హాసన్ డీఎంకే పార్టీకి మిత్రపక్షంగా ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన తన పార్టీ తరఫున అభ్యర్థులను పోటీకి దించకుండా డీఎంకేకు మద్దతు పలికారు. దాంతో డీఎంకే పార్టీ కమల్ హాసన్ రుణం తీర్చుకోవడం కోసం ఆయన్ని రాజ్యసభకు పంపింది.
ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ తన పార్టీ తరఫున కొంతమంది అభ్యర్థులను పోటీకి దించాలనే తొలుత భావించారు. పొత్తులో భాగంగా డీఏంకేను కొన్ని సీట్లు కేటాయించమని కోరారు. అంతే కాదు... తన పార్టీ తరఫున పోటీ చేయాలని అనుకుంటున్న వారిని 50 వేల రూపాయల రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోమని ప్రకటించారు. దాంతో పలువురు ఆశావాహులు రుసుము చెల్లించి దరఖాస్తులు పెట్టుకున్నారు. కానీ కమల్ హాసన్ ఆశించిన స్థాయిలో డీఎంకే సీట్లు కేటాయించడానికి అంగీకరించలేదు. పైగా తాను ఇచ్చే సీట్లలో పోటీ చేసే అభ్యర్థులంతా డీఎంకే పార్టీ గుర్తు మీదనే పోటీ చేయాలనే నిబంధన విధించింది. ఇది కమల్ హాసన్‌కు ఇష్టం లేకపోయింది. దాంతో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టనని, కార్యకర్తలంతా స్వచ్ఛందంగా డీఎంకేకు మద్దతు పలుకుతారని చెప్పారు. దీంతో ఇప్పటికే కమల్ హాసన్ పార్టీ నుండి టిక్కెట్ కోసం అప్లికేషన్స్ పెట్టిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. దరఖాస్తు రుసుము కింద తీసుకున్న 50 వేల రూపాయలను వాపసు ఇవ్వమంటున్నారట.
అయితే... ఇందులో ఎలాంటి నిజం లేదని కమల్ హాసన్ అంటున్నారు. ప్రత్యర్థి పార్టీల వారు సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం ఇదని, తమను ఎవరూ డబ్బులు వెనక్కి అడగలేదని చెబుతున్నారు. కానీ కొందరు మాత్రం కమల్ హాసన్ వైఖరిని తప్పు పడుతున్నారు. ఎన్నికల్లో సీటు ఇస్తామని చెప్పి, డబ్బులు తీసుకున్ని, ఇప్పుడు అసలు పోటీ చేయొద్దని చెప్పడం సమంజసం కాదని అంటున్నారు. అప్లికేషన్ కోసం తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తేనే కమల్ హాసన్ పరువు నిలుస్తుందని అంటున్నారు. మరి దీనికి కమల్ హాసన్ ఏ మేరకు మనసులోకి తీసుకుంటాడో చూడాలి.