సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Anurag Kashyap: పాన్ ఇండియా సినిమా ఓ పెద్ద స్కామ్‌.. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Nov 15 , 2026 | 09:56 AM

పాన్ ఇండియా సినిమాలను పెద్ద స్కామ్‌గా అభివర్ణించిన బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్.. భారీ బడ్జెట్ చిత్రాలు, బాలీవుడ్ మూస ధోరణి, మలయాళ సినిమా పరిశ్రమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Anurag Kashyap

సినిమా ఒక కళారూపంగా కాకుండా లాభాలు ఆర్జించే వ్యాపారంగా మారిపోయిందని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, న‌టుడు (Bollywood Director) అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) ఆవేదన వ్యక్తం చేశారు. పాన్ ఇండియా సినిమా (Pan India Movies) కాన్సెప్టును ఒక పెద్ద స్కామ్‌గా అభివర్ణించారు. అది పూర్తిగా సినిమా నిర్మాతలు, వ్యాపారవేత్తలు సృష్టించిన మోసమని విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా మెక్‌డోనాల్డ్స్ ఒకే రకమైన రుచి, ఒకే రకమైన తయారీ పద్ధతి ఉన్నట్లే.. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు కూడా సృజనాత్మకతను కోల్పోయి. మూస ధోరణితో రూపొందుతున్నాయని పేర్కొన్నారు.

శనివారం అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వేదికగా జరిగిన ఛాయా సాహిత్యోత్సవం (Chaya Sahitya Utsav) లో అనురాగ్ కశ్యప్ మాట్లాడారు. భారీ బడ్జెట్ సినిమాల (Big Budget Movies) వ్యవహారం చలనచిత్ర వ్యవస్థలను నాశనం చేసిందని ఆరోపించారు. పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాల వల్ల చిన్న సినిమాలకు థియేటర్లు దొరకని పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు. ఇక మలయాళ చిత్ర పరిశ్రమను (Malayalam Film Industry) ఒక మంచి వైరస్‌గా అనురాగ్ కశ్యప్ అభివర్ణించారు.

మలయాళంలో నటులు, దర్శకులు, నిర్మాతల మధ్య సహకార ధోరణి కనిపిస్తోందని కొనియాడారు. అక్కడ కనిపించే కలిసికట్టుగా పని చేసే తత్వం మిగతా ప్రాంతాల సినిమా పరిశ్రమలకు వ్యాపించాలని ఆకాంక్షించారు. మలయాళ సినీపరిశ్రమలో తానే గొప్ప హీరో అని ఎవరూ అనుకోరని, అక్కడెవరూ వందల కోట్ల రూపాయలు డిమాండ్ చేయరని పేర్కొన్నారు. ప్రస్తుతం సినిమా రూపకర్తలలో ఒకరకమైన భయం నెలకొందని, ఏది చూపిస్తే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయోననే ఆందోళనతో నిజాయతీగా కథలు చెప్పలేకపోతున్నారని తెలిపారు.

ఈ సమావేశానికి సతీశ్ చప్పరికి సమన్వయ కర్తగా వ్యవహరించారు. ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కె.శ్రీనివాస్‌ ఛాయా సాహిత్యోత్సవం రెండో ఎడిషన్ ప్రారంభోపన్యాసం చేశారు. 'కానరాని మంటల్లో బూడిదవుతున్న పుస్తకాలు' అంశంపై వాసిరెడ్డి నవీన్ అధ్యక్షతన వీక్షణం వేణుగోపాల్, ఎస్. కాత్యాయిని మాట్లాడారు. సమాజాన్ని కుదిపే సాహిత్యం అవసరమా?" అంశంపై సమావేశంలో ప్రొ. మృణాళిని, రాజ్యసభ సభ్యురాలు సల్కా, నిఘత్ సహిబా ప్రసంగించారు.

ఇదిలాఉంటే ఇప్ప‌టికే విజ‌య్ సేతుప‌తి మ‌హారాజా, అడ‌వి శేష్ డెకాయిట్ సినిమాల‌తో ద‌క్ష‌ణాది సినిమా ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైన అనురాగ్ ప్ర‌స్తుతం చిరంజీవి కాకా, బాల‌కృష్ణ దాదా సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషిస్తుండ‌డం విశేషం.

Updated Date - Nov 15 , 2026 | 10:06 AM