దసరా బరిలో.. చిరంజీవి వర్సెస్ రజనీకాంత్ వర్సెస్ ధనుష్!
ABN, Publish Date - Jul 03 , 2026 | 02:34 PM
సంక్రాంతికి సినిమా సందళ్ళు బాగానే సాగినా- వేసవికి బొమ్మ నీరు గారింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ బాక్సాఫీస్ వద్ద హంగామా మొదలైంది. దాంతో అందరి చూపు దసరా సీజన్ వైపు సాగుతోంది.
సంక్రాంతికి సినిమా సందళ్ళు బాగానే సాగినా- వేసవికి బొమ్మ నీరు గారింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ బాక్సాఫీస్ వద్ద హంగామా మొదలైంది. దాంతో అందరి చూపు దసరా సీజన్ (Dussehra 2026) వైపు సాగుతోంది. పలువురు స్టార్ హీరోస్ సినిమాలు రిలీజ్ అవుతాయని వినిపిస్తోన్నా, మూడు సినిమాల ముచ్చట ఇప్పుడు భలేగా సాగుతోంది... అదేంటో చూద్దామా!
మళ్ళీ ఆసక్తికరం..!
ఈ సారి దసరాకు సినిమా సందడి ఓ రేంజ్‌లో ఉంటుందని మొన్నటి వరకు విశేషంగా వినిపించింది. ఎందుకంటే ఈ సీజన్ లోనే బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీ, నాగార్జున వందో సినిమా, వెంకటేశ్ ‘ఆదర్శకుటుంబం హౌస్ నెంబర్ 47’ వస్తాయని టముకు సాగింది. అయితే వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న ‘ఆదర్శకుటుంబం’ అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా రిలీజ్ కానుంది. అంటే దసరాకు ముందుగానే సందడి చేయనుందన్న మాట. చిరంజీవి ‘విశ్వంభర’ (Vishwambhara) చిత్రాన్ని కూడా అదే సీజన్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం... ఇప్పుడు నాగ్ నూరవ సినిమా పోటీ నుంచి తప్పుకొని.. మరో డేట్ ఎంచుకోనున్నట్టు తెలుస్తోంది. బాలయ్య - గోపీచంద్ మూవీ కూడా డిసెంబర్‌లో వస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో దసరాకు చిరంజీవి ‘విశ్వంభర’కు లైన్ క్లియర్ అయ్యేట్టు కనిపిస్తోంది. అయితే అదే సమయంలో రజనీకాంత్ ‘జైలర్-2’ కూడా వస్తూ ఉండడంతో మళ్ళీ పోటీ ఆసక్తికరంగా మారింది.
వారిద్దరి మధ్య మూడోసారి..
చిరంజీవి- రజనీకాంత్ (Chiranjeevi and Rajinikanth) మధ్య బాక్సాఫీస్ వార్ అన్నది అంతగా లేదనే చెప్పాలి. 1999లో ఇరవై రోజుల గ్యాప్‌లో రజనీకాంత్ ‘నరసింహ’, చిరంజీవి ‘ఇద్దరు మిత్రులు’ పోటీపడ్డాయి. ‘నరసింహ’ సూపర్ హిట్‌గా నిలచింది. 2023 ఆగస్ట్ 10న రజనీకాంత్ ‘జైలర్’ రిలీజ్ కాగా, మరుసటి రోజునే చిరంజీవి ‘భోళాశంకర్’ జనం ముందు నిలచింది. రజనీకాంత్ ‘జైలర్’ బంపర్ హిట్ అనిపించుకుంది. అలా రెండు సార్లు చిరంజీవిపై రజనీకాంత్ పైచేయి సాధించారు. దాంతో ఈ సారి పోటీ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి సినీ ఫ్యాన్స్‌లో విశేషంగా చోటు చేసుకుంది. రజనీకాంత్ ‘జైలర్-2’ సినిమా అక్టోబర్ 15న డేట్ లాక్ చేసుకుంది. మరుసటి రోజునే చిరంజీవి ‘విశ్వంభర’ రానుందనేది తాజా టాక్. ‘జైలర్’ మొదటి భాగం ముందు చిరంజీవి ‘భోళాశంకర్’ బోల్తా కొట్టింది. అదే సినిమా రెండో భాగంతో ‘విశ్వంభర’ పోటీ పడనుంది. ఈ సారి రిజల్ట్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి కలుగుతోంది. నెల్సన్ డైరెక్షన్‌లో రజనీకాంత్ ‘జైలర్’ సూపర్ హిట్ కావడంతో, రెండో భాగంపైనా భారీ అంచనాలున్నాయి. ఇక యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి ‘విశ్వంభర’ సైతం వీఎఫ్ఎక్స్‌తో మ్యాజిక్ చేయనుందని వినిపిస్తోంది. అందువల్ల మూడోసారి బాక్సాఫీస్ బరిలో తలపడుతున్న చిరు- రజనీ పోటీపై ఆసక్తి నెలకొంది.
అతనే... ప్రధానాకర్షణ!
రజనీకాంత్ ‘జైలర్-2’ (Jailer 2), చిరంజీవి ‘విశ్వంభర’ మధ్య పోటీనే ఆసక్తికరంగా ఉంటే.. తమిళనాడులో రజనీ తన మాజీ అల్లుడు ధనుష్ (Dhanush) సినిమా ‘ఓమ్’ (OM)తో పోటీ ఎదుర్కొంటున్నారు. ధనుష్ ‘ఓమ్’ చిత్రం అక్టోబర్ 16న రిలీజ్ కానుంది. ఈ సినిమా ఎటూ తెలుగులోనూ డబ్ అవుతుంది. అయితే అదే రోజున చిరంజీవి ‘విశ్వంభర’ కూడా బరిలో ఉంటుంది కాబట్టి, ధనుష్ ‘ఓమ్’కు తెలుగునేలపై అంతగా థియేటర్స్ లభించక పోవచ్చు. అందువల్ల తెలుగునాట రజనీకాంత్ వర్సెస్ చిరంజీవి అన్నదే సాగుతుంది. తమిళనాట మాత్రం రజనీ ‘జైలర్-2’తో మరుసటి రోజునే వచ్చే ధనుష్ ‘ఓమ్’ ఢీ కొంటుంది కాబట్టి.. అక్కడ పోటీ రసవత్తరంగానూ మారనుందని ట్రేడ్ టాక్. ‘ఓమ్’ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి డైరెక్టర్. ఇందులో మళయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. అందువల్ల ‘ఓమ్’పైనా బజ్ బాగానే ఉంది. ఏది ఏమైనా ఈ సారి దసరా సందడిలో రజనీకాంత్ ‘స్పెషల్ ఎట్రాక్షన్’గా నిలవనున్నారు. ఎందుకంటే తెలుగునేలపై తన మిత్రుడు చిరంజీవితో పోటీ పడుతున్న రజనీకాంత్, తమిళనాడులో మాజీ అల్లుడు ధనుష్‌తో ఢీ కొంటున్నారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.
ఇవి కూడా చదవండి:
72nd National Awards: జ్యూరీ ఛైర్మన్ మలయాళీ కాబట్టి.. అల్లు అర్జున్‌కి డౌటేనా!?
National Award: మళ్లీ అల్లు అర్జున్‌కేనా? అదే జరిగితే చరిత్రే!
‘రావు బహదూర్’.. ఆంధ్ర, సీడెడ్, నైజాంలో వేరువేరుగా టికెట్ ధరలు