YouTuber Nandana: నేను ఎవరినీ మోసం చేయలేదు.. అంతా తప్పుడు ప్రచారం! పొంతన లేని సమాధానాలు
ABN, Publish Date - Sep 08 , 2026 | 08:11 PM
లండన్ వీసాలు, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కోట్లాది రూపాయల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నందూస్ వరల్డ్ నిర్వాహకురాలు రమా నందన మంగళవారం ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.
విదేశాలకు వీసాలు, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ యూ ట్యూబ్ లో ప్రచారాన్ని హోరెత్తించారు.. ఒక్కొక్కరి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు కోట్ల రూపాయలు కొల్ల గొట్టారు. భాదితుల ఫిర్యాదుతో బయటకు వచ్చినా.. విచారణకు సహకరించకుండా న్యాయవాదులను వెంటేసుకుని పోలీసు స్టేషన్ లో హల్ చల్ చేశారు. అదేమంటే మీడియానే తనను దోషిగా చూపిస్తుందే తప్ప తాను మోసం చేయలేదంటూ ఎదురు వాదించారు. ఇదీ యూ ట్యూబర్ రమానందన్ (YouTuber Nandana) వ్యవహారం. ఒకవైపు బాధితులు న్యాయం కావాలంటూ గగ్గోలు పెడుతుంటే.. తనకు సంబంధం లేదంటూ డబ్బులు ఎగ్గొట్టేందుకు యత్నిస్తున్న రమానందన్ కు పోలీసులు, న్యాయవాదులు రాచమర్యాదలు చేయడం చూసి బాధితులు మండిపడుతున్నారు.
యూకే లండన్ వీసాలు, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కోట్లాది రూపాయల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నందూస్ వరల్డ్ నిర్వాహకురాలు రమా నందన మంగళవారం ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ఆమె మందీ మార్భలం, న్యాయవాదుల సమూహాన్ని వేసుకుని కారును నేరుగా సీఐ జీపు వరకు తీసుకు వచ్చి ఆపడం.. అక్కడే ఉన్న మీడియా వారిని చీత్రీకరించేందుకు యత్నించడంతో.. వారిని ఆమెతో వచ్చిన న్యాయవాదులు అడ్డుకోవడంతో కొంత గందరగోళం నెలకొంది. మూడు గంటల పాటు జరిగిన విచారణలో మాత్రం ఆమె నేరం అంగీరించక పోగా, తన భర్తే ఆర్ధిక లావాదేవీలు చూసుకున్నారంటూ సమాధానాలను దాటవేయడం విశేషం. తనపై కేసు నమోదు కావడంతో కొంతకాలంగా విదేశాల్లో ఉంటున్న రమా నందన సోమవారం అమెరికా నుంచి ఎమిరేట్స్ విమానంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
అయితే, ఆమెపై ఇదివరకే నమోదైన వీసా చీటింగ్ కేసుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ ఆధారంగా ఇమిగ్రేషన్ అధికారులు ఆమెను ఎయిర్‌పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఇబ్రహీంపట్నం పోలీసులు శంషాబాద్ చేరుకుని, 41A సీఆర్‌పీసీ నోటీసులు అందజేసి విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఈరోజు మంగళవారం ఉదయం విచారణకు వస్తామని చెప్పిన ఆమె మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత న్యాయవాదులను వెంటేసుకుని రెండు కార్లలో పోలీస్టేషన్ వద్దకు చేరుకున్నారు. బయట కారు ఆపి లోపలకు నడుచుకుంటూ వెళ్లాల్సిన ఆమె.. తన రెండు కార్లను నేరుగా పోలీస్టేషన్ లోపలకు వేగంగా పోనిచ్చి.. సీఐ జీపు వద్ద ఆపారు. ఇదే సమయంలో మీడియా ప్రతినిధులు ఆమె రాకను గమనించి చిత్రీకరిస్తుండగా వారిపైకి వేగంగా కారును పోనివ్వడం వివాదంగా మారింది.
ఆతర్వాత కూడా పోలీస్టేషన్ లోపల సీఐ గది వైపు వెళుతున్న రమానందన్ ను చిత్రీకరించేందుకు యత్నించిన మీడియా ప్రతినిధులపై ఆమెతో వచ్చిన న్యాయవాదులు అడ్డుకోవడంతో వాగ్వివాదం జరిగింది. ఉద్యోగాల పేరుతో లక్షలు వసూలు చేయడమే కాకుండా మందీ మార్భలం తరహాలో న్యాయవాదుల సమూహాన్ని వెంటేసుకుని హడావుడి చేసినా.. కనీసం పోలీసులు వారించకపోవడం చూసి అక్కడ ఉన్న బాధితులు సైతం ఆవేదన వ్యక్తం చేశారు. ఆతర్వాత సీఐ సుబ్రహ్మణ్యం బయటకు వచ్చి రమానందన తో వచ్చిన న్యాయవాదులను, కారులను బయటకు పంపాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా విచారణ ప్రక్రియ జరుగుతున్న సమయంలో స్టేషన్ లోపలికి వెళ్లేందుకు లాయర్లు ప్రయత్నించడం, నియమ నిబంధనల ప్రకారం పోలీసులు వారిని నియంత్రించేందుకు యత్నించడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆతర్వాత సీఐ సుబ్రమణ్యం మూడు గంటల పాటు రమానందన ను విచారించారు. బాధితుల నుంచి వసూలు చేసిన కోట్లాది రూపాయల నగదు లీకేజీ, షెల్ కంపెనీల ఏర్పాటు, నకిలీ 'సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్' పత్రాల జారీపై రమా నందనను ప్రశ్నించారు.
అయితే, పోలీసుల నుంచి ఎదురైన కీలక ప్రశ్నలకు ఆమె పొంతన లేని సమాధానాలు చెబుతూ.. విచారణకు ఏమాత్రం సహకరించలేదు. కన్సల్టెన్సీలతో తనకు కానీ, తన భర్తకు కానీ ఎలాంటి సంబంధం లేదని, అంతా తప్పుడు ప్రచారమంటూ ఆమె తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆర్ధిక లావాదేవీలు కూడా తన భర్తే చూశారని , తాము ఎవరినీ మోసం చేయలేదని పోలీసులతో వాదించారు. ఆమె నుంచి స్టేట్ మెంట్ రికార్డు చేసిన అనంతరం బయటకు పంపేయడంతో.. మీడియా ప్రతినిధులు ఆమెను చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే తాను తప్పు చేయలేదని, ఎవరిని మోసం చేయలేదని, మీడియానే తాను మోసం చేసాను అని చెబుతోందంటూ పరుగెత్తుకుంటూ కారులోకి వెళ్లిపోయారు. అయితే ఇదే సమయంలో ఆమెకు అడ్డుగా పోలీసులే కాపలా కాసి మీడియా ప్రతినిధులను ఫాలో కాకుండా నియంత్రించడం విశేషం. మూడు గంటల విచారణలో రమానందన సహకరించలేదని, ఏది అడిగినా తన భర్త పేరు చెబుతుందని, అందుకే విదేశాల్లో ఉన్న అతన్ని పిలిపించి విచారిస్తామని సీఐ తెలిపారు.