2026 Elections: సినీ జనాలకు మిశ్రమ స్పందన
ABN, Publish Date - May 06 , 2026 | 05:10 PM
ఇటీవల కొన్ని రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు సినిమా వాళ్ళు పోటీ చేసి విజయం సాధించారు. అయితే పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ నుండి కేరళలో ఎన్.డి.ఎ. నుంచి పోటీ చేసిన తారలకు మాత్రం చుక్కెదురైంది.
తాజాగా జరిగిన తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళలోని అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడి కొందరు సినిమా తారలు తమ అదృష్టం పరీక్షించుకున్నారు. తమిళనాడులో తొలిసారి స్టార్ హీరో విజయ్ (Vijay) ఎన్నికల బరిలో దిగి ఏకంగా సీఎం పీఠాన్ని అధిరోహించబోతుండగా, ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పార్టీ అధికారాన్ని కోల్పోతోంది. అయితే లక్కీగా ఉదయనిధి ఎమ్మెల్యేగా గెలిచాడు. అలా వివిధ రాష్ట్రాలలో నిలబడి గెలిచిన వారు, ఓడిపోయిన వారు ఎవరో తెలుసుకుందాం.
ఎప్పటిలానే ఈసారి కూడా పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సినిమా వాళ్ళకు బాగానే సీట్లు ఇచ్చింది. అయితే అందులో నయనా బందోపాధ్యాయ మాత్రమే చౌరంఘీ నియోజకవర్గం నుండి గెలిచారు. ఆమె ఈ స్థానం నుండి గెలవడం ఇది మూడోసారి. విశేషం ఏమంటే... ప.బెంగాల్‌లో బీజేపీ కూడా తమ పార్టీని నమ్ముకున్న చాలామంది సినిమా వాళ్ళకు ఈసారి టిక్కెట్ ఇచ్చింది. వారిలో ప్రముఖ నటి, ద్రౌపది పాత్ర ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రూపా గంగూలీ ఉన్నారు. ఆమె సోనార్ పూర్ దక్షిణ్ నుండి గెలిచారు. నటుడు హిరణ్మయ్ ఛటోపాధ్యాయ షాయంపూర్ నియోజకవర్గం నుండి గెలిచారు. బీజేపీకే చెందిన రుద్రనీల్ ఘోష్ శిబ్‌పుర్ నియోజక వర్గం నుండి 16 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఒకప్పటి ప్రముఖ నటి పాపియా అధికారి టోలీగంజ్ నియోజక వర్గం నుండి బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచారు.
ఇక ముందు చెప్పినట్టు తమిళనాడులో విజయ్ పోటీ చేసిన పెరంబూర్, తిరుచురాపల్లి (తూర్పు) నుండి గెలిచారు. అలానే ఉదయనిధి స్టాలిన్ చెపాక్-ట్రిప్లికేన్ నుంచి డీఏంకే తరఫున విజయం సాధించారు. ప్రముఖ మలయాళ హాస్య నటుడు రమేశ్ పిషారోడి కేరళలోని పాలక్కాడ్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించాడు.
గెలిచిన వారి వివరాలు ఇలా ఉంటే... ఈసారి రాజకీయాలలో తమ అదృష్టం పరీక్షించుకున్న పలువురు ఓడిపోయారు. సోనార్‌పూర్ దక్షిణ్ సిట్టింగ్ ఎమ్మెల్యే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అరుంధతి లవ్లీ మైత్ర ఈసారి ఓటమి పాలయ్యారు. రూపా గంగూలీ చేతిలో ఆమె పరాజయం పాలయ్యారు. అలానే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాణిక్‌తల నియోజకవర్గం నుండి పోటీ చేసిన నటి శ్రేయా పాండే బీజేపీ అభ్యర్థి తపస్ రాయ్ చేతిలో ఓడిపోయారు. అలానే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బర్నాగల్ సిట్టింగ్ ఎమ్మెల్యే నటి సయంతిక బెనర్జీ ఈసారి ఓడిపోయారు. ఇక మరో టీఎంసీ అభ్యర్థి, గాయని అదితీ మున్షీ సైతం రాజర్ హట్ గోపాల్‌పూర్ నుండి ఓటమి పాలయ్యారు. ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్, రాష్ట్ర మంత్రి, చందన్ నగర్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంద్రనీల్ సేన్ బీజేపీ అభ్యర్థి దీపన్ జన్ కుమార్ గుహా చేతిలో ఓడిపోయారు. ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత రాజ్ చక్రవర్తి బారక్‌పూర్ నియోజకవర్గం నుండి టీఎంసీ తరఫున పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కౌస్తువ్ బాగ్చి చేతిలో ఓడిపోయారు. ఆయన ఈ నియోజకవర్గపు సిట్టింగ్ ఎమ్మెల్యే. ప్రముఖ బెంగాలీ నటుడు, నిర్మాత, టీవీ పర్సనాలిటీ సోహం చక్రవర్తి కరింపూర్ నియోజకవర్గం నుండి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. కెరీర్ ప్రారంభంలో సినిమా, టీవీలో నటించిన తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్, నామ్ తమిళర్ కట్చి అధినేత సీమన్ సైతం ఈసారి ఎన్నికల్లో ఓడిపోయారు. అలానే ప్రముఖ నటి ఖుష్బూ భర్త, నట దర్శక నిర్మాత సుందర్ సి సైతం పుతియా నీగి కట్చి పార్టీ తరఫున మధురై సెంట్రల్ నుంచి పోటీ చేసి, ఓటమి పాలయ్యారు. చిత్రం ఏమంటే... త్రిష గురించి అసభ్యంగా మాట్లాడిన ప్రముఖ తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ఈ సారి లాల్ గుడి నియోజవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాడు. ఆయనకు 101 ఓట్లు వచ్చాయి.
ఇదిలా ఉంటే... కేరళలో ఈసారి ఎన్.డి.ఎ. చాలామంది సినిమా, టీవీ వాళ్ళకు టిక్కెట్ ఇచ్చింది. కానీ వారెవ్వరూ విజయ పతాకాన్ని ఎగరేయలేదు. ప్రముఖ మలయాళ నటి అంజలీ నాయర్ కేరళలోని త్రిపుణితుర అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్.డి.ఎ. అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆమె మూడో స్థానం దక్కింది. ఇక్కడ కాంగ్రెస్‌కు చెందిన దీపక్ జాయ్ గెలిచారు. సీపీఐ (ఎం)కు చెందిన కె.ఎన్. ఉన్నికృష్ణన్ రెండో స్థానంలో నిలిచారు. 'పరస్పరం' సీరియల్‌లో సూరజ్ పాత్రతో చక్కని గుర్తింపు తెచ్చుకున్న వివేక్ గోపన్ బీజేపీ తరఫున తిరువనంతపురంలోని అరువిక్కర నియోజకవర్గం నుంచి పోటీ చేసి మూడోస్థానంలో నిలిచారు. ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్స్కిస్టు) అభ్యర్థి స్టీఫెన్ గెలిచారు. టీవీ నటుడు ప్రోమి కురియాకోస్ అంగమాలి నియోజకవర్గం నుండి ఎన్.డి.ఎ. అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రోజీ ఎం జాన్ గెలిచారు. నటి, టెలివిజన్ వ్యాఖ్యాత, మలయాళం బిగ్ బాస్ ఫేమ్ అతిర డి నాయర్ ఎన్.డి.ఎ. తరఫున ఎట్టుమానూర్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. కానీ ఈ ఎన్నికల్లో ఆమె మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి నట్టకోమ్ సురేశ్ గెలిచారు. చిత్ర నిర్మాత, బిగ్ బాస్ మలయాళం సీజన్ 5 విజేత అఖిల్ రాజ్ త్రికక్కర అసెంబ్లీ నుండి ఎన్.డి.ఎ. తరఫున బరిలో దిగాడు. అయితే ఈ స్థానంలో కాంగ్రెస్ కు చెందిన ఉమా థామస్ విజయాన్ని అందుకున్నారు. అఖిల్ రాజ్ మూడో స్థానంతో నిలిచారు. నటుడు, సినీ దర్శక నిర్మాత మేజర్ రవి కేరళలోని ఒట్టపాలెం నుండి బీజేపీ టిక్కెట్ పై పోటీ చేశారు. సైన్యం నుండి వచ్చిన ఆయన దేశభక్తి ప్రేరిత చిత్రాలను రూపొందించారు. అయితే ఈ ఎన్నికల్లో మేజర్ రవికి మూడో స్థానం దక్కింది. బోలెడన్ని ఆశలతో ఎన్.డి.ఎ. (NDA) తరఫున పోటీ చేసిన వీరందరికీ చుక్కెదురైంది.