సరిగమల వెనక గరళం.. అమెరికాలో ప్రముఖ వాయులీన విద్వాంసుడు అరెస్ట్.. చిన్మయి ఏమన్నారంటే!
ABN, Publish Date - Nov 23 , 2026 | 07:03 AM
మైనర్‌పై లైంగిక నేరాల ఆరోపణలతో ప్రముఖ వాయులీన విద్వాంసుడు హెచ్.ఎన్. భాస్కర్ అమెరికాలో అరెస్టయ్యారు.
కర్ణాటకకు చెందిన ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు హెచ్ఎన్ భాస్కర్ (50) (Bhaskar Hirisave Narasimhamurthy), మైనర్‌పై లైంగిక నేరాలకు పాల్పడ్డ కేసులో అమెరికాలో అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆయన మస్సాచు సెట్స్‌లోని బోస్టన్ జైలులో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఏడాది సెప్టెంబరు 4-26 నడుమ కాలిఫోర్నియాలో 18 ఏళ్లలోపు బాలికపై ఆయన లైంగిక నేరాలకు పాల్పడినట్టు పేర్కొంటూ పోలీసులు నాలుగు అభియోగాలు నమోదు చేశారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు టి.ఎం. కృష్ణ, గాయని చిన్మయి శ్రీపాద దీనిపై 'ఎక్స్'లో స్పందించారు. రెండు దశాబ్దాలకు పైగా భాస్కర్‌తో కలిసి అనేక కచేరీలు చేసిన టి.ఎం. కృష్ణ దీనిపై తీవ్ర విచారం, ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
సినిమా, సంగీతం సహా పలు రంగాల్లో మహిళలపై జరిగే లైంగిక వేధింపులపై తరచూ గళమెత్తే చిన్మయి శ్రీపాద.. ఈ వార్త తనకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదని, కర్ణాటక సంగీత విద్వాంసుల్లో (Carnatic Music Controversy) ఇలాంటి వారు చాలామంది ఉన్నారని.. వారంతా తమ గ్రూపులు, ముఠాల రక్షణలో ఉన్నా రని 'ఎక్స్'లో ఒక పోస్టు పెట్టారు. ఇదే తరహాలో విద్యార్థులతో పదేపదే అసభ్యంగా వ్యవహరించే మరో వయోలిన్ విద్వాంసుడు ఉన్నాడని ఆమె ఆరోపించారు.
"శాస్త్రీయ సంగీత రంగంలో ఇలాంటి వారు ఎంతోమంది బహిరంగంగా, గర్వంగా, పశ్చాత్తాపం లేకుండా భక్తి ముసుగులో ఉన్న తోడేలులా తిరుగుతున్నారు. వారు విదేశాల్లో అరెస్టు కావాలని ప్రార్ధించడం, ఆశించడం తప్ప ఎవరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే భారతదేశంలో అది ఎప్పటికీ జరగదు" అని ఆమె వాపోయారు. కర్ణాటక, హిందుస్థానీ సంగీత రంగాలకు సంబంధించిన ప్రముఖులపై ఇలాంటి ఆరోపణలు గతంలో కూడా వచ్చాయి.
ఉదాహరణకు.. 2018లో 'మీటూ ఉద్యమం' సమయంలో త్యాగరాజన్, చిత్రవీణ విద్వాంసుడు ఎన్.రవి వయొలినిస్ట్ నాగై శ్రీరామ్, మృదంగం విద్వాంసులు మన్నార్‌గుడి ఎ. ఈశ్వరన్, శ్రీముష్ణం వి.రాజారావు, ఆర్.రమేశ్, తిరువారూర్ వైద్యనాథన్ లపై పలువురు మహిళా విద్యార్థులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దీంతో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వారిని మార్గళి ఉత్సవాల్లో పాల్గొనకుండా నిషేధించింది.
అలాగే.. చెన్నైలోని తొమ్మిది ప్రధాన సభలు వారిమీద వచ్చిన ఆరోపణలపై అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేశాయి. 2020లో భోపాల్‌కు చెందిన హిందుస్థానీ సంగీత విద్వాంసులు, గుండేచా బ్రదర్స్‌గా పేరొందిన అఖిలేశ్ గుండేచా, ఉమాకాంత్ గుండేచా, రమాకాంత్ గుండేచాలపై కూడా లైంగిక వేధింపులు, అత్యాచార ఆరోపణలు వచ్చాయి. కథక్ దిగ్గజం బిర్జూ మహరాజ్ చనిపోయిన తర్వాత.. పలువురు నర్తకులు ఆయన, ఆయన శిష్యుల్లో కొందరు తమతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపించారు.