సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Devisri Prasad: సిల్వర్ స్క్రీన్ పై.. మ్యూజిక్ డైరెక్టర్స్

ABN, Publish Date - Jan 16 , 2026 | 02:28 PM

మ్యూజిక్ డైరెక్టర్స్... హీరోలుగా నటించడం కొత్తేమీ కాదు... ఇటీవలే ఎ.ఆర్. రెహ్మాన్ ఓ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తాడనే వార్త రాగా, తాజాగా దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం 'ఎల్లమ్మ' గ్లింప్స్ విడుదలైంది.

Actors turend Music Directors

స్వరరాగ గంగాప్రవాహంలో మునకలేసే మ్యూజిక్ డైరెక్టర్స్ కెమెరా ముందుకు వస్తే అది కచ్చితంగా విశేషమే! గతంలో ఎందరో ఆ తీరున సాగారు. ఇప్పుడు సంగీత దర్శకులు హీరోలుగానూ అలరిస్తూ ఉండడం మరింత విశేషంగా మారింది.

గత సంవత్సరం విఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్. రహమాన్ నటనలో అడుగు పెడుతున్న విశేషం వినిపించింది. ఇప్పుడు మరో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా స్క్రీన్ పై తళుక్కుమన బోతున్న అంశం వెలుగు చూసింది. వీరిద్దరూ కనుక యాక్టర్స్ గా విజయం సాధిస్తే తప్పకుండా మరికొందరు మ్యూజిక్ డైరెక్టర్స్ తెరపై కనిపిస్తారని సినీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. గతంలో కొన్ని చిత్రాల్లో కేమియో అప్పియరెన్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ త్వరలో నటదర్శకుడు వేణు రూపొందించబోయే 'ఎల్లమ్మ'లో కథానాయకునిగా నటించనున్నారు. ఈ విషయం తెలియగానే దేవిశ్రీ బాణీలకు అభిమానులైన వారు ఆనందిస్తున్నారు.


సంగీత దర్శకులు కెమెరా ముందుకు వచ్చి అలరించిన సందర్భాలున్నాయి. అయితే అప్పట్లో వారు ప్రత్యేక సన్నివేశాల్లో మాత్రమే కనిపించి ఆకట్టుకున్నారు. మన దేశంలో ఓ సంగీత దర్శకుడు హీరోగా నటించిన క్రెడిట్ దక్కించుకున్న ఫేమస్ ఫిగర్ ఎవరంటే ప్రఖ్యాత గాయకుడు కిశోర్ కుమార్ అనే చెప్పాలి. ఆయన హీరోగా పలు చిత్రాలు ఘనవిజయం సాధించాయి. తరువాతి రోజుల్లో కిశోర్ కుమార్ గాయకునిగానే కొనసాగి అలరించారు. ఘంటసాల, మాధవపెద్ది సత్యం, పెండ్యాల వంటివారు కొన్ని పాటల్లో కనిపించి ఆకట్టుకున్నారు. తెలుగునాట పూర్తిస్థాయిలో నటులుగా అలరించిన సంగీత దర్శకులు ఎవరంటే చక్రవర్తి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనే చెప్పాలి. వీరిద్దరూ నటులుగా అలరించిన తీరు కూడా మరపురానిది. బాలు మాతృభాష తెలుగులోనే కాదు తమిళ చిత్రాల్లోనూ నటించి ఆకట్టుకున్నారు.


ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, వందేమాతరం శ్రీనివాస్ సైతం కొన్ని చిత్రాలలో నటించారు. అలానే ఆర్పీ పట్నాయక్ కూడా పలు చిత్రాలలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి సైతం కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. రాజ్ కూడా పలు చిత్రాలలో ప్రాధాన్యమున్న పాత్రలను చేశారు. ఇక నవతరం విషయానికి వస్తే పలువురు సంగీత దర్శకులు హీరోలుగా అలరించే ప్రయత్నం చేస్తున్నారు. వారిలో ముందుగా విజయ్ ఆంటోని ని గుర్తు చేసుకోవాలి. విజయ్ ఆంటోని హీరోగా రూపొందిన పలు చిత్రాలు తమిళంలోనే కాదు అనువాదరూపంలో తెలుగువారినీ విశేషంగా అలరించాయి. ఇక ఆయన బాటలోనే పయనిస్తూ ఎ.ఆర్. రహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాశ్ కుమార్ సైతం కొన్ని చిత్రాల్లో హీరోగా నటించి మురిపించారు. హిప్ హాప్ తమిళ సైతం కొన్ని తమిళ చిత్రాలలో హీరోగా నటించి, మెప్పించాడు. అలానే అనిరుధ్ రవిచందర్ కొన్ని చిత్రాల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. అనిరుధ్ హీరోగా ఓ సినిమా రూపొందనుందని అప్పట్లో వినిపించింది. ఎ.ఆర్.రహమాన్ 'మూన్ వాక్'అనే చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా 'ఎల్లమ్మ' తెరకెక్కనుంది. దిల్ రాజు నిర్మించే ఈ చిత్రంతో దేవిశ్రీ ప్రసాద్ నటునిగా ఏ తీరున అలరిస్తారో అన్న ఆసక్తి ఆడియెన్స్ లో నెలకొంది. ఒకవేళ దేవిశ్రీ కూడా హీరోగా సక్సెస్ అయితే మరి కొందరు మ్యూజిక్ డైరెక్టర్స్ కథానాయకులుగా కదం తొక్కే ఛాన్స్ ఉందంటున్నారు. ఏమవుతుందో చూడాలి.

Updated Date - Jan 16 , 2026 | 04:56 PM