IFFI: సినిమా పండుగ.. 86 దేశాలు.. 150కి పైగా సినిమాలు!

ABN , Publish Date - Nov 21 , 2026 | 10:02 AM

ప్రపంచ సినిమా సంబరాలకు గోవా వేదికైంది. వివిధ దేశాలకు చెందిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సినీ ప్రముఖులు, చిత్రాభిమానులతో అక్కడ సందడి నెలకొంది

ప్రపంచ సినిమా సంబరాలకు గోవా (Goa Film Festival) వేదికైంది. వివిధ దేశాలకు చెందిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సినీ ప్రముఖులు, చిత్రాభిమానులతో అక్కడ సందడి నెలకొంది. ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫి - 57th Iffi) 57వ ఎడిషన్‌ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. తొమ్మిది రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలకు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌, నటుడు, ఎంపీ రవికిషన్‌, ప్రముఖ దర్శకుడు, ఫెస్టివల్‌ డైరెక్టర్‌ అశుతోష్‌ గోవారికర్‌, ఎంపీ సదానంద్‌ షెట్‌ తానవాడే, కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి చంచల్‌ కుమార్‌ తదితరులు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో చిత్రోత్సవాలను అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ దర్శకులు, సాంకేతిక నిపుణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే వేదిక ఇఫి అని పేర్కొన్నారు. ఈ వేడుకలు చిత్ర పరిశ్రమకు చెందిన వారందరికీ కొత్త అవకాశాలను పరిచయం చేయడంతో పాటు, సినీ ప్రియులకు విభిన్న దేశాల కథలను పరిచయం చేస్తాయని అన్నారు. ఈ ప్రారంభ వేడుకల్లో నటీనటులు సాయి పల్లవి, కార్తిక్‌ ఆర్యన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వివిధ దేశాలకు చెందిన సంగీతకారులు కలిసి ప్రదర్శించిన ‘మ్యూజిక్‌ వితౌట్‌ బోర్డర్స్‌’ కార్యక్రమం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.


sai palalvi.jpeg

ఈసారి ఇఫిలో భారతీయ చిత్రాలతో పాటు ప్రపంచంలోని 86 దేశాల నుంచి ఎంపిక చేసిన 150కి పైగా అంతర్జాతీయ సినిమాలను ప్రదర్శించనున్నారు. విభిన్న భాషలు, సంస్కృతులు, కథాంశాలతో రూపొందిన చిత్రాలను ఒకే వేదికపై చూసే అవకాశం సినీ అభిమానులకు లభించనుంది. అంతేకాకుండా ప్రపంచ సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొని తమ అనుభవాలను పంచుకోనున్నారు.

ఈ ఏడాది ఇఫి ప్రారంభోత్సవ చిత్రంగా పావెల్‌ పావ్లీకోవ్స్కీ రూపొందించిన ‘ఫాదర్‌ల్యాండ్‌’ను ప్రదర్శించారు. నోబెల్‌ బహుమతి గ్రహీత, రచయిత థామస్‌ మాన్‌ నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ప్రశంసలు, అవార్డులు అందుకున్న ఈ సినిమా ఇఫిలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో థామస్‌ మాన్‌ తన కుమార్తె ఎరికాతో కలిసి చేపట్టిన సవాళ్లతో కూడిన రోడ్‌ ట్రిప్‌ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. తండ్రీకూతుళ్ల అనుబంధంతో పాటు అప్పటి రాజకీయ, సామాజిక పరిస్థితులను ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న 39వ యూరోపియన్‌ ఫిల్మ్‌ అవార్డుల కోసం ఉత్తమ యూరోపియన్‌ చిత్రం, ఉత్తమ దర్శకుడు సహా తొమ్మిది విభాగాల్లో నామినేషన్లు దక్కించుకోవడం ఈ సినిమా ప్రత్యేకత.  

ALSO READ:

Moon Walk: 25 ఏళ్ల తర్వాత 'మూన్ వాక్' కోసం.. రిలీజ్ ఎప్పుడంటే..

ఎమ్మెల్యే పాడెమోసిన సీఎం విజయ్..
Sukumar: సుకుమార్.. దుబాయిలో ఏం చేస్తున్నారంటే.

Updated Date - Nov 21 , 2026 | 11:18 AM