సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ప్రాస‌ల కోసం తంటా.. నోరుజారి ఆగ‌మాగం! సెల‌బ్రిటీలు.. మీరు మార‌రా

ABN, Publish Date - Feb 25 , 2026 | 04:05 PM

సినిమా ఫంక్షన్స్‌లో అభిమానుల్లో జోష్‌ నింపడం కోసం సరదా వ్యాఖ్యలు చేయడం వేరు. కానీ కొందరు సినిమా వాళ్ళు ప్రాస కోసం పాకులాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇటీవల రెండు సినిమా వేడుకల్లో తమన్, వంశీ నందిపాటి చేసిన వ్యాఖ్యలను పలువురు తప్పుపడుతున్నారు.

film people

సంబరాల సమయంలో అంబరాన్ని అంటే ఆనందంలో కొన్నిసార్లు ఎవరికైనా 'టంగ్ స్లిప్' అవుతూ ఉంటుంది. వేరేవారి కథేమో కానీ - సినిమా సెలబ్రిటీస్ మాట తూలితే అది వైరల్ గా మారడం ఖాయం. ఇటీవల కాలంలో మన సెలబ్రెటీలు అలా నోరు జారటం ఎక్కువైంది. అదే వారిని ట్రోల్స్ కు గురిచేస్తోంది.

'కోర్టు' సినిమా చూసినవారికి అందులో నటించిన యువజంట హర్ష్‌ రోషన్ (Harsh Roshan), శ్రీదేవి (Sridevi) గుర్తుండే ఉంటారు. వారిద్దరూ కలసి నటించిన 'బ్యాండ్ మేళం' మార్చి 13న విడుదల కానుంది. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో థమన్ (Thaman) అతిథిగా పాలుపంచుకున్నారు. రోషన్, శ్రీదేవి ఈ సందర్భంగా 'బ్యాండ్ మేళం' (Band Melam) లోని మ్యూజిక్ కు చిందులేశారు. వారి డాన్స్, హుక్ స్టెప్ నచ్చిన థమన్ మాట్లాడుతూ ఉత్సాహంలో 'మీ ఇద్దరి కెమిస్ట్రీ ఇలానే... ఫిజిక్స్ అవ్వకుండా చూసుకోండి' అనేశారు. 'కెమిస్ట్రీ - ఫిజిక్స్ అన్న సబ్జెక్ట్స్ ను తన స్పీచ్ లో ఉపయోగించానని థమన్ భావించారే కానీ, ఆయన మాటలను లోతుగా పరిశీలిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. నిజానికి అక్కడే జనం థమన్ మాటలకు కేకలు వేయగానే ఆయన సర్దుకున్నారు. 'అంటే గొడవలు రాకుండా చూసుకోండి' అంటూ కవర్ చేసేశారు. అయినా థమన్ పై ట్రోల్స్ తప్పలేదు. అసలే సోషల్ మీడియా రాజ్యమేలుతున్న కాలమిది. ఎవరు ఏమి మాట్లాడినా ఆచి తూచి మాట్లాడాలి. లేకుంటే ఎంత పెద్ద సెలబ్రిటీస్ అయినా ట్రోల్స్ కు గురికాకుండా తప్పించుకోలేరు.


సినిమా రంగం అందరినీ ఆకర్షించేది. కాబట్టి ఇక్కడ టాప్ స్టార్స్ గా ఉన్నవారు మరింత జాగ్రత్తగా వేదికలపై మాట్లాడాలి. లేకుంటే ఎంతటివారైనా ట్రోల్స్ సంగతి అటుంచి, సమాజంలో గౌరవం పోగొట్టుకోవలసి వస్తుంది. ఓ సందర్భంలో చిరంజీవి (Chiranjeevi) తనకు మనవరాలు పుట్టినప్పుడు, 'మనవడు పుట్టలేదన్న విచారం ఉందని' వ్యాఖ్యానించారు. అంత బిగ్ స్టార్ కు 'లింగ వివక్ష' ఉందంటూ ట్రోల్స్ సాగాయి. ఈ మధ్య 'మన శంకరవరప్రసాద్ గారు' సక్సెస్ మీట్ ఆనందంలో చిరంజీవి సినిమారంగంలోకి అమ్మాయిలు రావాలని అంటూ చిత్రసీమ అద్దం లాంటిది ఎవరు ఎలా ఉంటే అలాగే అందులోని వాళ్ళు చూస్తారు అని వ్యాఖ్యానించారు. ఆయన మాటల్లో 'కాస్టింగ్ కౌచ్' గురించి చెప్పారనీ ట్రోల్స్ చేశారు. ఇక మరో టాలీవుడ్ టాప్ స్టార్ బాలకృష్ణ (Balakrishna) సైతం నారా రోహిత్ నటించిన 'సావిత్రి' ఆడియో వేడుకలో ఆడవాళ్ళపై మాట తూలారు. తరువాత మహిళాసంఘాల వారు ధ్వజమెత్తడంతో 'సారీ' చెప్పారు. ఇలా ఎంతటివారైనా నోరు జారి తరువాత నాలుక్కరచుకున్న సందర్భాలున్నాయి. ఆ మధ్య గోవాలో జరిగిన 'ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్'లో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ కూడా 'కాంతారా'లోని ఓ సీన్ ను మిమిక్రీ చేసి చిక్కుల్లో పడ్డారు. తమ మనోభావాలను దెబ్బతీశారంటూ బెంగళూరుకు చెందిన ఓ న్యాయవాది రణవీర్ పై కేసు కూడా వేశారు. దాంతో రణవీర్ కర్ణాటక హైకోర్టు మెట్లెక్కవలసి వచ్చింది.


నిజానికి రణవీర్ సింగ్ (Ranveen Singh) తన స్పీచ్ లో 'కాంతారా'లో నటించిన రిషభ్ శెట్టిని ఆకాశానికి ఎత్తేశారు. కానీ, సినిమాలో హీరో నటనను అనుకరిస్తూ చేసిన మిమిక్రీనే తప్పు పట్టారు జనం. మొత్తానికి కర్ణాటక హై కోర్టులో రణవీర్ కు ఊరట లభించింది. ఇక శివాజీ తన 'దండోరా' మూవీ రిలీజ్ సమయంలో లేడీస్ కాస్ట్యూమ్స్ పై చేసిన కామెంట్స్ ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. శివాజీ నటిస్తూ నిర్మించిన 'సాంప్రదాయిని సుప్పినీ సుద్దపూసని' సినిమా వేడుకలో ఈ మూవీ రిలీజ్ చేస్తోన్న నందిపాటి వంశీ కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. ఇందులో నాయికగా నటించిన లయను పొగిడేస్తూ 'లయ నందులను పందుల్లా పెంచుకుంటోంది' అన్నారు. ఇంకేముంది 'నంది' అవార్డులను చులకనగా మాట్లాడావ్ అంటూ నందిపాటిపై ట్రోల్స్ సాగుతున్నాయి. దాంతో వారి సినిమాలకు పబ్లిసిటీ సంగతి అంటుంచి, నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఇకపైనైనా మన సెలబ్రెటీలు నోరు జారకుండా ఉంటారేమో చూద్దాం.

Updated Date - Feb 25 , 2026 | 07:35 PM