దీపావళి స్పెషల్.. తెలుగు సినిమాల్లో అలరించిన పండగ పాటలు ఇవే!
ABN, Publish Date - Nov 08 , 2026 | 10:33 AM
దీపావళి పండగ సందర్భంగా తెలుగు సినిమాల్లో ప్రేక్షకులను అలరించిన ప్రత్యేక పాటలను మరోసారి గుర్తు చేసుకుందాం.
వెన్నెల రోజు - అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు - దీపావళి (Deepavali) రోజు.. అని పెద్దలు చెప్పారు. అదే తీరున అమావాస్య రోజు వచ్చే దీపావళిని ఆబాలగోపాలం ఆనందంగా జరుపుకుంటారు. నవంబర్ 8న దీపావళి. అందరికీ మరింత ఆనందం కలిగేలా పండగ సాగాలని కోరుకుందాం.
ఆబాల గోపాలాన్నీ అలరించే పండగల్లో దీపావళి (Diwali) దే పైచేయి. దసరాకు సరదాలు పంచుకున్నా, దీపావళి రోజున కాల్చే టపాకాయల్లోనే అసలైన ఆనందం కనిపిస్తుంది. నిజానికి టపాకాయలు కాల్చడమంటే డబ్బులను వృధా చేసుకోవడమే!. అయినా ఎంత పిసినారి అయినా సరే ఒక్క కాకరొత్తయినా కాల్చి దీపావళి జరుపుకున్నామని ఆనందిస్తాడు. అందుకే దీపావళి పండగంటే ఇంటింట ఆనందం నింపేదని ఈనాటికీ అందరూ భావిస్తారు.
ఆశ్వయుజ చతుర్దశినాడే లోకకంటకుడైన నరకాసురుడు మరణించాడు. ఆ మరుసటి అమావాస్య రోజునే దీపావళి జరుపుకుంటాం. నరకాసురుడు భూదేవి కొడుకు. ఆ తల్లిచేతిలోనే అతను అంతమవడం విధిలీల. అంటే తప్పులు చేసేవాడిని కన్నతల్లి కూడా క్షమించదు అనే నీతిని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ కథ తెలియని తెలుగువారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.
దీపావళి పండగంటే ఖర్చుతో కూడుకున్నదే. టపాకాయలకు డబ్బు ఖర్చు పెట్టడం వేస్ట్ అనేవారున్నారు. అలా ఖర్చు చేయడమే బెస్ట్ అనుకొనేవారూ ఉన్నారు. ఎవరి టేస్ట్ ను బట్టి వారు ఎలా అనుకున్నా దీపావళి మాత్రం అందరినీ ఆకర్షించే పండగ అని చెప్పక తప్పదు. అందువల్ల దీపావళి నాడు మతాబులు కాల్చి ఆనందించేవారే అధికంగా కనిపిస్తారు. టపాకాయలు కాల్చి ఆనందించడంలో తప్పులేదు - తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సాగితేనే అసలైన ఆనందం మన సొంతమంతమవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని అందరూ దీపావళి జరుపుకుంటారని ఆశిద్దాం.
ఇదిలాఉంటే.. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నాటి నుంచి నేటి వరకు దశాబ్దాలుగా సినిమాల్లో వచ్చిన అనేక గీతాలు (Telugu Movie Festival Songs) ప్రేక్షకులను అలరించాయి. వాటిలో 'మామగారు' సినిమాలోని 'ఈ నాడే అచ్చమైన దీపావళి', 'చక్రం' మూవీలోని 'రంగేళి హోళీ'.. 'షావుకారు'లోని "దీపావళి దీపావళి', 'ఇంటింటి దీపావళి' నుంచి 'ఇంటింట దీపావళి వచ్చేనమ్మా', చిరంజీవి 'సంఘర్షణ' సినిమాలోని 'సంబరాలో సంబరాలు' వంటి ప్రేక్షకాదరణ పొందిన కొన్ని గేయాలు మీ కోసం.