జంగిల్ బూగీ: అడవిలో 90 రోజులు!
ABN, Publish Date - May 16 , 2026 | 03:20 PM
జంగిల్ బూగీ రియాల్టీ షో కర్టెన్ రైజర్ కార్యక్రమంలో హైదారబాద్‌లో జరిగింది. ఇందులో షోలో పార్టిసిపెంట్స్ దట్టమైన అడవిలో తొంభై రోజుల పాటు గడపాల్సి ఉంటుంది!
క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బూగీ కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ రియాల్టీ షోలో తెలుగు లయన్స్, హిందీ హాక్స్, తమిళ్ టైగర్స్, మావెరిక్స్, కన్నడ పాంథర్స్... ఇలా ఐదు టీమ్స్ పాల్గొననున్నాయి. ఈ నెల 17,18వ తేదీల్లో హైదరాబాద్ లో ప్రసాద్ ల్యాబ్స్ వేదికగా జరిగే ఆడిషన్స్ నుంచి వివిధ దశల వడబోత తర్వాత పోటీదారులను ఎంపికచేయనున్నారు. ఈ ఆడిషన్స్‌లో దాదాపు 200 మంది పాల్గొంటారని అంచనా. ఆడిషన్స్ నుంచి ఎంపికైన వారు 90 రోజుల పాటు అడవిలో ఉంటూ కార్యక్రమ నిర్వాహకులు సూచించే సాహసాలు చేయాల్సి ఉంటుంది. ఎలిమినేషన్స్ తట్టుకుని మిగిలిన కంటెస్టెంట్ విజేత గా నిలుస్తారు.
శనివారం జరిగిన ఈ జంగిల్ బూగీ కర్టెన్ రైజర్ ఈవెంట్ లో సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ, 'జంగిల్ బూగీ అనే రియాల్టీ షోను ఒక పాన్ ఇండియా మూవీ స్థాయిలో డిజైన్ చేయడం గొప్ప విషయం. ఈ రియాల్టీ షో పార్టిసిపెంట్స్‌తో పాటు షో నిర్వాహకులకు కూడా ఒక ఛాలెంజ్ అనుకోవచ్చు. ఎగ్జైటింగ్ కాన్సెప్ట్ తో వస్తున్న జంగిల్ బూగీ రియాల్టీ షో అన్ని భాషల్లో మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. డైరెక్టర్ యశోధర విక్రమ్ మాట్లాడుతూ, 'నేను దర్శకుడిగా, రైటర్‌గా కన్నడ చిత్ర పరిశ్రమలో పలు చిత్రాలు చేశాను. ఈ కాన్సెప్ట్ నా మిత్రుడు వినోద్ ఇచ్చారు. ఆయన గతంలో కొన్ని రియాల్టీ షోస్ చేశారు. నేను ఒక మూవీ కోసం ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు ముందు ఈ రియాల్టీ షో చేద్దాం ఆ తర్వాత సినిమా చేద్దాం అన్నారు. కాన్సెప్ట్ విన్న తర్వాత ఇది చాలా కష్టమైన రియాల్టీ షో, ఛాలెంజింగ్ గా ఉంటుందని అనిపించింది. ప్రముఖ ఛానెల్స్‌ను అప్రోచ్ అయ్యాం. పైలట్ ఎపిసోడ్ అడిగారు. త్వరలోనే వారి నుంచి అప్రూవల్ వస్తుంది. జంగిల్ బూగికి దర్శకత్వం వహించడం ఛాలెంజింగ్‌గా తీసుకున్నాను. మీ అందరి సపోర్ట్ మాకు ఉంటుందని ఆశిస్తున్నాం' అని అన్నారు.
ఎపిక్ ప్రొడక్షన్స్ అధినేత పార్థసారథి మాట్లాడుతూ, 'భారత్ అంటే వివిధ సంస్కృతుల సమ్మేళనం. పేరుకే వివిధ రాష్ట్రాల నుంచి పోటీ అని పెట్టాం కానీ మన కల్చర్ ఒకటే అనే చెప్పే ఉద్దేశంతో ఈ షో చేస్తున్నాం. ప్రకృతికి మనం దూరమై పోతూ ఉన్నాం. అడవి అనేది కనుమరుగు అవుతోంది. అడవి, పంటపొలాలు, ప్రకృతి... ఎంత గొప్పగా ఉంటాయో అందరికీ చూపించాలనే లక్ష్యంతో జంగిల్ బూగీ రియాల్టీ షో నిర్వహిస్తున్నాం' అని చెప్పారు. జనరల్ క్రియేటివ్ టీమ్ రషీద్ మాట్లాడుతూ, 'టీవీ కార్యక్రమాలు చాలా వరకు అసహజంగా ఉంటాయి. మా రియాల్టీ షో రియల్ గా ఉంటుంది. ఎక్కడా ఆర్టిఫిషల్‌గా అనిపించదు. ఫారెస్ట్ లో 90 రోజుల పాటు అనేక అడ్వెంచర్స్‌తో సాగే సరికొత్త రియాల్టీ షో జంగిల్ బూగీ' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ వై.జె. రాంబాబు, సురేశ్ కొండేటి, టీమ్ మెంబర్ కమల, దర్శక నిర్మాత ఘంటా శ్రీనివాస్ తదితరులు పాల్గొని ఈ రియాల్టీ షో ఘన విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.